ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యూమెంటరీ రచ్చ రచ్చ అవుతోంది. దీనిపై రాజుకున్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా బీసీసీ డాక్యుమెంటరీపై స్పందించింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ ని మీడియా ప్రశ్నించగా ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అమెరికా, భారత్ రెండు అభివృద్ధి చెందుతున్న శక్తివంతమైన ప్రజాస్వామ్యాలుగా వాటి భాగస్వామ్య విలువలు మాత్రమే తెలుసని డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అంతకుముందు యూకే ప్రధాని రిషి సునాక్ కూడా మోడీకి మద్దతు పలికారు. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఎంపీ ఇమ్రాన్ హుస్సెన్ బ్రిటన్ పార్లమెంట్లో బీబీసీ డాక్యుమెంటరీపై చర్చను లేవనెత్తారు. గుజరాత్ అల్లర్లలో మోడీప్రమేయం ఉందంటూ దుయ్యబట్టారు. దీనిపై యూకే ప్రధాని రిషి సునాక్ స్పందిస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. ప్రపంచంలో ఎక్కడ హింస జరిగినా సహించమని చెబుతూనే అందులో మోడీ పాత్ర ఉందనే విషయంలో తాను ఏకీభవించనని చెప్పేశారు.
2002 గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉందని ఆరోపిస్తూ “ఇండియా ది మోడీ క్వశ్చన్” పేరిట బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. మోడీకి వ్యతిరేకంగా ఉన్న రెండు భాగాల సిరీస్‌లో మొదటి ఎపిసోడ్‌ను బీబీసీ యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసింది. ఈ డాక్యుమెంటరీపై దుమారం రేగడంతో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది అదొక విద్వేషపూరిత చర్యగా భారత విదేశాంగ శాఖ అభివర్ణించింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు భారత్ వ్యతిరేక ఎజెండాను ప్రచారం చేయడానికి అప్లోడ్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. మళ్లీ తన ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వీడియోలను అప్లోడ్ చేస్తే బ్లాక్ చేయమని యూట్యూబ్‌కు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతర ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో లింక్‌ను కలిగి ఉన్న ట్వీట్లను కూడా గుర్తించి బ్లాక్ చేయమని అదేశించినట్లు పేర్కొన్నాయి. ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదమైన నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు చేయాలంటూ యూకేలో ఆన్లైన్ పిటిషన్ దాఖలైంది. గత వారం ప్రసారమైన మొదటి భాగంలో దుష్ప్రచారం ఎక్కువగా ఉందని వీక్షకులను తప్పుదోవ పట్టించేలా ఉందని నిర్దిష్ట ప్రమాణాలను పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. మంగళవారానికి నిర్దేశించిన రెండో భాగం ప్రసారాన్ని నిలిపివేయాలని అభ్యర్థించారు.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన క్లిప్ లను కూడా షేర్ చేయకూడదని పేర్కొంది. అయినప్పటికీ అనేక విశ్వవిద్యాలయాలు ఈ డాక్యుమెంటరినీ ప్రదర్శించేందుకు ఇంట్రెస్ట్ చూపించాయి. అయితే వాటి జాబితాలోనే ఇప్పుడు కేపీసీసీ మైనారిటీ సెల్ చేరింది. ఈ నిషేధిత డాక్యుమెంటరీని జనవరి 26వ తేదీన ప్రదర్శించాలని కేరళ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ డాక్యుమెంటరీ పక్షపాతంతో కూడినదా కాదా అని నిర్ణయించుకునేందుకు ప్రజలకే అవకాశం ఇవ్వాలని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ చెబుతున్న మాట. అయితే దీనిపై బీజేపీ మండిపడుతోంది.