2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మెచ్చుకునే పాలన అందిస్తానన్నారు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. జనం విన్నారు సరే అన్నారు. తిరుగులేని మెజారిటీతో సిఎంని చేసి ఆశీర్వదించారు. వచ్చే ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న తరుణంలో ఇపుడు జగన్ మోహన్ రెడ్డి ఒకటే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నేను చేసింది చూడండి. అది మీకు నచ్చితేనే ఓటు వేయండి అని అంటున్నారు. ఇలా తమ పాలన చూసి ఓటు నచ్చితేనే ఓటు వేయండి అనడానికి చాలా గట్స్ ఉండాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మూడున్నరేళ్ల పాలనలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95శాతానికి పైగా అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ప్రతిపక్షాలయితే జగన్ మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కుతున్నారే తప్ప అభివృద్ధిని చేయడం లేదని ఆరోపిస్తున్నాయి. అసలు జగన్ మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలన ఎలా ఉంది. ఆయన ఎన్నికల్లో చెప్పినవి నిజంగానే చాలా మటుకు అమలు చేశారా. అభివృద్ది అన్నది మచ్చుకు కూడా లేదా. కేవలం సంక్షేమ పథకాలు అమలు చేసి ఓట్లు దండుకుందామని జగన్ మోహన్ రెడ్డి అనుకుంటున్నారని తమ పన్నుల ఆదాయాన్ని పప్పు బెల్లాల్లా పంచేసి రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం టిడిపి నిత్యం విమర్శిస్తోంది. ఈ క్రమంలో ఆర్ధిక రంగ నిపుణుల ఆలోచనలు ఆధారం చేసుకుంటే ఏపీలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం అయితే పరుగులు పెడుతోందని అంటున్నారు నిపుణులు. వివిధ సంక్షేమ పథకాల అమలు తీరులోనూ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తుండడంతో లంచాలు, అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది.దాని వల్ల ప్రభుత్వం ఇద్దామనుకున్న మొత్తం నయాపైసలతో సహా పేదలకు చేరినట్లయ్యిందంటున్నారు మేథావులు.
అయితే ఎన్నికల హామీల అమలులో అక్కడక్కడా తప్పడడుగులూ ఉన్నాయంటున్నారు నిపుణులు. ఉదాహరణకు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషాదాన్ని అమలు చేస్తామన్నారు జగన్ మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక ఒకే సారి 43 వేల బెల్ట్ షాపులను ఎత్తివేశారు. అలాగే మద్యం దుకాణాల సంఖ్యనూ తగ్గించారు. అలాగే వైన్ షాపుల వేళలూ తగ్గించారు. అంతా బానే ఉంది కానీ కొన్ని రకాల బ్రాండ్ల మద్యం మాత్రమే అందుబాటులో పెట్టారు. ఎక్కువ మంది ఇష్టపడే బ్రాండ్లు ఏపీలో దొరికేవి కావు. దాంతో అవి తెలంగాణా నుండి అక్రమంగా దిగుమతి చేసి అమ్మేవారి సంఖ్య పెరిగింది. ఇది ఒక విధంగా ప్రభుత్వ వైఫల్యమే. అలాగే మద్యం అలవాటును తప్పించడానికే అన్నట్లు మద్యం ధరలు అమాంతం పెంచేశారు. ఈ రెండు నిర్ణయాల పట్ల ఏపీలో ప్రత్యేకించి మందుబాబుల్లో అసంతృప్తి ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో వీరి ప్రభావం ఎలా ఉంటుందన్నది చూడాలి.
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్ధు చేస్తామని మరో కీలక హామీ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. అయితే అధికారంలోకి వచ్చాక కానీ దాని వెనక ఉన్న సమస్య ఆయనకు అర్ధం కాలేదు. సిపిఎస్ రద్దును అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఆర్ధిక వేత్తలు తేల్చి చెప్పడంతో ఆ హామీ అలా ఆగిపోయింది. దీనిపై ఉద్యోగ వర్గాల్లో ఆందోళనలు ఉన్నాయి. ఇక ఇసుక అక్రమ తవ్వకాలకు బ్రేకులు వేస్తామన్న జగన్ మోహన్ రెడ్డి కొంత మేరకు దాన్ని నిజం చేశారు. పైగా టిడిపి హయాంలో ఇసుక అమ్మకాలపై ప్రభుత్వానికి దమ్మిడీ వచ్చేది కాదు. ఈ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని టిడిపి, జనసేనలు దుయ్యబడుతున్నాయి. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. కాకపోతే 2019 ఎన్నికలకు ముందు ఏపీలో రహదారులకు మరమ్మతులు చేయాల్సి ఉండగా అందుకోసం కేటాయించిన నిధులను చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమకు మళ్లించేసి రోడ్లను వదిలేశారు. జగన్ మోహన్ రెడ్డి సిఎం కాగానే రహదారులు దారుణంగా ఉన్నాయంటూ అదే చంద్రబాబు నాయుడు విమర్శించడం మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత రహదారులను అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు కానీ ఇంకాస్త వేగం అందుకోవలసి ఉంది. ఇక్కడే ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మూడున్నరేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచమే ఆర్ధికంగా కుప్పకూలింది. ఏపీలోనూ ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆదాయాలు పడిపోయాయి. ఉపాధి అవకాశాలు పోయాయి. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథాకాలు ఏవీ కూడా ఆగకుండా చిత్తశుద్ధితో అమలు చేసిన ఘనత మాత్రం జగన్ మోహన్ రెడ్డిదే అంటున్నారు మేథావులు. ఈ విషయంలో టిడిపి సీనియర్ నేతలు మాత్రం పైకి విమర్శించినా తమ ఆంతరంగిక సంభాషణల్లో మాత్రం ఒప్పుకుంటోన్న పరిస్థితి.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక ఏపీలో విద్య, వైద్య రంగాల రూపు రేఖలు మారిపోయాయి. ఆసుపత్రుల ఆధునికీకరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే కాకుండా వేలాది సంఖ్యలో వైద్య సిబ్బందిని నియమించి చరిత్ర సృష్టించారు. 16కు పైగా మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి రెండున్నర వేలకు పైగా రుగ్మతలను చేర్చిన ప్రభుత్వం ఒకే సారి వెయ్యికి పైగా అంబులెన్సులను కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. వై.ఎస్.ఆర్. క్లినిక్స్ ను గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ పేరట మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు కూడా. కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థే మెచ్చుకుంది.
ఇక విద్యా రంగంలో నాడు నేడు పేరిట పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. పిల్లలకు పుస్తకాలు బ్యాగ్ ,షూస్, యూనిఫారాల కిట్స్ ఉచితంగా అందించారు. అమ్మవొడి పథకం ద్వారా విద్యార్ధుల్లో డ్రాపవుట్లను తగ్గించారు. ఇన్ ఫోసిస్ వంటి మేటి ఐటీ కంపెనీలతో విద్యాసంస్థలను టై అప్ చేయించి మెరుగైన శిక్షణలు ఇప్పిస్తున్నారు. ఈ మధ్యనే బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకుని పిల్లలకు ఉచితంగా ట్యాబ్స్ అందించారు. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నారు. అయితే ఇవే సరిపోతాయా అభివృద్ది అవసరం లేదా అని అడిగేవాళ్లు లేకపోలేదు.
ఏపీలో అభివృద్ధి లేదు పరిశ్రమలు ఏపీ నుండి తరలిపోతున్నాయి అన్న విమర్శల్లో ఏ మాత్రం నిజం లేదు.
ఎందుకంటే దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మూడేళ్లుగా నంబర్ వన్ గా కొనసాగుతోంది.
పారిశ్రామిక పెట్టుబడుల్లోనూ చాలా రాష్ట్రాలకన్నా మిన్నగా ఉంది. గత చంద్రబాబు నాయుడి హయాంతో పోల్చినా ఈ మూడున్నరేళ్లలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ లెక్కలన్నీ ఏపీ ప్రభుత్వమో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీయో చెప్పిన లెక్కలు కావు. కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో పార్లమెంటులో ఇచ్చిన సమాధానాల్లోనే ఇవి ఉన్నాయి.
నీతి అయోగ్ పలు సందర్భాల్లో ఏపీ పనితీరును మెచ్చుకుంటూనే ఉంది. అంచేత అభివృద్ధి అన్నది లేదన్నది శుద్ద అబద్ధం. విద్య వైద్య రంగాలపై ఏ రూపంలో పెట్టుబడి పెట్టినా అది అభివృద్ధిగానే చూడాలని ఆర్ధిక రంగ మేథావులు అంటున్నారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా గ్రామీణ ఆదాయాన్ని పెంచగలిగారు. దాని వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ విప్లవాత్మకంగా మెరుస్తూనే ఉందని రిజర్వు బ్యాంకు లెక్కలే చెబుతున్నాయి. ఏపీలో కొత్తగా ఫిషింగ్ హార్బర్లు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. పోర్టుల నిర్మాణానికీ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కొత్త కొత్త పారిశ్రామిక వాడలు అవతరిస్తున్నాయి. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నది ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
సో మొత్తం మీద ఆయన ప్లస్ లు మైనస్ లు చూసుకుంటే కొన్ని మైనస్ లు కచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. కాకపోతే మైనస్ ల కన్నా ప్లస్ లే ఎక్కువగా ఉన్నాయి. బహుశా ఆ ధీమాతోనే జగన్ మోహన్ రెడ్డి నేను చేసిన పనులు నచ్చితేనే ఓటు వేయండి లేకపోతే వేయద్దు అని ధైర్యంగా చెప్పగలిగారని రాజకీయ పండితులు అంటున్నారు. తనకు 2019లో ఒక్క ఛాన్స్ ఇచ్చిన ఏపీ ప్రజలు ఇపుడు తాను చేసిన పనులు చూసి మరో ఛాన్స్ ఇస్తారని జగన్ నమ్మకంగా ఉన్నారు. అందుకే వైనాట్ 175 అంటున్నారు. మరి ఆయన అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో కాలమే చెప్పాలి.