అడ్డదారి అదానీ అందరినీ ముంచేశాడు..

By KTV Telugu On 27 January, 2023
image

చూస్తుండగానే ప్రపంచకుబేరుల జాబితాలో చేరిపోయాడు. అన్ని రంగాల్లో వేలుపెట్టేశాడు. చివరికి మీడియాను కూడా వదల్లేదా బిగ్‌ బిజినెస్‌మ్యాన్‌. ఇక షేర్‌ మార్కెట్‌లో ఆయన కంపెనీల షేర్లు మొన్నటిదాకా రేసుగుర్రాలే. కానీ అయ్యగారి బండారం బయటపడింది. షేర్లు పాతాళానికి పడిపోయాయి. అప్పుచేసి పప్పుకూడు తింటున్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. అంబానీకి నేనే పోటీ అంటూ అడ్డదారుల్లో ఎదుగాలనుకున్న అదానీ బతుకు బజార్నపడింది.
గౌతమ్‌ అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్‌ కంపెనీలు అప్పుల కుప్పలేనని తేల్చేసింది హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌. ఆ అమెరికా సంస్థ నివేదిక వ్యాపార ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ప్రమోటర్ల మాయాజాలంతోనే అదానీ కంపెనీల షేర్లు మార్కెట్‌లో పెరుగుతున్నాయని గుర్తించింది. ఆ కంపెనీల్లో పెట్టుబడులు ఎంతమాత్రం సురక్షితం కాదన్న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో అదానీ షేర్లు బావురుమన్నాయి.

గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కసారిగా రూ.55వేల కోట్లు కరిగిపోయి ఇన్వెస్టర్లకు కోలుకోలేని నష్టాలు మిగిల్చింది. ఏడు లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలు పెంచుకునేందుకు అదానీ గ్రూప్‌ అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నిగ్గుతేల్చింది. ఆ షేర్ల విలువ 85శాతంపడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనుమానాలకు తగ్గట్లే మూడేళ్లకాలంలోనే అదానీ గ్రూప్‌ కంపెనీలు అమాంతం ఎదిగిపోయాయి. షేర్ల ధరలు సగటున 819శాతం పెరగడం బలుపుకాదు వాపేనన్న విషయం తేలిపోయింది. అదానీ అడిగితే లేదంటారా. వేలకోట్ల అప్పులు తెచ్చి తన కంపెనీల సామర్థ్యాన్ని భూతద్దంలో చూపించారు అదానీ. 12,000 కోట్ల డాలర్ల అదానీ గ్రూప్‌ నెట్‌వర్త్‌లో 10వేల కోట్ల డాలర్లు మూడేళ్లలోనే వచ్చిపడినవే. దీంతో ఈ అసాధారణ ఎదుగుదలపైనా హిండెన్‌బర్గ్‌ సంస్థ అనుమానాలు వ్యక్తంచేసింది.

2022 మార్చి నాటికి అదానీ గ్రూప్‌ కంపెనీలు రూ.2.2 లక్షల కోట్లు అప్పుచేశాయి. అందులో మూడోవంతుకు పైగా అప్పు ఏడాదికాలంలోనే చేయడాన్ని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ప్రస్తావించింది. రెండేళ్లు అధ్యయనం చేసి వివిధ దేశాలను సందర్శించి వేల డాక్యుమెంట్లు పరిశీలించాక హిండెన్‌బర్గ్‌ ఈ నివేదిక రూపొందించింది. కరీబియన్‌ దీవులు, సైప్రస్‌, మారిషస్‌, యూఏఈ వంటి దేశాల్లో అదానీ గ్రూప్‌ షెల్‌ కంపెనీల జాడను కూడా కనిపెట్టింది. దశాబ్దాలుగా ఈ దందా సాగుతోందని హిండెన్‌బర్గ్‌ గుర్తించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలకు 22 మంది డైరెక్టర్లు ఉంటే అందులో 8 మంది కుటుంబ సభ్యులే.

కీలక నిర్ణయాలన్నీ అదానీ కుటుంబమే తీసుకుంటుంది. అక్రమంగా 1700 కోట్ల డాలర్లు కాజేశారన్న అభియోగాలతో గతంలో అదానీ కుటుంబసభ్యులపై నాలుగుసార్లు దర్యాప్తు కూడా జరిగింది. ఫోర్జరీ ఆరోపణలపై గౌతమ్‌ అదానీ సోదరుడు రాజేశ్‌ అదానీ గతంలో రెండుసార్లు అరెస్ట్‌ అయ్యారు. వజ్రాల ఎగుమతి, దిగుమతుల అక్రమాల విషయంలో అదానీ బావ పాత్ర ఉందన్న ఆరోపణలొచ్చాయి. గౌతమ్‌ అదానీ అన్న వినోద్‌ అదానీ విదేశాల్లో 38 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఎన్నో వాస్తవాలను హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వెలుగులోకి తేవటంతో అదానీ అక్రమ సామ్రాజ్యం కదులుతోంది. కేవలం ద్వేషంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అదానీ గ్రూప్‌ ఈ ఆరోపణలు ఖండించింది. న్యాయస్థానాల్లో ఈ అభియోగాలేవీ నిలబడలేదని ఇంకా బొంకే ప్రయత్నంచేస్తోంది. కానీ హిండెన్‌బర్గ్‌ దగ్గరున్న ఆధారాలు చట్టంముందుకొస్తే అదానీకి చిప్పకూడు తప్పదేమో.