దిగ్గజ కంపెనీల ఊచకోత.. ఉద్యోగాలు ఊస్ట్‌!

By KTV Telugu On 27 January, 2023
image

ఊచకోత ఉద్యోగాల ఊచకోత. ఓ పోటుపొడిస్తే ఓ బుల్లెట్‌ దించితే కాసేపు విలవిల్లాడి ప్రాణం పోతుంది. కానీ ఈ ఊచకోత ఉద్యోగులను రోడ్డునపడేస్తుంది. సంసారాలను సంక్షోభంసాగరంలోకి నెట్టేస్తోంది. మూడే మూడునెలల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీల భారీ తొలగింపుతో దాదాపు 2 లక్షల మంది ఐటి ఉద్యోగులు ఇంటిదారి పట్టారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ ఉద్యోగుల పరిస్థితి త్రిశంకుస్వర్గంలో ఉంది. వర్క్ వీసాలతో కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో వారి కష్టాలు చెప్పనలవికాకుండా ఉన్నాయి. పెద్ద కంపెనీల్లో ఉద్యోగంతో జీవితాంతం ఏ లోటూ లేదనుకున్న ఉద్యోగుల ఆశలపై యాజమాన్యాలు నీళ్లు చల్లాయి. నిర్దాక్షిణ్యంగా లేఆఫ్‌లు ప్రకటించాయి. వాతపెట్టి వెన్నరాసినట్లు మిమ్మల్ని తొలగిస్తున్నందుకు బాధపడుతున్నామని మాటలతో ఓదారుస్తున్నాయి.

పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికాలోని భారతీయ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. అగ్రరాజ్యంలో ఉండటానికి వర్క్ వీసాలు అనుమతించినా గడువులోపు కొత్త ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకంలేదు. దీంతో ఇన్నేళ్ల సర్వీసు తర్వాత మళ్లీ ఉద్యోగవేటలో వేలమంది ఉద్యోగులు జీవన్మరణ పోరాటం చేయాల్సి వస్తోంది.
ప్రపంచ ఆర్థికవేత్తలు ఊహించిందే జరుగుతోంది. అగ్రరాజ్యం ఆర్థికమాంద్యంలో కూరుకుపోతోంది. ఆ ప్రభావం అన్ని రంగాలకంటే ముందు ఐటీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిర్వహణాఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్, అమెజాన్‌, మెటాల బాటలోనే గూగుల్ కూడా వేలమంది ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కూడా లేఆఫ్ ప్రకటించింది. ఇప్పటిదాకా డాలర్స్‌ డ్రీమ్‌లో సుఖంగా గడిపిన టెక్‌ ఉద్యోగులకు పీడకలలాంటి అనుభవమిది. అమెరికాతోనే ఆగేలా లేదు ఈ ఉద్యోగాల ఊచకోత. ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా విస్తరించేలా ఉంది.

ఎన్నో ఏళ్ల సేవలు అందించిన ఉద్యోగులను కూడా కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం 2023 జూన్, జులైదాకా ప్రభావం చూపే అవకాశం ఉందని సత్యనాదెళ్ళ లాంటివారు అంచనా వేస్తున్నారు. ఏడాదిక్రితమే మొదలైంది ఉద్యోగుల లేఆఫ్‌ల ప్రక్రియ. 2022 జనవరి నుంచే అమెరికాలో కొన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన చెబుతూ వస్తున్నాయి. నవంబరు నుంచి ఊపందుకున్న ప్రక్రియ కొత్త సంవత్సరం జనవరి మొదటి వారంలో ప్రకంపనలు సృష్టించే స్థాయికి చేరింది. జనవరి1 నుంచి 24వ తేదీ మధ్యకాలంలో రోజుకు సగటున 3 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది మన భారతీయులే. అందులోనూ తెలుగువారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. దాదాపు 80వేల మందికి పైగా భారతీయులు ఇప్పటిదాకా ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇందులో 60 శాతం తెలుగువారేనంటున్నారు.

అమెరికాలో టెకీల్లో ఎక్కువమంది హెచ్1B వీసాలపై కొనసాగుతున్న వారే. ఈ వీసాలపై అక్కడుంటూ ఉద్యోగాలు కోల్పోయిన వారు రెండ్నెల్లలోపు మరో ఉద్యోగంలో చేరకపోతే భారత్‌కు తిరిగిరావాల్సిందే. మూడేళ్లుగా వర్క్‌ ఫ్రం హోమ్‌తో కుటుంబాలతో సరదాగా ఉంటూనే ఉద్యోగాలు చేసుకుంటున్నవారి జీవితాలు ఒక్కసారిగా అంధకారంలో మునిగిపోయినట్లు అయింది. ఇప్పటికిప్పుడు కంపెనీలకు నష్టాలేమీ లేకపోయినా భవిష్యత్తులో ఆర్థిక మాంద్యం మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అంచనాతో ముందు జాగ్రత్త పడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇన్నాళ్లూ ఆ ఉద్యోగుల సేవలతోనే కోట్ల టర్నోవర్‌ సాధించిన కంపెనీలకు ఇప్పుడు వారు భారంగా కనిపిస్తున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా 965 కంపెనీలు లక్షన్నర మoది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. నవంబరు నుంచి మూడ్నెల్లకాలంలోనే దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికారంటోంది డేటాబేస్.

15 సంవత్సరాల క్రితం ఆర్థికమాంద్యం తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది ఉద్యోగులను టెక్ కంపెనీలు తొలగించాయి. ఇప్పుడు ఆ సంఖ్య నాలుగైదు రెట్లు ఉండేలా ఉంది. అమెరికాలో ఉద్యోగాలు పొగొట్టుకున్న భారతీయుల పరిస్థితి ఎలా ఉందో వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం కళ్లకు కడుతోంది. ఉద్యోగాలు పొగొట్టుకున్నవారిలో కొందరు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. జిట్‌ప్రో, ఫిడ్స్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌ ఉద్యోగావకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే సమాచారాన్ని అందిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు లేఆఫ్‌లతో ఉద్యోగులపై వేటు వేయటంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోతే ఆ కుటుంబంపై నేరుగా పడే ప్రభావమేంటో అధ్యక్షుడు జో బైడెన్‌ అర్థం చేసుకోగలరని ప్రకటన విడుదలచేసింది. కానీ ఓదార్పులతో జీవితాలు నిలబడవు. కంటితుడుపు ప్రకటనలు ఉద్యోగావకాశాలు కల్పించలేవు. భారతప్రభుత్వం కూడా స్పందించాలి. అమెరికా పెద్దమనసు చేసుకోవాలి.