పాకిస్తాన్ చచ్చినపాము. దాంతో మనకు ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదు. గుంటనక్కలా పొంచి ఉన్న చైనాతోనే అసలు సమస్య. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాధీనరేఖను దాటుతూ చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పుడు నీటి యుద్ధాన్ని కూడా మొదలుపెట్టింది. భారత్-నేపాల్ సరిహద్దుల ట్రై జంక్షన్‌కు సమీపంలోని గంగా ఉపనదిపై టిబెట్‌లో చైనా కొత్త డ్యామ్ నిర్మిస్తోంది. మనదేశంలోని ఈశాన్య ప్రాంతంలోకి టిబెట్, ఇతర ప్రాంతాల నుంచి ప్రవహించే నదులపై చైనా ఆనకట్టలు నిర్మించింది. దీంతో హఠాత్తుగా నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పదు. అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గర్లోని మెడాగ్ వద్ద దాదాపు 60వేల మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న భారీ డ్యామ్ నిర్మాణానికి చైనా ఏర్పాట్లుచేస్తోంది.
భారత్‌ని దొంగదెబ్బతీయాలన్న చైనా కుటిలనీతికి మన దేశం గట్టి సమాధానం చెప్పాలనుకుంటోంది.
అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌పై బ్రహ్మపుత్ర జలాలను ఎక్కుపెట్టేలా చైనా వ్యూహాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాలో భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టును నిర్మించాలనుకుంటోంది భారత్. 11వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రయత్నం సాకారమైతే భారత్‌ల్ ఉన్న అతిపెద్ద హైడ్రో ప్రాజెక్టు కంటే ఇది ఐదు రెట్లు పెద్దదవుతుంది. బ్రహ్మపుత్రపై మెడాగ్ వద్ద చైనా భారీ ప్రాజెక్టు మనకు ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే ఎగువ సియాంగ్‌లో డ్యామ్ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. దీని నిర్మాణంతో చైనా నుంచి వచ్చిపడే వరదప్రవాహానికి అడ్డుకట్టవేసి నీటిని నిల్వ చేయొచ్చు.
టిబెట్ పీఠభూమిలోని 46వేల హిమనదాల నుంచి సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, ఐరావతి, మెకాంగ్, యాంగ్ ట్సే, ఎల్లో నదులు పుడుతున్నాయి. ఆసియా ఖండంలో 200 కోట్లమంది నీటి అవసరాలు తీరుస్తున్న జీవనదులు ఇవి. టిబెట్ పీఠభూమిలో చైనా 55కుపైగా జలాశయాలు నిర్మించింది. అయినా నీటి అవసరాలు మరింత పెరిగిపోవటంతో బ్రహ్మపుత్రపై భారీ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమైంది. మానససరోవరంలో పుట్టిన బ్రహ్మపుత్ర దాదాపు 2,880 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చైనాలో 1700 కిలోమీటర్లు, మన దేశంలోని అరుణాచల్‌ప్రదేశ్‌లో 920 కిలోమీటర్లు, అస్సాంలో 260 కిలోమీటర్లు ప్రవహించాక బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
ఎంతో కీలకమైన బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు చైనా చేసే ప్రయత్నాలతో ఎప్పటికైనా మనకు ముప్పుతప్పదు. అందుకే చైనా ఎత్తుగడలను భారత్ నిశితంగా గమనిస్తోంది. ముప్పు ముంచుకు రాకముందే జాగ్రత్తపడాలనుకుంటోంది. చైనా ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే భారీ వరద అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లను ముంచెత్తుతుంది. ఈ వైపరీత్యాన్ని నివారించేందుకు ఏటా జూన్-అక్టోబరు మధ్య కాలంలో నీటి విడుదలపై సమాచారాన్ని పంచుకుంటామని చైనా మాటిచ్చింది. కానీ 2017 డోక్లాం ఘర్షణల తరవాత కొన్నాళ్లు సమాచారం ఇవ్వడం ఆపేసింది. 2018లో మళ్లీ సమాచారం ఇవ్వడం ప్రారంభించినా ఈ సఖ్యత ఎన్నాళ్లు ఉంటుందో తెలీదు. అందుకే చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా భారత్ అప్రమత్తమైంది. మనల్ని ముంచాలన్నా తేల్చాలన్నా మీట శత్రువు చేతుల్లో ఉండటం మనకు ఎప్పటికీ క్షేమకరం కాదు.