ఈ ఏడాది అన్ని రాజకీయ పార్టీలకు కఠిన పరీక్ష

By KTV Telugu On 27 January, 2023
image

కేంద్రంలో రెండుసార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈసారి గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో తిరుగులేని రాజకీయపార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీకి 2023వ సంవత్సరం అత్యంత క్లిష్టమైన సవాల్‌ను విసరబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాల రాజకీయ చాణక్యానికి కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది. ఓ వైపు దేశమంతా రాహుల్ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్ ఆప్ బలం పెంచుకుంటోంది. ఇక బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటున్నారు. ఇంకోవైపు నితీష్ కుమార్ విపక్షాలన్నంటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈసారి కమలనాథులు కాస్త గట్టిగానే చెమటోడ్చాల్సిన పరిస్థితులున్నాయంటున్నారు.

ఈ ఏడాది అన్ని పార్టీలకు అత్యంత కీలకమనే చెప్పాలి. ఈ ఒక్క సంవత్సరంలోనే ఉత్తరాది ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లో 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొమ్మిది రాష్ట్రాల్లో ఐదు పెద్ద రాష్ట్రాలు కాగా నాలుగు చిన్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలలో గెలుపు కోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ కసరత్తులు మొదలుపెట్టాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముందు జాతీయ పార్టీలకు ఈ ఎన్నికలు సెమీఫైనల్‌ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు కాషాయ నేతలు ఇప్పటి నుంచే ఆయా రాష్ట్రాలను గెలుచుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు రాజస్థాన్ చత్తీస్ గడ్, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది బీజేపీ. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్కటి కోల్పోయినా ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుంది. అటు కాంగ్రెస్ కూడా ఆయా రాష్ట్రాల్లో బీజేపీని నిలువరించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాల్సి వస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా పార్టీలో చీలికల కారణంగా బీజేపీయే అధికారాన్ని చేపట్టింది. త్రిపురలో మరోసారి బీజేపీ గెలవడం అంత సులువు కాదంటున్నారు. కమ్యునిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి త్రిపురలో అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా తిరిగి కమ్యునిస్టులకు అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. నాగాలాండ్, మేఘాలయలో కూడా బీజేపీ అధికారంలో భాగస్వామిగా ఉంది. ఈ రాష్ట్రాల్లోనూ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ లతో పోటీ పడాల్సి ఉంది. అలాగే తర్వాత మిజోరాంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. రాజస్థాన్‌లో గెహ్లాట్, పైలట్‌ల మధ్య వర్గపోరు తమకు కలిసొస్తుందని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. ఇక తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడం కాంగ్రెస్, బీజేపీలకు సవాలే. కర్ణాటకలో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరు జరగనుంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌లో నూతనోత్తాజాన్ని నింపింది. ఆ పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో జోడో యాత్ర ఊపిరి ఇచ్చిందనే చెప్పాలి. అలాగే బీజేపీ కూడా జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టుకుని తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలపై రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేసింది. మరోవైపు, తొమ్మిది రాష్ట్రాల్లోనూ అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వాటిని అధిగమించి జాతీయ పార్టీలు అధికారంలోకి రావాల్సి ఉంది. మొన్నటి ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసుకోగా హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేజారిపోయింది. గతంలో లా నరేంద్రమోడీ క్రేజ్ కనపడటంలేదు. వరుసగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ మీడియాలో బలంగా కనపడుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పార్టీకి కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్, బీజేపీలు ఈ ఏడాదిని విజయవంతంగా ముగిస్తేనే 2024లో ఢిల్లీలో చక్రం తిప్పుతారు. లేదంటే కష్టమే.