ఆ దొర ఏందిరో వాడి దూకుడేందిరో అంటూ గన్నెత్తుతాడేమో. జజ్జనకరి జనారే అంటూ ఎర్రకండువా వేసుకుని అడవుల్లోకి వెళ్లిపోతాడేమో. నేనిస్త తమ్ముడా నేనిస్తా తమ్ముడా అంటూ జనసైనికులకు ఉద్యమపాఠాలు బోధిస్తాడేమో. రాజకీయాల్లోకి వచ్చిన పాపానికి పవన్‌కళ్యాణ్‌లో ప్రజలు ఎన్ని షేడ్స్ చూడాల్సొస్తుందో ఏమో. నాయకుడికి ఆవేశం ఉండాల్సిందే కానీ ఆలోచన అంతకంటే ముఖ్యం. ప్రజాకోర్టు పెట్టేసి అందరిముందే శిక్షించడానికి ఇదేమీ ఆటవికరాజ్యం కాదు. అన్ని భోగాలు అనుభవిస్తూ అడవుల్లో పస్తులతో తిరుగుతున్నట్లు బిల్డప్పులిస్తే అస్సలు కుదరదు. పుస్తకాలు చదివిన ప్రతీవాడూ మేథావి అయిపోడు. గన్నుపట్టకుండా ఆవేశపడే ప్రతీవాడూ నక్సలైట్ అయిపోడు.
కమ్యూనిస్టులు, కమలనాథులు పూర్తి కాంట్రడిక్షన్. కానీ ఇద్దరితోనూ అంటకాగిన గొప్ప అనుభవజ్ఞుడు పవన్‌కళ్యాణ్. ఇంతకీ ఆయనగారి ఐడియాలజీ ఏంటంటే స్నానానికి నదికి పోయివచ్చినట్లే ఉంటుంది. చాలామందికి అర్ధంకావడంలేదుగానీ రెండు తరాలకు మేలు చేయాలన్నదే పవన్‌కళ్యాణ్ ఐడియాలజీ. లెఫ్ట్ రైట్లకు మధ్యస్థ ఐడియాలజీ ఆయన ట్రేడ్‌మార్క్. అదెలా ఉంటుందన్న చొప్పదంటు ప్రశ్నలు మాత్రం ఎవ్వరూ వేయొద్దు. మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతానన్న డైలాగ్ గుర్తుందికదూ. కాస్త కుడెడంగా ఆయన ఐడియాలజీ అది.
వైఎస్సార్ పార్టీని వెరయిటీగా తిడుతున్నారు జనసేన అధ్యక్షుడు. వైసీపీది దేశీయ దొరతనమట. బ్రిటీష్‌వాళ్లు వెళ్లిపోయినా దేశంలో ఇంకా దొరతనం పోలేదంటున్నారు పవన్‌కళ్యాణ్. దొరల దాస్యశృంఖలాల నుంచి విముక్తులను చేయడానికి ఆయనలాంటి అల్లూరి సీతారామరాజులు పుట్టుకొస్తారేమో! ఏపీ నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే అరెవో సాంబా అంటూ వచ్చేస్తానంటున్నాడు గబ్బర్‌సింగ్. ఇప్పటికే విభజనతో నష్టపోయిన రాష్ట్రంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తే తనకంటే తీవ్రవాది మరొకరు ఉండరని వకీల్‌సాబ్ వార్నింగిస్తున్నారు. మేము దేశభక్తులమని చెబుతున్నారు. ఆయన దేశభక్తిని శంకించడం కాదుగానీ లెఫ్టో రైటో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న దేశభక్తుడో వ్యవస్థను మార్చాలనుకునే తీవ్రవాదో తేల్చుకుంటే జనానికి కూడా కాస్త క్లారిటీ వస్తుంది.