భారతీయ జనతాపార్టీలో కన్నా లక్ష్మీనారాయణ హనీమూన్ ముగిసినట్లేనా. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుతో అమీ తుమీ తేల్చుకునేలా వ్యవహారాలు నడుపుతోన్న కన్నా జనసేనలో చేరతారా లేక చంద్రబాబు నాయుడి పార్టీలోకి జంప్ చేస్తారా. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన కన్నా ఫ్యూచర్ ఏంటి. గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు. గుంటూరు జిల్లా పెద కూర పాడు నియోజకవర్గం నుండి 1989లో మొదటి సారి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు కన్నా. ఇక అప్పటి నుండి వెను తిరిగి చూడలేదు.
1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లోని అతిరథ మహారథులంతా ఓడిపోయిన ఎన్నికల్లోనూ గెలిచి సత్తాచాటిన 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి పెదకూర పాడు నియోజక వర్గాన్ని ఇరవై ఏళ్ల పాటు నిరాటంకంగా ఏలారు. 2009 ఎన్నికల్లో గుంటూరు పడమట నియోజక వర్గం నుండి గెలిచారు. వై.ఎస్.మరణానంతరం రోశయ్యను ముఖ్యమంత్రిని చేసిన హైకమాండ్ రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి ఎవరా అని వెతుకుతోన్న తరుణంలో కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా గట్టిగానే వినపడింది. ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డికి తమిళనాడుకు చెందిన చిదంబరంతో ఉన్న అనుబంధం కలిసొచ్చి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే కిరణ్ కేబినెట్ లో కన్నా మంత్రిగా వ్యవహరించారు.
2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ కు ఎలాంటి ఛాన్స్ లేకపోవడం వల్ల కన్నా కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. ఆయన ఇక రేపో మాపో వైసీపీలో చేరతారనగా బిజెపి హైకమాండ్ కన్నాకు గేలం వేసి ఏపీ బిజెపి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. 2019 ఎన్నికల్లో నరసరావు పేట నుండి పోటీచేసిన కన్నా నాలుగో స్థానంలో నిలిచి డిపాజిట్ కోల్పోయారు. ఎన్నికల అనంతరం కొంత కాలం బిజెపిలో హడావిడి చేసినా అమరావతి రైతుల యాత్రకు మద్దతు తెలిపే విషయంలో చంద్రబాబు కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. బిజెపి అధినాయకత్వం చంద్రబాబును దూరం పెడితే కన్నా బాబు ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కన్నాను పక్కన పెట్టి సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది బిజెపి.
సోము వీర్రాజు రావడంతోనే బిజెపిలోని చంద్రబాబు అనుకూల నేతలకు కష్టాలు మొదలయ్యాయని అంటారు. సోము రాకతో కన్నా లక్ష్మీనారాయణ కూడా అసంతృప్తితో ఉన్నారు. సోము వీర్రాజు వైఖరి కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపికి దూరంగా జరుగుతున్నారని కన్నా ఈ మధ్య బాహాటంగానే వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. అయితే ఈ విషయంలో పార్టీ నాయకత్వం సోము వీర్రాజుకే అండగా నిలవడంతో కన్నా కుత కుత లాడిపోయారు. ఇక బిజెపిలో తనకి భవిష్యత్ ఉండదని తేల్చుకన్న కన్నా ఆలోచనలో ఉన్న తరుణంలోనే జనసేన లో నెంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కన్నా ఇంటికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన పార్టీలోకి కన్నాను ఆహ్వానించడానికే నాదెండ్ల వెళ్లారన్న వార్తలు షికారు చేశాయి.
వీటిని అటు కన్నా కానీ ఇటు బిజెపి కానీ ఖండించలేదు. కానీ తాజాగా భీమవరంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కన్నా గైర్హాజరు కావడం తో కన్నా అంశం మళ్లీ చర్చకు వచ్చింది. కన్నా బిజెపికి గుడ్ చెప్పడం ఖాయమని అందుకే సమావేశానికి రాలేదని ప్రచారం జరిగింది. అయితే హైదరాబాద్ లో కొన్ని వ్యక్తిగత పనులు ఉన్నందునే కన్నా సమావేశాలకు రావడం లేదని ముందుగానే సమాచారం ఇచ్చారని బిజెపి నేతలు అంటున్నారు. అయితే అందులో నిజం ఎంతన్నది తేలాలి. కానీ పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లో మాత్రం కన్నా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. కాకపోతే జనసేనలోకి వెళ్తారా లేక టిడిపి తీర్థం పుచ్చుకుంటారా అన్నది చూడాలి. ఎందులోచేరినా రెండు కలిపే పొత్తు పెట్టుకుంటాయి కాబట్టి పెద్దగా తేడా ఏమీ ఉండదంటున్నారు రాజకీయ పరిశీలకులు.