ఆ దేశం పరిస్థితి ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ అన్నట్లుగా తయారైందా. అందరికీ సాయం చేస్తామని చెప్పుకునే అగ్రరాజ్యం ఆదుకునే నాథుడి కోసం నిరీక్షిస్తోంది. నష్టాలు, ఆర్థిక కష్టాలకు కారణమేంటీ. పెద్దన్న బైడెన్ కూడా చేతులెత్తేశారా. అసలు సంగతేంటి…
అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక వెత్తలు అంచనా వేస్తున్నారు. అన్ని రంగాలు కుదేలై ప్రభుత్వ ఖజానాకు నిధులు అందడం లేదు. త్వరలో స్టాక్ మార్కెట్లు పతనమై 40 శాతం దిగువకు వస్తాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 70 శాతం మంది అమెరికన్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి లాభాల కోసం వేచి చూడటం అలవాటుగా వస్తోంది. ఇప్పుడు మాత్రం వారిలో భయాలు నెలకొన్నాయి. బుల్ మార్కెట్ కాస్త.. ఇప్పడు బేర్ మార్కెట్ గా మారిందని… ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి…
ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ఆర్థికవేత్తలను ఇంటర్వ్యూ చేస్తూ ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం 2023 ప్రథమార్థంలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని 70 శాతం మంది తమ అభిప్రాయంగా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకెండ్ క్వార్టర్ లో అమెరికా ఆర్థిక వృద్ధి రేటు 1.5 శాతం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది శాతానికి పడిపోతుందని తేల్చారు. అంటే మాంద్యానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం 8 పాయింట్ ఆరు శాతానికి చేరుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాలో ఆర్థికమాంద్యం ఎక్కువ రోజులే ఉంటుంది..
అమెరికాలోనూ భారత తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 30 ఏళ్లలో వడ్డీ రేట్ల పెంపు భారీగా ఉండనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు రుణ రేటు బెంచ్‌మార్క్‌ను 0.75 శాతం పాయింట్లు పెంచింది. 1994 నవంబర్ అనంతరం మొదటి సారి 75 బేస్ పాయింట్ల పెరుగుదల నమోదు కావడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాాలా రోజులుగా నిరుద్యోగం రేటు 3 పాయింట్ ఆరు శాతంగా కొనసాగుతోంది. క్రెడిట్ కార్డులను విరివిగా వాడే అమెరికన్ల వద్ద ఇప్పుడు చెల్లింపులకు డబ్బులు లేవు.
ఉక్రెయిన్ , రష్యా యుద్ధంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.ఒక వైపు ఉక్రెయిన్ కు అమెరికా నిధులు సమకూరుస్తోంది. మరో పక్క రష్యా ఎగుమతులపై నిషేధం విధించింది. దానితో ఆమెరికాలో చమురు ధరలు పెరుగుతున్నాయి. వాటి ప్రభావం అన్ని రంగాలపై కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ధరలు తగ్గే అవకాశం లేదని కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు పైగా భవిష్యత్తులో ఆదుకుంటామంటున్నారు ఎప్పుడు, ఎలా ఆదుకుంటారో మాత్రం చెప్పడం లేదు..
అమెరికాలో జనం ఎక్కువగా తినే ఏడు ఆహార పదార్థాల ధరలు 25 నుంచి 30 శాతం పెరిగాయి. దానితో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. రష్యాతో డీలింగ్ ఉన్న కంపెనీలు ఎగుమతి, దిగుమతలను ఆపెయ్యడం వల్ల కార్పొరేట్ లాభాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కార్పొరేట్ కంపెనీల పన్నుల చెల్లింపులు కూడా అంతంతమాత్రమే అవుతున్నాయి. దానితో ఆమెరికా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు…
మాంద్యం అనేది సమాజాన్ని భయకంపితులను చేస్తుంది. మాంద్యం రాకముందే టెన్షన్ పుట్టిస్తుంది. అందుకే ప్యానిక్ కాకుండా దిద్దుబాటు చర్యలు అవసరం…