విగ్రహాలు పెట్టేస్తే ఓట్లు వేసేస్తారా ?

By KTV Telugu On 28 January, 2023
image

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ఎత్తైనా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తోంది. ఇందు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. చైనా నుంచి ఈ విగ్రహం దిగుమతి అవుతోంది. ఇలాంటి విగ్రహాల తయారీలో చైనా కంపెనీలది ప్రత్యేక అనుభవం. గుజరాత్ లో ప్రధాని మోదీ ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని కూడా చైనా నుంచే తెప్పించారు. అయితే ఈ అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వల్ల కేసీఆర్ ఏం సాధించాలనుకుంటున్నారు. విగ్రహాన్ని చూసి అంబేద్కరిస్టులంతా పోలోమని ఓట్లు వేసేస్తారని ఆశ పడుతున్నారా. సుభాష్ చంద్రబోస్ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు పెట్టాలని ఎందుకు అనుకోరు. ఎన్టీఆర్ మార్గ్ గా ప్రసిద్ధి చెందిన ఆ పేరును రూపుమాపేలా అంబేద్కర్ విగ్రహం పెట్టడం వ్యూహాత్మకమేనా.

హుస్సేన్ సాగర్, ప్రసాద్ ఐ మ్యాక్స్ మధ్యలో ఉన్న స్థలంలో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దాదాపుగా అరవై శాతం పూర్తయింది. విగ్రహన్ని భాగాలుగా చైనా నుంచి తీసుకొస్తున్నారు. వాటికి ఇక్కడ పేరిస్తే విగ్రహం తయారైపోతుంది. ప్రస్తుతం నడుం వరకూ నిర్మాణం పూర్తయింది. ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం నిధుల కొరత రానీయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ విగ్రహం గురించి ప్రభుత్వం కూడా గొప్పగా చెప్పుకుంటోంది. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ ను గొప్పగా గౌరవించుకుంటున్నామని చెబుతోంది. అయితే అంతా భారీ విగ్రహం పెట్టడమే గౌరవించుకోవడమా అంటే ఇది చాలా పెద్ద చర్చనీయమైన అంశం అవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం అంబేద్కర్ పై తమ గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికి ఇంత కంటే షార్ట్ కట్ మార్గం లేదని నిర్ణయించుకుని దీనికే ఫిక్స్ అయిపోయింది.

అంబేద్కర్ విగ్రహం పెట్టడంలో ఏమాత్రం అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వానికి ఇతరులు ఎందుకు గుర్తుకు రావడం లేదనేదే చాలా మంది సందేహం అభ్యంతరం. అసలు స్వాతంత్రం రాక ముందు స్వేచ్చ కోసం పోరాడిన వారు ఎందరో ఉన్నారు. కొత్త తరంలో సరైన ప్రాధాన్యం దక్కని యోధులు. పాఠ్య పుస్తకాల్లో పాఠాలకే పరిమితమైన వీరు కోకొల్లలుగా ఉన్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం కనీస గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. అంబేద్కర్ గురించి తెలియని వారు దేశంలో ఉండరు. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే వచ్చాయి. కానీ స్వాతంత్య్రం రాకపోతే అలా రాజ్యాంగం అమల్లోకి వచ్చే అవకాశం ఉండేది కాదు. అందుకే స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని భావితరాలు గుర్తుంచుకునేలా చేయడంలో ప్రభుత్వాలు మరింత చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఇలాంటి ప్రయారిటీ లేని ప్రభుత్వాల గురించి చర్చ ఉండదు కూడా. వందల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు కళ్ల ముందు ఉన్నప్పుడు మాత్రం. ప్రశ్నించక తప్పదు.

కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఒడ్డున వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రతిష్టించడానికి ప్రధాన కారణం. ఓటు బ్యాంక్ రాజకీయమేనని చెప్పక తప్పదు. మూడో సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ దళిత వర్గాల మద్దతు పొందాలనుకుంటున్నారు. వారు ఎటు వైపు మొగ్గితే అటు వైపు అధికారం ఉంటుంది. ఈ వర్గాలను పూర్తి స్థాయిలో అనుకూలంగా మల్చుకునేందుకు దళిత బంధు లాంటి పథకాలతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పెట్టిస్తున్నారు. నిజానికి అంబేద్కర్ అందరి వాడు. కానీ విచిత్రమేమిటో కానీ రాజకీయ పార్టీలన్నీ అంబేద్కర్ ను కేవలం దళితలుకే పరిమితం చేస్తాయి. ఆయా వర్గాలు కూడా అదే మైండ్ సెట్ తో ఉంటాయి. ఇలాంటి రాజకీయ పరిస్థితులతో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూపించి దళితుల మెప్పు పొందాలనుకుంటున్నారు. అందులో సందేహం లేదు.

అయితే ట్యాంక్ బండ్‌పై ఉండేలా సిద్ధం చేస్తున్న ఈ విగ్రహం అదొక్క లక్ష్యమే కాదన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ట్యాంక్ బండ్. హుస్సేన్ సాగర్ అంటే ఎన్టీఆర్ ఘాట్ ఎక్కువగా గుర్తుకు వస్తుంది. ఆ ముద్రను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందన్న గుసగుసలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ రాజకీయ వ్యూహాలు. అంతే కాదు ఈ విగ్రహ రాజకీయం వెనుక మరో ముఖ్య కారణం కూడా ఉంది. అదేమిటంటే ప్రధానిగా మోదీ గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేశారు. తాను మాత్రం అలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయలేమా అని కేసీఆర్ సవాల్ చేస్తున్నట్లుగా ఈ విగ్రహ ప్రతిష్టాపన ఉందని అనుకోవచ్చు. ఇటీవలి కాలంలో మోదీ కన్నా తానే ఎక్కువ పని మంతుడినని కేసీఆర్ నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే దీన్ని కూడా తోసి పుచ్చలేం.

కారణాలేమైనా ప్రస్తుతం విగ్రహ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. అవసరం అయిన వారి ఆకలి తీర్చడం కన్నా ఇలా విగ్రహాలు పెట్టడం ద్వారానే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఆకలితో ఉన్న వారికి ఇప్పుడు కావాల్సింది కడుపు నిండటం కూడా కాదు. భావోద్వేగాలను శాటిస్ ఫై చేసుకోవడం. సోషల్ మీడియా పుణ్యమా అని బుర్రకెక్కేసిన చాందసవాదమే కడుపు నింపుతుందని అనుకుంటున్నారు. ఇలాంటి వారే మెజార్టీ ఉన్నారు. వీరి ఆలోచనలకు తగ్గట్లుగానే రాజకీయ నేతలు ఆడిస్తున్నారు.