తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. జాతీయ స్థాయిలో సత్తా చాటుకునేందుకు నడుం బిగించారు. ఇక నుంచి ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా బహిరంగ సభలు నిర్వహించేందుకుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను భారీగా నిర్వహించారు. ఇప్పుడు మహారాష్ట్రలో మరో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఫిబ్రవరి 5న నాందేడ్ లో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు మహారాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. ఇప్పటికే అక్కడ సభ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాందేడ్ సభ ఆవిర్భావ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరిశీలించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మహారాష్ట్ర ప్రజలు ఆకర్షితులవుతున్నారని హన్మంత్ షిండే చెప్పారు. జాతీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ కు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఇప్పటికే దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేశారు. త్వరలో విజయవాడలో కూడా పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు గతంలోనే ప్రకటించారు. ఇక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఆ తరువాత ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో నూతన సచివాలయం ప్రారంభోత్స కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రారంభోత్సవానికి జాతీయ స్థాయి నాయకులు రానుండటంతో పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరుకానున్నారు.