బాబూ మోహన్ కూడా గెలిచాడు కానీ పవర్ స్టార్ మాత్రం..

By KTV Telugu On 28 January, 2023
image

సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటిన వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ హాలీవుడ్ లో మెరిసిన తర్వాతనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి దేశాధ్యక్షుడైపోయారు.
మన దేశంలో సినీ రంగంలో అదరగొట్టి రాజకీయాల్లో సత్తాచాటిన వారిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిథి ఆద్యులు. ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తరపున పోటీ చేసిన కరుణానిథి 1969లో మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. 1971 ఎన్నికల్లో మరోసారి గెలిచి 1976 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ 1977 ఎన్నికల్లో అన్నా డిఎంకే తరపున బరిలో దిగి ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించాక తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎంజీయార్ మరోసారి సత్తా చాటి రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు.

సినిమాల్లో ఎంజీయార్ తో చాలా సినిమాల్లో జోడీ కట్టిన నటీమణి జయలలితను ఎంకరేజ్ చేసిన ఎంజీయార్ ఆమెను రాజ్యసభకు పంపారు. ఎంజీయార్ మరనానంతరం జయలలిత కొంత గ్యాప్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఆతర్వాత మరో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఎంజీయార్ స్ఫూర్తితో తెలుగునాట ఎన్టీయార్ పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఇక కాంగ్రెస్ టిడిపి తరపున పలువురు సినీ నటులు దర్శకులు నిర్మాతలు కూడా ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టారు.
సూపర్ స్టార్ కృష్ణ, జమున కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో గెలవగా నిర్మాత డి.రామానాయుడు, నటి శారద, సత్యనారాయణలు టిడిపి తరపున ఎన్నికల్లో గెలిచారు. మరో నటుడు రావు గోపాల రావు టిడిపి తరపున ఎమ్మెల్సీగానూ రాజ్యసభ సభ్యునిగానూ నామినేట్ అయ్యారు. మోహన్ బాబు కూడా టిడిపి తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
క్యారెక్టర్ ఆర్టస్ట్ కోట శ్రీనివాసరావు బిజెపి తరపున ఎన్నికల బరిలో నిలబడి ఎమ్మెల్యే అయ్యారు.

హాస్యనటుడు బాబూ మోహన్ టిడిపి , టి.ఆర్.ఎస్. ల తరపున గెలిచి ఎమ్మెల్యే అవ్వడమే కాకుండా మంత్రి పదవి కూడా నిర్వర్తించారు. సినీ నటి జయసుధ కాంగ్రెస్ తరపున గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మరో తెలుగు నటి జయప్రద సమాజ్ వాది పార్టీ తరపున రెండు సార్లు పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి తిరుపతి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి రాజ్యసభకు నామినేట్ అయి కేంద్ర మంత్రి అయ్యారు. మరో నటుడు కృష్ణం రాజు బిజెపి తరపున గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్, సునీల్ దత్, రాజేష్ ఖన్నాలు కాంగ్రెస్ తరపున శత్రుఘ్న సిన్హా బిజెపి తరపున ఎన్నికల బరిలో నిలిచ సత్తా చాటారు.

చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడారు. ఆయన సోదరుడు నాగబాబు కూడా జనసేన తరపున నరసాపురం లోక్ సభ నియోజక వర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. వెండితెరపై తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అనూహ్యంగా చతికిల పడ్డం విశేషం. పవన్ కళ్యాణే కాదు తమిళనాట అగ్రనటుడు శివాజీ గణేశన్ కూడా పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. మరో తమిళ నటుడు విజయ్ కాంత్ పార్టీ పెట్టి అధికారంలోకి రాలేకపోయినా 18 శాతం ఓట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందారు. సినీ గ్లామర్ వేరు రాజకీయాలు వేరు అనడానికి పవన్, శివాజీ గనేషన్ ల ఓటమే నిదర్శనం అంటారు రాజీకయ పండితులు. తమిళనాట కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టిడిపితో పొత్తు పెట్టుకుంటామన్న జనసేన అధినేత మరి ఆ ఎన్నికల్లో ఏం ఫలితం సాధిస్తారో చూడాలి.