లోకేష్‌ పాదయాత్ర నిర్విఘ్నంగా సాగుతుందా?

By KTV Telugu On 26 January, 2023
image

సతీమణి వీరతిలకం దిద్దారు. నందమూరి కుటుంబసభ్యులు ఆల్‌దిబెస్ట్‌ చెప్పారు. నారా లోకేష్‌ పాదయాత్రకు అన్నీ రెడీ. జనవరి 27నుంచి పాదయాత్రతో తన రాజకీయ భవిష్యత్తుకు బాట వేసుకోవాలని అనుకుంటున్నారు చంద్రబాబు వారసుడు. తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంనుంచి శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం దాకా పాదయాత్ర చేయాలన్నది నారా లోకేష్‌ సంకల్పం. ఏపీలో రోడ్‌షోలు, పాదయాత్రలపై కొన్ని ఆంక్షలు అమలులో ఉండటంతో ఏ ఒడిదుడుకులూ లేకుండా పాదయాత్ర ఎలా సాగుతుందనేది తమ్ముళ్లలో ఆసక్తి రేపుతోంది. 14 షరతులతో కోర్టు లోకేష్‌ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అందులో దేన్ని ధిక్కరించినా అడ్డుకునేందుకు పోలీసులు కూడా రెడీగా ఉన్నట్లే. కుప్పంలో గ్రాండ్‌గా మొదలుకాబోతోంది నారా లోకేష్‌ పాదయాత్ర. నారా నందమూరి కుటుంబాలు ప్రారంభ కార్యక్రమానికి హాజరుకాబోతున్నాయి.

400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర లోకేష్‌ టార్గెట్‌. 125 నియోజకవర్గాలను చుట్టేలా రూట్‌మ్యాప్‌ రెడీచేసింది టీడీపీ. చిత్తూరుజిల్లాలో మొదలయ్యే పాదయాత్రకు షరతులు వర్తిస్తాయని ముందే పోలీసులు గుర్తుచేశారు. నిబంధనల ప్రకారమే పాదయాత్ర ఉండాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినా షరతుల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా ఎలాంటి నోటీసు లేకుండా అనుమతి రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. బాణసంచాల కాల్చకూడదు డీజే సౌండ్ల మోత ఉండకూడదు. రాకపోకలకు ఇబ్బంది కలిగించినా అనుమతికి మించి వాహనాలు ఉన్నా పోలీసుల ఎంట్రీ గ్యారంటీ. దీంతో పాదయాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇన్ని రూల్స్‌ పెట్టిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పాదయాత్రకు జిల్లాలవారీగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ అధికారికి అభ్యంతరం అనిపించినా లోకేష్‌ పాదయాత్రకు బ్రేక్‌ పడేలా ఉంది.

చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన నారా లోకేష్‌ ప్రజాబలాన్ని ఇంతవరకు నిరూపించుకోలేదు. ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా చక్రం తిప్పగలిగారుగానీ ప్రజాక్షేత్రంలో ఆయన గెలవలేకపోయారు. తొలి ప్రయత్నంలోనే మంగళగిరిలో ఓడిపోయారు. తాను తండ్రి చాటు బిడ్డని కాదని తనకూ నాయకత్వ లక్షణాలున్నాయని నిరూపించుకునేందుకు ఈ పాదయాత్ర కీలకం కాబోతోంది. నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడం లోకేష్‌ ముందున్న ముఖ్య సవాలు. పాదయాత్రతో ప్రజల్ని మెప్పించగలిగితేనే ఆయన నాయకత్వానికి మద్దతు లభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నోరు కుట్టేసుకుని ఉండటం ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగడం జరిగేపని కాదు. దీంతో లోకేష్‌ పాదయాత్ర ఎన్నాళ్లు నిర్విఘ్నంగా సాగుతుందో టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారు. అవరోధాలు ఎదురైనా సవాళ్లను స్వీకరిస్తూ ప్రజల మన్ననలు పొందితేనే నారా లోకేష్‌కి రాజకీయ మనుగడ ఉంటుంది. ఎక్కడ తేడావచ్చినా అది అసమర్థుడి జీవనయాత్రలాగే మిగిలిపోతుంది.