కేసీఆర్ జగన్ రాం…రాం..

By KTV Telugu On 25 January, 2023
image

నిన్న, మొన్నటి దాకా కేసీఆర్, జగన్ జాన్ జిగ్రీ దోస్తులు. జగన్ ను కేసీఆర్ సొంత కొడుకులా చూసుకునేవారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఛాలెంజ్ చేసి మరీ జగన్ ను కేసీఆర్ ప్రోత్సహించారు. గెలిచిన వెంటనే ప్రగతి భవన్ కు వచ్చి జగన్ తన గురువు కేసీఆర్ శుభాకాంక్షలు అందుకున్నారు. తర్వాత కూడా ఒకటి రెండు సార్లు కలిశారు. ఇప్పుడదంతా చరిత్రలో కలిసిపోయింది. కేసీఆర్, జగన్ మధ్య దూరం పెరిగినట్లు అనిపిస్తోంది.

తెలంగాణ, ఏపీ మధ్య లెక్కల పంచాయతీ, నీటి పంచాయతీ ఉంది. మాకు మీరు బాకీ పడ్డారంటే. మాకు మీరు బాకీ పడ్డారని రెండు రాష్ట్రాలు ఆరోపణలు సంధించుకుంటున్నాయి. విభజన హామీల విషయంలో పేచీ కొనసాగుతోంది. వాటిని పరిష్కరించేందుకునేందుకు జగన్ సుముఖంగా లేరని తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అవి పరిపాలనా పరమైన సమస్యలైతే, రాజకీయంగా రెండు పార్టీలకు దూరం పెరిగిందని చెబుతున్నారు.

బీఆర్ఎస్ ప్రకటనకు తర్వాత ఢిల్లీ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి, ఖమ్మం బహిరంగ సభకు కేసీఆర్ చాలా మంది నేతలను ఆహ్వానించారు. వారిని సత్కరించారు. కుమారస్వామి, కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేష్ యాదవ్, పినరయి విజయన్ వేర్వేరు కార్యక్రమాలకు వచ్చి వెళ్లారు. జగన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. కేసీఆర్ ఆయనకు ఆహ్వానం పంపలేదు. ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. దానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వినీ యాదవ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తరపున జేడీయూ నేత లలన్ సింగ్ ను ఆహ్వానించారు. అందులో కూడా జగన్ మాట వినిపించడం లేదు.

జగన్ ను కేసీఆర్ పిలవకపోవడానికి అనేక కారణాలున్నాయి. జగన్ లోపాయకారిగా బీజేపీతో అంటకాగుతున్నారన్న ఫీలింగ్ ఉంది. కేసీఆర్ ఇప్పుడు బీజేపీకి బద్ధ శత్రువయ్యారు. పిలిచినా వచ్చేందుకు జగన్ వెనుకాడతారన్న అనుమానంతోనే ఆహ్వానం పంపలేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి పైగా షర్మిల వ్యవహారంలో కూడా కేసీఆర్ తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు పాదయాత్రలు, రాజకీయాలు చేసుకోవడంలో తప్పులేదు కానీ కేసీఆర్ ను ఆమె దూషిస్తున్న తీరు ఇబ్బందికరంగా ఉంది. ఆమె వాడుతున్న భాష ఆమోదయోగ్యంగా లేదు. షర్మిలను కట్టడి చేయడంలో జగన్ విఫలమయ్యారని కేసీఆర్ భావిస్తున్నారు. మొదట్లోనే కంట్రోల్ చేసి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్న అభిప్రాయమూ ఉంది. ఏపీలో బీఆర్ఎస్ అభివృద్ధి చెందాలనుకోవడం మరో కీలక కారణం. ఏపీలో కొంత మంది కాపు నేతలను తమవైపుకు తిప్పుకుని బీఆర్ఎస్ యూనిట్ ను ప్రారంభించారు. ఎన్నికల నాటికి పొత్తుల కసరత్తు కూడా ప్రారంభమవుతోంది. ఏపీలో బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఇంకా క్లారిటీ రాలేదు. దానితో ప్రస్తుతానికి జగన్ ను కేసీఆర్ దూరం పెట్టారని చెబుతున్నారు.

విశాఖలో కేసీఆర్, జగన్ కలిసే అవకాశాలున్నాయని తాజాగా వినిపిస్తున్న మాట. ఈ నెల 27 నుంచి 31 వరకు విశాఖ శారదాపీఠంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపామని ఆయన హాజరవుతారని శారదాపీఠం వర్గాలు చెబుతున్నాయి. శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామికి జగన్ అత్యంత ప్రియ శిష్యుడు. ఆయన తప్పకుండా వెళతారు. ఇప్పటికే జగన్ రాకకోసం విశాఖ ముస్తాబవుతోంది. ఒకే రోజున జగన్, కేసీఆర్ విశాఖ వెళితే ఎదురుపడక కలుసుకోక తప్పదు. చేరో రోజున వెళితే మాత్రం ఆ అవకాశం ఉండదు. మరో పక్క విశాఖ టూర్ కు కేసీఆర్ దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడకు వెళితే మూడు రాజధానులపై బీఆర్ఎస్ వైఖరిని ప్రకటించాల్సి రావచ్చు. విలేకర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్, జగన్ మధ్య అసలేం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం.