తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రముఖ ఆధ్యాత్మివేత్త చినజీయర్ స్వామి ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగిపోయింది. కేసీఆర్ ఏ పని ప్రారంభించినా చిన జీయర్ స్వామిని సలహాలు, సూచనల ప్రకారం ఆయన పెట్టిన ముహూర్తానికి చేసేవారు. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం కోసం పలుమార్లు చినజీయర్ స్వామిని తన వెంట హెలీకాప్టర్‌లో తీసుకెళ్లారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన హోమం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, యాదాద్రి ఆలయ పునఃప్రారంభం ఇలా ముఖ్యమైన కార్యక్రమాలన్నింటికి చిన జీయర్ స్వామి ముహూర్తాలు నిర్ణయించారు. ఆయన ఆధ్వర్యంలోనే పూజాదికాలను నిర్వహించారు. అయితే ఉన్నట్లుండి జీయర్ స్వామికి కెసిఆర్ కు మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం పెట్టిన చిన జీయర్ స్వామికి ఆ ఆలయ పునః ప్రారంభోత్సవానికి పిలుపు అందలేదు.
ముచ్చింతల్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ దగ్గరనుండి సీఎం కేసీఆర్ కు చిన్న జీయర్ స్వామికి మధ్య విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోదీపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలోనే రామానుజ విగ్రహావిష్కరణకు మోడీని ఆహ్వానించారు చినజీయర్ స్వామి. కేసీఆర్ అభ్యంతరాలను పట్టించుకోలేదు. దాంతో వారిద్దరి మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. ప్రధాని పాల్గొన్న ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దూరం పెట్టిన చినజీయర్ స్వామికి ఆధ్మాత్మిక రంగంలో పద్మభూషణ్ ఇచ్చి కేసీఆర్‌ను గిల్లారు మోదీ అని చర్చించుకుంటున్నారు. చినజీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం మీద కేసీఆర్ ఏమీ అనలేడు. లోలోపల్లో మాత్రం రగిలిపోతూ ఉంటాడని అనంటున్నారు బీజేపీ నాయకులు.