రాజకీయ పార్టీలో ఆలోచనలు సాపేక్ష సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. అంటే ఓ పార్టీకి ఓ రాష్ట్రంలో ఓ నిర్ణయం ఉంటే అది మరో రాష్ట్రానికి వెళ్లే సరికి రివర్స్ కావచ్చు. అంటే దీనికి పూర్తి భిన్నమైన ఆలోచనతో ముందుకు పోవచ్చు. అందుకే కదా గిరీశం అన్నది నిర్ణయాలు మార్చుకోని వాడు పొలిటీషియనే కాదని. జనసేనాని పవన్ కళ్యాణ్ కు కూడా రాజకీయాలు బాగా వంటపడ్డాయంటున్నారు రాజకీయ పండితులు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదన్నారు పవన్ కళ్యాణ్. అందుకోసమే తాను టిడిపితో పొత్తుగురించి ఆలోచిస్తున్నట్లు అప్పట్లో చెప్పారు. ఆ క్రమంలో భాగంగానే చంద్రబాబు తో నేరుగా భేటీ అయి గంటల తరబడి వివిధ అంశాలపై చర్చించారు పవన్ కళ్యాణ్. అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందన్నది పవన్ భావన. అలా జరగడానికి వీల్లేదన్నది ఆయన ఆలోచన.
తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణాలో మరో వ్యాఖ్య చేశారు. తన యాత్ర కోసం సిద్దం చేసుకున్న వారాహి వాహనానికి కొండగట్టు ఆలయం వద్ద పూజలు చేయించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో బిజెపితో పొత్తు ఉండదని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో 25 నుండి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 7 నుండి 14 లోక్ సభ నియోజక వర్గాల్లోనూ జనసేన అభ్యర్ధులను బరిలో నిలబెడతామని ప్రకటించారు. భావసారూప్యత కలిగిన పార్టీలు ముందుకు వస్తే వారితో పొత్తుల విషయంపై ఆలోచన చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఒక వేళ బిజెపి అలా వచ్చినా చూస్తామన్నారు. తాము పోటీ చేయని నియోజక వర్గాల్లోనూ జనసేన ప్రభావం ఉండేలా వ్యవహరాలు చేస్తామని అన్నారు.
ఏపీ ప్రభుత్వాన్ని అను నిత్యం తిట్టిపోసే పవన్ కళ్యాణ్ తెలంగాణాలో మాత్రం పాలన బాగుందని మెచ్చుకున్నారు.
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని భావిస్తున్నారా. అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాలో పవన్ కళ్యాణ్ సీరియస్ గానే పోటీ చేస్తున్నారా అన్న విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తెలంగాణాలో జనసేన అభ్యర్ధులు బరిలో నిలబడితే వారు ఎవరిపై గెలవాలి. బి.ఆర్.ఎస్. అభ్యర్ధులను కూడా ఓడించాలి. మరి బి.ఆర్.ఎస్. పాలన చాలా బాగుందని పవన్ కళ్యాణే ముందస్తుగా కితాబు నిచ్చాక రేపు ఎన్నికల ప్రచారంలో జనసేనాని ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు. ఏపీలో జగన్ పాలన కన్నా తెలంగాణాలో కేసీయార్ పాలన చాలా బాగుంది. అయితే మీరు మాత్రం జనసేన అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించండి అని అడుగుతారా. అని విశ్లేషకులు నిలదీస్తున్నారు.
తెలంగాణాలో గతంలో జి.హెచ్.ఎం.సి.ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నట్లు వచ్చే ఎన్నికల్లో వ్యవహరించమంటున్నారు పవన్ కళ్యాణ్. మరి ఏపీలో టిడిపితో పొత్తు పెట్టుకున్నట్లే తెలంగాణాలోనూ టిడిపితో పొత్తు పెట్టుకుంటారా. అన్న ప్రశ్నలకు సమాధానంగానే ఆయన భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు ఉంటుందని అన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు జనసేనకు తెలంగాణాలో ఉన్న ఓటు బ్యాంకు ఎంత అన్నది కూడా తేలాలి. ఎందుకంటే ఇంత వరకు తెలంగాణాలో జనసేన పూర్తి స్థాయిలో పోటీ చేయలేదు. తెలంగాణాలో జనసేన పోటీ వల్ల ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు రాజకీయ పండితులు. పవన్ చీల్చే ఓట్లు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందినవే అయి ఉంటాయంటున్నారు. అందులోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తారు కాబట్టి అది బి.ఆర్.ఎస్. కే ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు.