యావత్ భారత దేశానికి ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్. ఇన్నేళ్ల ఆస్కార్ కల నెరవేరే రోజు దగ్గరలో ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయింది. 95వ ఆస్కార్ నామినేషన్ల తుది జాబితా ఈరోజు సాయంత్రం ప్రకటించారు. అందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ చోటు దక్కించుకుంది. ప్రపంచ దేశాల నుంచి 300 సినిమాలు షార్ట్ లిస్ట్ కాగా అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన చిత్రాలను ఆస్కార్ కమిటీ మెంబర్స్ తమ ఓటింగ్ ద్వారా తుది జాబితాకు ఎంపిక చేశారు.
మార్చి 12 న లాస్ ఎంజెల్స్ లోని డాలీ థియేటర్‌లో కన్నుల పండుగగా జరిగే కార్యక్రమంలో ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కలెక్షన్లలో రికార్డులు బద్దలు కొట్టింది. ఇటీవలే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. అలాగే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ అందుకుంది. ఇవే కాకుండా జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ఈ చిత్రానికి అవార్డ్ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్‌కు ఆర్‌ఆర్‌ఆర్ తో పాటు భారతీయ షార్ట్ ఫిల్మ్ ఆల్ ద బ్రీత్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా నామినేట్ అయ్యాయి. ఇన్నేళ్ల నిరీక్షణ తరువాత ఇప్పుడు నాటు నాటు పాటకు ఆస్కార్ తప్పకుండా రావాలని భారతీయ సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు.