చంద్రబాబును భయపెడుతున్న బ్లాక్ మెయిలర్

By KTV Telugu On 25 January, 2023
image

టీడీపీలో పల్నాడు చిచ్చు తారాస్థాయికి చేరింది. నరసరావు పేట లోక్ సభ, సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాల కోసం సిగపట్లు మొదలయ్యాయి. దాని కోసం లోకల్, నాన్ లోకల్ గొడప పెట్టుకుంటున్నారు. వేర్వేరు పార్టీల్లో గుంటూరు, నరసరావుపేట లోక్ సభా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన రాయపాటి సాంబశివరావు ఇప్పుడు పార్టీపై కారాలు మిరియారు నూరుతున్నారు. రాయపాటి – ఘనాపాటి అని ఒకప్పుడు అందరూ పొగిడిన సాంబశివరావు ఇప్పుడు బాగా డల్ అయిపోయారు. అయినా ఆశ చావలేదు. రిలే రేసులా తన వారసత్వాన్ని కొడుకు, కూతురికి అప్పగించాలన్న తపన పెరిగిపోవడంతో ఇప్పుడాయన బ్లాక్ మెయిలింగ్ కు దిగారు.

రాయపాటి గత ఎన్నికల్లో నరసరావు పేట లోక్ సభా స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ పనైపోయిందనుకుని సైడైపోయారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడం టీడీపీ పుంజుకోవడంతో మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే ఈ సారి ట్రాక్ మార్చారు. తన కుమారుడికి, కూతురికి టికెట్లు ఇవ్వాలని ఆయన చంద్రబాబు వద్దకు వెళ్లారు. పార్టీ అధినేత ఆయనకు గట్టి క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేయకపోవడం ఒక వంతయితే కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు అడగడమేంటని చంద్రబాబు చీవాట్లు పెట్టి పంపించారు.

రాయపాటి ఇప్పుడు ట్రాక్ మార్చారు. లోకల్, నాన్ లోకల్ ఫీలింగు తీసుకొచ్చారు. నిజానికి నరసరావు పేట లోక్ సభా సీటులో టీడీపీకి సరైన కేండెట్ లేడని నిర్థారించుకున్న చంద్రబాబు కొత్త వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు, కడపలో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు మహేష్ యాదవ్‌కి చంద్రబాబు టికెట్ ఫైనల్ చేశారు, బీసీ వర్గం ఓట్లపై దృష్టి పెట్టడంతో పాటు ఖర్చుకు వెనుకాడరన్న నమ్మకంతో చంద్రబాబు ఇప్పుడు పుట్టా మహేష్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మహేష్ కూడా అప్పుడప్పుడు నరసరావు పేటలో పర్యటిస్తూ టీడీపీ వారితో మీటింగులు పెడుతున్నారు. నియోజకవర్గంలో తన ఉనికిని చాటుకుంటున్నారు. దానితో ఇప్పుడు రాయపాటికి టెన్షన్ పెరిగిపోయింది.

రాయపాటి తాజాగా సామాజికవర్గం లెక్కలు తీస్తున్నారని చెబుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు మాత్రమే కమ్మ సామాజికవర్గానికి మిగిలినప్పుడు అక్కడ కూడా నాన్ లోకల్ వారిని తీసుకొస్తే మనం ఎక్కడ పోటీ చేయాలని తన కులస్థుల వద్ద ఆయన ప్రస్తావిస్తున్నారు. పల్నాడులో కడప వారికి పనేమిటని అంటూ కడప పేరును ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా దెబ్బతిన్నామని టెన్షన్ పడుతున్న చౌదర్లకు రాయపాటి మాటలు బాగానే రుచిస్తున్నాయి. దానితో రాయపాటికి మద్దతివ్వాలని వారు చర్చించుకుంటున్నారట. పైగా అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని రాయపాటి చెప్పుకోవడం కూడా కమ్మ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదీ చంద్రబాబుకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే అంశమని చెబుతున్నారు.

సత్తెనపల్లిది మరో సమస్య. మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణించిన తర్వాత అక్కడ టీడీపీకి సరైన నాయకుడు లేడు. కోడెల కుమారుడు శివరాం ఏదో చేయాలనుకున్నా గతంలో ఆయన ట్రాక్ రికార్డు బాగోలేదని పక్కన పెట్టారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగుతూ టీడీపీ టికెట్ అశిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం సత్తెనపల్లిని ఈ సారి జనసేనకు వదిలెయ్యాలని భావిస్తున్నారు దానితో నరసరావు పేట లోక్ సభ పద్దతిలోనే సత్తెనపల్లి కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా చంద్రబాబుపై ఆగ్రహం చెందుతున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితి తమకు అనుకులంగా మారకపోతే పార్టీ పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ బ్లాక్ మెయిలింగ్ నడుస్తుందో లేదో చూడాలి.