ఫ్లోలో వచ్చేసింది.. వదిలేయండన్న బాలయ్య!

By KTV Telugu On 26 January, 2023
image

అడ్డమొచ్చినోళ్లని బాలయ్య కొట్టడమేగానీ ఆయన్నెవరూ కొట్టలేరు. ఇలా మాట్లాడటం తప్పని గడ్డిపెట్టలేరు. అందుకే ఆయన చెప్పుతో ఆయన కొట్టుకోకపోయినా చేసిన తప్పులకు చెంపలేసుకుంటున్నారు. సారీలు చెప్పేస్తున్నారు. బాలయ్య ప్రాసకోసం పాకులాడకపోయినా ఫర్వాలేదు. అనర్గళంగా ప్రసంగించపోయినా వచ్చే నష్టమేమీ లేదు. ముందు ఆయన కాస్త హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి. నాలుగే మాటలు మాట్లాడినా అర్ధవంతంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అడుసు తొక్కిన ప్రతీసారీ కాళ్లు కడుక్కోవాల్సి వస్తుంది.

వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో అక్కినేని, ఎస్వీరంగారావుల ప్రస్తావన ఎందుకో బాలయ్యకే తెలియాలి. మాట్లాడటం మొదలుపెడితే ఆయనకు ఒళ్లు తెలీదు. నాలుక అదుపులో ఉండదు. అందుకే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడిన మాటకు ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు. నాగార్జున మౌనంగా ఉన్నా ఆయన కొడుకులిద్దరూ స్పందించారు. బాలయ్యలాగే నోరుపారేసుకోకుండా సంస్కారవంతంగా ఖండించారు. ఇప్పుడు బాలయ్య ఆ వ్యాఖ్యలు యాదృచ్ఛికం అంటున్నారు. సిన్మా ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌-ఏఎన్నార్‌ రెండు కళ్లని చెబుతున్నారు. అక్కినేని నాగేశ్వరరావును తాను బాబాయ్‌ అని పిలిచేవాడినని గుర్తు చేసుకున్నారు. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందంటూ డ్యామేజ్ కంట్రోల్‌ చేసే ప్రయత్నంచేశారు.

బాలయ్య వివరణతో అక్కినేని మనవళ్లు సంతృప్తిచెందుతారో లేదో తెలీదు. వాళ్లేమీ స్పందించకపోతే బాలయ్యని క్షమించారనే అనుకోవాలి. ఇక బాలయ్య నోరుపారేసుకున్న మరో దివంగత మహానటుడు ఎస్వీ రంగారావు మనవళ్లు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. వీరసింహా అదృష్టమేంటంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎస్వీఆర్‌ మనవళ్లకు వివాదమేమీ కనిపించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై మనవళ్లు ఇద్దరూ స్పందిస్తూ బాలకృష్ణతో తమకు అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. తామంతా ఓ కుటుంబంలా ఉంటామన్నారు. సాధారణ పోకడలో బాలయ్య చెప్పిన మాటలకు పెడర్థాలు తీయొచ్చని కోరారు. బాలయ్య బాల్‌ బాల్‌ బచ్‌గయా. ఫ్లోలో వచ్చిందని ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలాగయ్యా బాలయ్యా!