ఇండియా వద్దు.. ఫారినే ముద్దు అని వాళ్లేందుకు అంటున్నారు. పురిటి గడ్డను వదిలి విమానం ఎక్కడానికి రీజనేంటి.. ఇక్కడ ఉండలేకపోతున్నారా… విదేశాల్లో అవకాశాలు పెరుగుతున్నాయా ఏటా ఎంత మంది వెళ్తున్నారు..?
పై చదువుల కోసం ఫారిన్ వెళ్లడం ఎప్పటి నుంచో ఉంది. అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోవడమూ జరుగుతున్నదే. దశాబ్దకాలంగా మరో ట్రెండ్ కనిపిస్తోంది. ఇండియాలో సంపదను సృష్టించి…. కూడబెట్టిన వేల కోట్ల రూపాయలు చేతబట్టుకుని విదేశాలకు వెళ్లిపోయేందుకు భారతీయులు ఇష్టపడుతున్నారు. 2022లో అలా 8వేల మంది పెట్టే, బేడా సర్దుకుని వెళ్లిపోతున్నట్లు లెక్కతేలింది. విదేశాల్లో స్థిర నివాసమే తమ కుటుంబానికి మంచిదని వారు నిర్ణయానికి వచ్చారు..
కోట్ల కొద్దీ సంపదను సృష్టించిన మిలియనీర్లు.. విదేశాల దారి పడుతున్నారు. స్థిర నివాసమే ధ్యేయంగా ఇలా వెళ్లిపోతున్నవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2019వ సంవత్సరంలో 7,000 మంది భారతీయ ధనవంతులు విదేశాలకు వెళ్లిపోగా, అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 6,000గా ఉన్నది. 2015లో 4,000 మందిగా ఉంటే, రెండేండ్లలో 3,000 మంది పెరిగినట్లు అనుకోవాలి. ఈ ఏడాది ఆఖరుకు 8 వేల మంది వలస పోతారని అంచనా. మరో పక్క డ్రాగన్ కంట్రీ చైనా నుంచి ప్రతీ ఏటా పది వేల మంది వెళ్లిపోతున్నారు. వాళ్లంతా అమెరికా, యూరప్ లో సెటిలవుతున్నారు…
దుబాయ్ కేంద్రంగా యూఏఈ అని పిలిచే ఎమిరేట్స్ దేశాలకు ఈ ఏడాది ఎక్కువ మంది వెళ్తారని సర్వేలో తేలింది. ఎమిరేట్స్ కు నాలుగు వేల కుటుంబాలు, ఆస్ట్రేలియాకు 3 వేల 500 మంది, సింగపూర్ కు 2 వేల ఎనిమిది వందల మంది వెళ్తున్నారు. యూరప్ లో స్విట్జర్లాండ్, ఆసియాలో ఇజ్రాయెల్ కూడా వీళ్ల ఫెవరేట్ కంట్రీస్ గా మారాయి. అయితే అమెరికాకు వలసలు తగ్గాయని ఒక అంచనా. భారతీయులు వెళ్లి స్థిరపడటం కారణంగా ఆస్ట్రేలియా దేశ సంపద 70 నుంచి 80 శాతం పెరిగిందని సర్వేల్లో తేలింది..
తయారీ రంగంలో స్థిరపడిన సంప్రదాయ సంపన్నుల కుటుంబాల వాళ్లు ఎక్కడికి వెళ్లడం లేదని సర్వేలు చెబుతున్నాయి. టెక్నాలజీ రంగంలో కష్టపడి సంపదను సృష్టించిన వాళ్లు మాత్రం ఇక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. 2020, 2021 సంవత్సరాల్లో ప్రభుత్వాలు భారీగా పన్నులు విధించడంతో ఉన్న డబ్బంతా సర్కారుకు ఇచ్చేయ్యడం ఇష్ట లేక వెళ్లిపోతున్నట్లు భావించాలి. వ్యక్తిగత పన్ను నుంచి మినహాయింపులు పెరగడం లేదు. దుబాయ్, సింగపూర్, ఇజ్రాయెల్ లాంటి చోట్ల పన్నులు తక్కువగా ఉంటడం కూడా ఒక కారణం కావచ్చు. విదేశాల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండటం, కుటుంబ సభ్యులకు విద్యా, వైద్య సదుపాయాల కూడా మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం కావచ్చు. అనేక దేశాలు వీసా రహిత ప్రయాణానికి అవకాశం ఇవ్వడం, ఒక దేశంలో ఉంటూ మరో దేశంలో వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం లాంటి పరిణామాలు వారికి కలిసొస్తున్నాయి. టెక్నాలజీ రంగంలో పెట్టుబడి పెట్టేవాళ్లు సింగపూర్ వెళ్లడానికి ఇష్టపడుతుంటే…ఆర్థిక రంగంలోని వారిని దుబాయ్ ఆహ్వానిస్తోంది. కొందరు గ్రీస్, పోర్చుగల్, మాల్టా దేశాలకు ఫ్లైట్ ఎక్కుతున్నారు…దేశంలో శాంతి భద్రతలు క్షీణించడం కూడా పెట్టుబడిదారులకు ఇబ్బందిగా మారింది.
ఇండియాలో రోజుకు 70 మంది కొత్త మిలియనీర్లు పుట్టుకువస్తున్నారని సర్వేలు అంచనా వేస్తున్నాయి. భారతీయుల సంపద వచ్చే పదేళ్లలో 83 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యాపారానుకూలత, సంపదను ప్రోది చేసుకునే సౌకర్యాలు ఇక్కడ లేవు. ఈ సంపదను తీసుకెళ్లి విదేశాల్లో పెట్టుబడిపెడితే చీకుచింతా లేకుండా హాయిగా బతికే అవకాశం ఉందని విశ్వసించిన కారణంగానే వలసలు పెరుగుతున్నాయి. ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారడం కూడా అక్కడ సాధ్యపడుతోంది. అలాగని శాశ్వతంగా విదేశాల్లోనే ఉండాలన్న ఉద్దేశం కూడా వారికి లేదట. స్వదేశంలో పరిస్థితులు మెరుగు పడితే తిరిగి వచ్చేందుకు వెనుకాడబోమని బహిరంగంగానే చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం పన్నులను హేతబద్ధీకరించడం, నిబంధనలను సరళతరం చేయడం లాంటి చర్యలను చేపట్టగలిగితే వారిలోనూ విశ్వాసం పెరుగుతుంది..
సంపన్నుల దేశం విడిచి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జాతీయ సంపద పెరిగాలంటే.. ప్రైవేటు పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా రావాలని ప్రభుత్వం గుర్తించాలి. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, మరి ఆ పని చేస్తారో లేదో చూడాలి….