నారా లోకేష్ యాత్రపైకు అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధించిందా. ఇచ్చిన అనుమతిలోనూ రక రకాల ఆంక్షలు విధించి ఇబ్బందులు పెట్టారా. టిడిపి హయాంలో సుదీర్ఘపాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో ప్రత్యర్ధుల పాదయాత్రపై రాజకీయాలు చేస్తున్నారా. అసలు ఏపీలో ఏం జరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. తాజాగా టిడిపి అధినేత నారా చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్రపై పాలక పక్షం కక్షసాధింపు రాజకీయం చేస్తోందని టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో జనంలో టిడిపి గ్రాఫ్ పెంచేందుకోసం నారా లోకేష్ పాదయాత్రకు పార్టీ నాయకత్వం డిజైన్ చేసింది. ఈ నెల 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుండి ప్రారంభం కాబోయే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగనుంది. 400 రోజుల పాటు సాగే యాత్రలో లోకేష్ నాలుగువేల కిలోమీటర్ల దూరం యాత్ర చేయనున్నారు. ఈక్రమంలో ప్రజల సమస్యలను వారినే అడిగి తెలుసుకోనున్నారు.
అయితే యాత్రకు సంబంధించి పోస్టర్ విడుదల చేసిన రోజు నుండే టిడిపి నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. లోకేష్ యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదేని వేధిస్తోందని ఆరోపించారు. అదే సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. అయితే ఆ మర్నాడే చిత్తూరు జిల్లా ఎస్పీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. లోకేష్ పాదయాత్రకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతిని ఇచ్చామని ఎస్పీ వివరించారు. దానికి సంబంధించిన అనుమతి పత్రాన్ని కూడా మీడియాకి రిలీజ్ చేశారు. అనుమతి మంజూరైందని రాష్ట్రమంతా ప్రచారం కావడంతో అంత వరకు అనుమతి ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ వచ్చిన టిడిపి నేతల టోన్ మారింది. లోకేష్ పాదయాత్రకు 29 షరతులతో అనుమతిని ఇచ్చారంటూ యాగీ చేయడం మొదలు పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తమ ప్రభుత్వం కూడా ఇలానే వ్యవహరిస్తే అసలు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా అని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ యాత్రకు కొద్ది రోజుల ముందే చంద్రబాబు నాయుడి పర్యటనల్లో 11 మంది చనిపోయిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో సభలు, ర్యాలీల నిర్వహణకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 1 విడుదల చేసింది. లోకేష్ యాత్రను అడ్డుకోడానికే ఈ జీవో తెచ్చారంటూ టిడిపి గొడవ చేసింది. లోకేష్ యాత్ర అంటే జగన్ మోహన్ రెడ్డి ఎందుకంత భయపడిపోతున్నారు అంటూ టిడిపి నిలదీసింది.
ఆ జీవోను నిలిపివేయాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయించారు కూడా. ప్రస్తుతం దానిపై వాదోప వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది కాబట్టి దానిపై చర్చ అనవసరం. ఇక అసలు లోకేష్ యాత్రను ప్రభుత్వం నిజంగానే అడ్డుకుందా అంటే కచ్చితంగా అడ్డుకోలేదనే చెప్పాలి. అంతే కాదు యాత్రకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టారని టిడిపి అంటోంది. అందులోనూ నిజం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలను ఏమీ విధించలేదు.
దేశ వ్యాప్తంగా బహిరంగంగా నిర్వహించే యాత్రలు, సభలు, ర్యాలీలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు జారీ చేసి ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ప్రస్తుతం లోకేష్ పాదయాత్రకు కూడా నిబంధనలు ఉన్నాయి. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలేవీ పెట్టలేదు. అంతే కాదు జగన్ మోహన్ రెడ్డి యాత్రకు అనుమతి కోరినపుడు చంద్రబాబు నాయుడి ప్రభుత్వ అనుమతి నిచ్చేటపుడు ఏవైతే షరతులు విధించిందో ఇప్పుడు లోకేష్ యాత్రకూ అవే షరతులు విధించారు. అంతకు మించి ఒక్క షరతు కూడా ఎక్కువగా విధించలేదు. అయినా లోకేష్ పాద యాత్రను అడ్డుకుంటున్నారు వేధిస్తున్నారు ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ టిడిపి నేతలు వారి అనుకూల సోషల్ మీడియాలూ ఎందుకు గందర గోళం సృష్టిస్తున్నాయన్నది చర్చకు దారి తీస్తోంది. అసలు అందులో ఉన్న ఆంక్షలు ఏంటి. యాత్రలో పాల్గొనేవారు మారణాయుధాలు తీసుకుపోకూడదు. అందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉండడానికి ఆస్కారం ఎక్కడుంది. mసామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించకూడదు. ఇందులో కూడా ఇబ్బంది పడ్డానికి ఏముంది.
ఈ ఆంక్ష లేకపోయినా యాత్ర నిర్వాహకులు ప్రజలకైతే ఇబ్బందులు పెట్టకూడదు కదా. బహిరంగ సభలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. ట్రాఫిక్ కు అంతరాయాలు కలిగించకూడదు. ఇవీ అభ్యంతరకరమైన ఆంక్షలైతే కాదు.
ఇలా యాత్రకు అనుమతినిస్తూ అధికారులు సూచించిన ఆంక్షలన్నీ కూడా అందరికీ విధించేవే. ఎవరైనా ఓ ఊరేగింపు నిర్వహించాలని అనుమతి కోరినా కూడా ఇవే ఆంక్షలు విధిస్తారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడికి ఇది తెలియనిదేమీ కాదు. అయినా ఈ అంశంపై ఎందుకంత రాజకీయం చేస్తున్నారు అని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. లోకేష్ యాత్ర గురించి ప్రకటన చేసినా ప్రజల నుండి స్పందన లేకపోవడం వల్లనే నిరాశలో కూరుకుపోయిన టిడిపి నాయకత్వం హైప్ క్రియేట్ చేయడం కోసమే లోకేష్ యాత్ర పేరు చెబితేనే ప్రభుత్వం భయపడిపోతోందంటూ విష ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంలోని పెద్దలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ పక్కన పెట్టి నారా లోకేష్ నిజాయితీగా యాత్ర చేపడితే ప్రజల్లో మంచి మార్కులు సంపాదించే వీలు ఉంటుందని దాన్ని వదిలేసి చిల్లర రాజకీయాలు చేయడం వల్ల లోకేష్ కు కానీ టిడిపికి కానీ దమ్మిడీ ప్రయోజనం ఉండదని మంత్రులు హితవు పలుకుతున్నారు. అయితే టిడిపి నేతలు మాత్రం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అధికారులు ఆంక్షలు విధించినా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వాటిని అమలు చేయలేదని వాటిని ఉల్లంఘించినా తాము ఏమీ అనలేదని అంటున్నారు.