నారా లోకేష్ పాదయాత్రకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ అడ్డంకులు తొలగిపోలేదని తెలుస్తోంది. చివరి వరకు నాన్చిన పోలీసులు తమ్ముళ్లు గగ్గోలు పెట్టడంతో పర్మీషన్ గ్రాంటెడ్ అన్నారు. అయితే కండీషన్స్ అప్లై అంటున్నారు. దాంతో షరతుల మధ్య లోకేష్ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా చిత్తూరు జిల్లా ఎస్పీ ద్వారా అనుమతి మంజూరు చేశారు. కేవలం కుప్పంలో లోకేశ్ 3రోజుల పాదయాత్రకు మాత్రమే అనుమతి లభించింది. లోకేష్ యువగళం యాత్రకు పోలీసులు మొత్తం 14 షరతులు విధించారు. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపై బహిరంగ సభలు నిర్వహించొద్దు. అత్యవసర సేవలకు నిత్యావసర సరకుల రవాణాకు ఆటంకం కలిగించకూడదు. బహిరంగ సభ నిర్వహించుకోవాలంటే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆ వివరాలు పలమనేరు డీఎస్పీకి సమర్పించి అనుమతి పొందాలి. రోడ్లపై పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. క్రాకర్స్ పేల్చకూడదు. మైక్ వాడాలంటే పరిమితులు. ఇలా అనేక షరతులతో కూడిన సంకెళ్లు వేశారు.
తొలుత 29 షరతులు పెట్టినా టీడీపీ అభ్యంతరాలతో వాటిని 14కు తగ్గించినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్లు ఫిర్యాదులొచ్చినా షరతుల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా ముందస్తు సమాచారం నోటీసు ఇవ్వకుండానే పాదయాత్రను రద్దు చేసేందుకు సిద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నెల 27న ప్రారంభమయ్యే పాదయాత్ర 29 వరకూ కుప్పం నియోజకవర్గం పరిధిలో కొనసాగనుంది. దానికి మాత్రమే అనుమతి లభించింది. ఆ తర్వాతి స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. లోకేష్ పాదయాత్రను ఏదో ఓ సాకుతో ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ఆంక్షలపై తీవ్రంగా మండిపడుతున్నారు టీడీపీ నేతలు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజులపాటు పాదయాత్రకు టీడీపీ అనుమతి కోరింది. అయితే డీజీపీ స్పందించకుండా స్థానిక పోలీసులు 3 రోజులకే అనుమతివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేసినప్పుడు నాటి ప్రభుత్వం పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్రకు ఒకేసారి అనుమతిచ్చిందని అప్పటి డీజీపీ మూడు షరతులే పెట్టారని తమ్ముళ్లు గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్షాల రాజకీయ కార్యకలాపాల్ని అక్రమమార్గాల్లో కట్టడి చేయాలని చూస్తున్న ప్రభుత్వం ఆ కుట్రలో భాగంగానే లోకేశ్ పాదయాత్రకూ అడ్డుతగులుతోందని టీడీపీ ఓ ప్రకటనలో ధ్వజమెత్తింది. జగన్ పాదయాత్రకు అనుమతిస్తూ అప్పట్లో డీజీపీ ఇచ్చినఉత్తర్వుల కాపీని ఆ ప్రకటనకు జతచేసింది. 400 రోజుల్లో 4,000 కి.మీ. పాదయాత్ర పూర్తి చేయాలనే లక్ష్యంతో లోకేష్ ఉన్నారు. ఈ పాదయాత్ర లోకేష్‌కు మరింత మైలేజ్ తీసుకు రావడంతో పాటు టీడీపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేందుకు దోహదపడుతుందని చంద్రబాబు సైతం బలంగా నమ్ముతున్నారు.