పొత్తులు లేకుండా టిడిపికి పొద్దు పోదు

By KTV Telugu On 26 January, 2023
image

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా ఒంటరిగా ఇంతవరకు పోటీ చేయలేదు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్ తో పొత్తు పెట్టుకున్నారు. పార్టీపెట్టిన 9నెలలకే అధికారంలోకి వచ్చారు. అయితే అనతికాలంలోనే నాదెండ్ల భాస్కరరావు రూపంలో వెన్నుపోటు ఎపిసోడ్ చోటు చేసుకుంది.
ప్రజాఉద్యమంతో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రక్షాళన అవసరం అనుకున్న ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. 1985లో జరిగిన ఎన్నికల్లో నాదెండ్లతో పాటు తనకు వెన్నుపోటు పొడిచిన వారికి టికెట్లు ఇవ్వకుండా దూరం పెట్టి కొత్త జట్టును గెలిపించుకుని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లో టిడిపి బిజెపి, కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంది.

1989,1994 ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ పొత్తులతోనే ఎన్నికల బరిలో నిలబడ్డారు.1995లో ఎన్టీఆర్ నుండి టిడిపిని ముఖ్యమంత్రి పదవినీ కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడు తన సారధ్యంలో 1999లో మొదటి సారి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆ ఎన్నికల్లో టిడిపి పట్ల వ్యతిరేకత ఉన్నా కార్గిల్ విజయంతో కేంద్రంలోని బిజెపికి మంచి సానుకూల ప్రభంజనం వీస్తూ ఉండడంతో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. పొత్తు కలిసొచ్చి 180 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 2003 అక్టోబరు లో చంద్రబాబు నాయుడిపై తిరుపతిలోని అలిపిరి ఘాట్ రోడ్డుపై మావోయిస్టుల మందుపాతర దాడి జరిగింది. ఆ ఘటనలో గాయపడ్డ చంద్రబాబు నాయుడు సానుభూతి పవనాలను అంది పుచ్చుకుని మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. నిజానికి 2004 డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉండగా కేంద్రంలోని బిజెపిని ఒప్పించి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.

ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్నాక ఛఛ ఇక జీవితంలో బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని మసీదులో ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు బిజెపికి దూరం అయ్యారు. 2009 ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. మరో వైపు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ బరిలో ఉండడంతో ముక్కోణపు పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో అందరినీ కాదని ఏపీ ప్రజలు వై.ఎస్.ఆర్. సారధ్యంలోని కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
2014లో రాష్ట్ర విభజన జరగడంతో చంద్రబాబు నాయుడు విభజిత ఏపీలో బిజెపి జనసేనలతో పొత్తు పెట్టుకుని బొటా బొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే నాలుగేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చి నరేంద్ర మోదీని తిట్టడం మొదలు పెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.

నరేంద్ర మోదీని ఓడించడమే లక్ష్యమంటూ తిరిగిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో టిడిపికి ఆగర్భ శత్రు పక్షమైన కాంగ్రెస్ తో చేతులు కలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాలు మరీ ఇంత అవకాశవాదంతో ఉంటాయా అన్న విమర్శలూ వినిపించాయి. 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో కూటమి కట్టి టి.ఆర్.ఎస్. ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2009లో మహాకూటమి ఎలా చతికిల పడిందో 2018లోనూ మహాకూటమికి మహాఓటమి తప్పలేదు. ఒక వేళ 2018లో కాంగ్రెస్ తో పొత్తు వర్కవుట్ అయితే ఏపీలోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే అది కుదరకపోవడంతో 2019 ఎన్నికల్లో నలుగురు కాంగ్రెస్ సీనియర్లకు టిడిపి తరపున టికెట్లు ఇచ్చి పార్లమెంటు బరిలో నిలబెట్టారు. అయితే ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు కాబట్టి ఈ అపవిత్ర పొత్తును ఎడం కాలితో తన్నేసి నలుగురినీ ఓడించారు.

ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోన్నట్లు బిల్డప్ ఇచ్చినా జనసేనతో అవగాహనతో ముందుకు పోయారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే జనసేన చేత వేరు కుంపటి పెట్టించారని అప్పట్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విమర్శించింది కూడా. ఆ విమర్శలకు బలం చేకూర్చేలా చంద్రబాబు నాయుడు, లోకేష్ లతో పాటు టిడిపి మంత్రుల నియోజక వర్గాల్లో పవన్ కళ్యాణ్ తమ అభ్యర్ధులను బరిలో నిలపలేదు. అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు అయితే ఆయన పాలన వైఫల్యాలను ఎండగట్టకుండా అయిదేళ్లు ప్రతిపక్షంగా ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పైనే విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు టిడిపి జనసేనలు వేర్వేరుగా పోటీ చేసినా కలిసే వ్యూహాలు అమలు చేస్తున్నాయని ప్రజలు కూడా గమనించడం వల్లనే టిడిపికి 23 స్థానాలు దక్కితే జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటు మాత్రమే వచ్చింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

ఒంటరిగా పోటీ చేస్తే టిడిపి సత్తా ఏంటో చంద్రబాబుకు బాగా తెలిసొచ్చింది. దానికి తోడు సంక్షేమ పథకాలతో వై.ఎస్.జగన్ దూసుకుపోతుండడంతో 2024 ఎన్నికల్లో బిజెపి-జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకోవాలనుకున్నారు బాబు. అయితే బిజెపి ససేమిరా అంది. జనసేన మాత్రం బాబుపై ఆసక్తిగా ఉంది.టిడిపి-జనసేన పొత్తు ఇంచుమించు ఖరారైనట్లే రెండు పార్టీల నేతలూ భావిస్తున్నారు. అయితే దానికి ముందు ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలిస్తే ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో తమతో పొత్తుకు బిజెపి ఓకే అంటుందన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ఇటీవల ఖమ్మంలో తెలంగాణ టిడిపి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు. దాని ద్వారా తన బలాన్ని బిజెపికి చూపించి వారి వద్ద మార్కులు కొట్టాలనుకున్నారు.

అయితే బిజెపి నుండి ఎలాంటి స్పందన రాకపోవడం వల్లనే ఇపుడు పవన్ కళ్యాణ్ కార్డుకూడా తెలంగాణాలో ఓపెన్ చేశారని భావిస్తున్నారు. వారాహి వాహనానికి పూజ చేసిన పవన్ తెలంగాణాలో 25 నుండి 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తానని చేసిన ప్రకటన చంద్రబాబు సూచనల మేరకు చేసిందే అన్నది రాజకీయ వర్గాల అనుమానం.
టిడిపి-జనసేనలు తెలంగాణాలో కలిసి కట్టుగా బిజెపికి మేలు చేసేలా వ్యవహారాలు నడిపితే ఏపీలోనూ తమతో కలిసి రావడానికి బిజెపి ఒప్పుకుంటుందన్నది బాబు వ్యూహంగా చెబుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణలో టిడిపి ఎలా పోటీచేసినా కూడా ఎవరో ఒకరితో పొత్తు మాత్రం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు. అయితే అది ఏ మేరకు కలిసొస్తుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం అంటున్నారు.