కేసీఆర్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

By KTV Telugu On 25 January, 2023
image

గణతంత్ర వేడుకలకు ఒక రోజు ముందు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం రిపబ్లిక్‌ వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఎక్కడ నిర్వహించాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించింది. జనవరి 26వ తేదీన పరేడ్‌తో కూడిన వేడుకలు జరగాలని ఆ కార్యక్రమానికి ప్రజలను కూడా అనుమతించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జనవరి 26వ తేదీన అన్ని రాష్ట్రాలు రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలని విద్యార్థులను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ పంపించింది. అయితే గతేడాదిలాగే ఈసారి కూడా పరేడ్ గ్రౌండ్లో కాకుండా రాజ్ భవన్ లో రిపబ్లిక్‌ వేడుకలు నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాజ్‌భవన్‌కు లేఖ రాసింది.

గవర్నర్ తమిళిసై జాతీయ జెండా ఎగరవేస్తారని అందులో పేర్కొంది. చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని లేఖలో స్పష్టం చేసింది. తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించడంపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ విచారించిన హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా వేడుకలు నిర్వహించడం లేదన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. కేంద్రం గైడ్‌లైన్స్‌ ప‌్రకారం తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. ఈ వేడుకల నిర్వహణకు కొన్ని గంటలు మాత్రమే వ్యవధి ఉన్నందున ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో చూడాలి.