తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయ్. ఏపీ కంటే ముందే ఇక్కడ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ సారి పోటీ రసవత్తరంగానూ ఉత్కంఠ భరితంగానూ ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్, బండి సంజయ్ నడిపిస్తున్న బీజేపీ ప్రధాన పోటీదారులుగా కనిపిస్తాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటాయి. అయితే అంతకు మించి తెలంగాణ రాజకీయాల్లో మరో కోణం కూడా ఉంది. అదే చిన్న పార్టీలుగా కనిపించే రాజకీయ సంస్థల ప్రభావం ఎంతన్న కోణం గెలవడానికా గెలిపించడానికా.. గెలిచే పార్టీలను ఓడించడానికి ఈ పార్టీలో రంగంలో ఉన్నాయన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జనసేనాధ్యక్షుడు పవన్కళ్యాణ్ తెలంగాణలో పోటీపై క్లారిటీ ఇచ్చారు. కొండగట్టులో వారాహికి పూజలు నిర్వహించిన తర్వాత జగిత్యాల జిల్లా నాచుపల్లిలో తెలంగాణ కార్యవర్గ సమావేశం నిర్వహించి మరీ ఆయన పోటీపై మాట్లాడారు. తెలంగాణలో ఏడు నుంచి 14 లోక్ సభా నియోజకవర్గాల్లో పోటీ చేసే విషయం జనసేన పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు. ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమేనని బీజేపీతో దోస్తీ కొనసాగుతుందని పవర్ స్టార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పైనా ఆయన పరోక్షంగా సందేశమిచ్చారు. తెలంగాణలో 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు అవకాశాలున్నాయని పవన్ గతంలో ప్రకటించారు. ప్రతీ నియోజకవర్గంలో సాలిడ్ గా ఐదు వేల ఓట్లు ఉంటాయని ఆయన చెప్పుకున్నారు. నిజానికి జనసేన ఒక సర్వే చెసినట్లు చెబుతున్నారు. ఆ సర్వే ప్రకారం 32 నియోజకవర్గాల్లో తాము ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తూ ఒక జాబితాను జనసేన శ్రేణులు పవన్కళ్యాణ్ ముందుంచాయి. అల్టిమేట్ గా డజను నుంచి 15 చోట్ల జనసేన బరిలోకి దిగే అవకాశం ఉంది. ఖచితంగా చెప్పాలంటే బీజేపీ కోసమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి జనసేన తప్పుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తును ఆశించి విశ్వసించి ఆ పని చేసింది. అయితే ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి రోడ్ మ్యాప్ అందలేదు. జనసేనతో అధికారికంగా గానీ అనధికారికంగా గానీ ఎలాంటి పొత్తూ ఇంకా ఖరారు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలా రెడ్డి ఇప్పుడు వైఎస్సార్టీపీ పేరుతో తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. దాదాపు 4000 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. మరో విడద పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె అక్కడ ఒక కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆమె నమ్ముతున్నారు. ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉండే ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలను ఆమె టార్గెట్ చేశారు. నిజానికి ఖమ్మం జిల్లాలో తెలుగు దేశం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఒకప్పుడు అది కమ్యూనిస్టుల కంచు కోట. వైఎస్సార్ వారసత్వంతో ఆ రెండు వర్గాలను దెబ్బకొట్టి గెలవాలని షర్మిల చూస్తున్నారు. పవన్, షర్మిల ఇద్దరు ఓట్లు చీల్చి తెలంగాణ పార్టీలను దెబ్బతీసే అవకాశమే ఉంది. పవన్ డైరెక్టుగా రంగంలోకి దిగితే బీఆర్ఎస్ ఓట్లకు గండి పడే ప్రమాదం ఉంది. షర్మిల ప్రతీ అడుగు కాంగ్రెస్ కు నిద్రపట్టని పరిస్థితిని సృష్టించే వీలుంది.
మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత దళిత సామాజిక వర్గాల్లో చైతన్యం పెరిగిందనే చెప్పాలి. బీఎస్పీ ఇప్పుడు అధికార పార్టీని ప్రశ్నిస్తూ దళితులకు అండగా నిలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో పోటీతో ఉనికిని చాటుకున్నామని భవిష్యత్తులో అద్భుతాలు సృష్టిస్తామని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. బీఎస్పీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా ఒంటరిగా పోటీ చేస్తుందా ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఆ పార్టీ విడిగా పోటీ చేస్తే మాత్రం దళితుల ఓట్లు చీలిపోయి మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టడం ఖాయమనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పార్టీల గుంపు పెరిగిపోయింది. అయినా నేనున్నానంటూ మత ప్రచారకుడు కే ఏ పాల్ రాష్ట్రమంతా తిరుగుతున్నారు. మునుగోడులో పోటీ చేసిన ప్రజా శాంతి పార్టీ 800 ఓట్లు సాధించింది. ఓటుకు ఐదు నుంచి ఎనిమిది వేలు ఇచ్చిన ఎన్నికల్లో పైసా ఖర్చు చేయని పార్టీకి అన్ని ఓట్లు రావడం మామూలు విషయం కాదు. కొందరైనా మార్పును కోరుకుంటున్నారనేందుకు అదీ ఓ నిదర్శనమని చెప్పాలి. ఏదేమైనా అధికార బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత ఎక్కువగా చీలితే అంత మంచిదని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది. అందుకే పవన్, షర్మిల ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.