గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొడాలి నాని నెగ్గడానికి వీల్లేదని పదేళ్లుగా చంద్రబాబు నాయుడు పళ్లు పట పటా కొరుకుతూనే ఉన్నారు. కానీ ఎన్నికల్లో మాత్రం కొడాలి తిరుగులేని విధంగా సత్తా చాటుతూ గెలుస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అయితే చంద్రబాబుకు ఊపిరి సలపని విధంగా కౌంటర్లు ఇస్తూ చికాకు పెట్టేస్తూ వస్తున్నారు కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నానిని ఓడించి తీరతామని టిడిపి వ్యూహకర్తలు శపథాలు చేస్తున్నారు కానీ అది ఎలా చేయాలో వారికీ అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అయినా టిడిపి టార్గెట్ చేధిస్తుందా.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి చిన్నపాటి కునకు పట్టినా కలలో కనిపించేది కొడాలి నానే. నాని పేరు వినపడితేనే చంద్రబాబుకు అసహనంతో ముచ్చెమటలు పడతాయి. అంతగా ఇబ్బంది పెట్టేశారు కొడాలి నాని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుని. అసలు కొడాలి నానికీ చంద్రబాబుకీ ఏంటి గొడవ ఇద్దరికీ ఎక్కడ చెడింది. 2004 ఎన్నికల్లో మొట్ట మొదటి సారి గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేశారు కొడాలి నాని.
కొడాలి నానికి టికెట్ అయితే చంద్రబాబే ఇచ్చి ఉండచ్చు కానీ కొడాలికి టికెట్ ఇవ్వాలని సిఫారసు చేసింది మాత్రం ఎన్టీయార్ పెద్ద కొడుకు హరికృష్ణే. వై.ఎస్.ఆర్. ప్రభంజనం వీచిన ఆ ఎన్నికల్లోనూ కొడాలి నాని గుడివాడ నుండి గెలిచి సంచలనం సృష్టించారు.
ఎన్టీయార్ కు వీరాభిమాని అయిన కొడాలి నానికి హరికృష్ణ అన్నా అంతే గౌరవం. అభిమానం కూడా. హరికృష్ణ అంటేనే కాదు ఆయన తనయుడు జూనియర్ ఎన్టీయార్ అన్నా కొడాలి నానికి చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీయార్ ను ఎన్టీయార్ కుటుంబ సభ్యులు దూరంగా ఉంచిన సమయంలో కొడాలి నానే ఆయన్నే చేరదీశారని అంటరు. జూనియర్ తో రెండు సినిమాలు కూడా తీశారు కొడాలి. మొదటి సారి గెలిచిన తర్వాత నియోజక వర్గంలో చాలా యాక్టివ్ గా వ్యవహరించిన కొడాలి నాని జనంతో మమేకం అవుతూ మంచి పేరే తెచ్చుకున్నారు. అయిదేళ్ల తర్వాత 2009 ఎన్నికల్లోనూ కొడాలి నాని గుడివాడ నుండే పోటీ చేశారు. మరోసారి గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత టిడిపి లో హరికృష్ణను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టడం మొదలు పెట్టారు. హరికృష్ణతో పాటు హరికృష్ణకు నమ్మకస్తులైన నేతలనూ దూరం పెట్టారు. ఆ క్రమంలోనే చంద్రబాబు వైఖరి సహజంగానే కొడాలి నానికి నచ్చలేదు. ఎన్టీయార్ కుటుంబ సభ్యులకు పార్టీలో విలువలేకపోవడం కొడాలికి నచ్చలేదు.
వై.ఎస్.ఆర్. మరణానంతరం జరిగిన పరిణామాల్లో జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టడం ఆయన ఓదార్పు యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా మీదుగా పర్యటించడం తెలిసిందే. ఈ క్రమంలోనే హరికృష్ణ అనుచరుడైన మరో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యాత్రలో ఉన్నజగన్ మోహన్ రెడ్డిని కలవడం టిడిపిలో ప్రకంపనలు సృష్టించింది. 2014 ఎన్నికలకు చాలా ముందుగానే కొడాలి నాని ఎన్టీయార్ వారసులకు విలువలేని టిడిపిలో ఉండలేక రాజీనామా చేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో గుడివాడ నుండి బరిలో నిలిచారు. తనను కాదని పార్టీ వీడిన కొడాలి నాని గెలవడదానికి వీల్లేదని చంద్రబాబు పార్టీనేతలను ఆదేశించారు. నానిని ఓడించడానికే ప్రత్యేక వ్యూహాలు పన్నారు. తమ సామాజిక వర్గ నేతలందరికీ ఫత్వాలు జారీ చేశారు. కోట్లకు కోట్ల డబ్బులు పంచిపెట్టారు. అన్ని చేసినా ఆ ఎన్నికల్లో నాని అద్భుత విజయం సాధించారు. చిత్రం ఏంటంటే ఆయన టిడిపి అభ్యర్ధిగా 2004, 2009లో సాధించిన ఓట్లకన్నా కూడా ఎక్కువ ఓట్లతో గెలిచి బాబుకు షాకిచ్చారు కొడాలి
ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కొడాలిని ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఈలోగా 2019 ఎన్నికలు వచ్చాయి. మళ్లీ చంద్రబాబు నాయుడి టార్గెట్ గుడివాడే. కొడాలి నాని గెలవకూడదు. టిడిపి రాష్ట్రంలో అధికారంలో వస్తుందా రాదా అన్నది అనవసరం గుడివాడలో కొడాలి నాని ఓడిపోయారన్న వార్త తన చెవుల్లో పడాలి అని చంద్రబాబు భావించారు. 2014 ఎన్నికల్లో పెట్టిన ఎఫర్ట్స్ కు ఎన్నో రెట్లు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు చంద్రబాబు. గుడివాడపైనే ప్రత్యేక దృష్టి సారించారు. అధికార యంత్రాంగాన్ని మోహరించారు. డబ్బులు విచ్చలవిడిగా పంచారు. అయితే ఎన్నికల్లో మాత్రం మళ్లీ కొడాలి నానే గెలిచారు. ఈ సారి 2014లో వచ్చిన ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు సాధించారు నాని. అంటే ప్రతీ ఎన్నికలోనూ కొడాలి నానికి గుడివాడ ప్రజల నుండి ఆదరణ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తగ్గించడానికి చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తే నాని మెజారిటీ అంతగా పెరుగుతూ వస్తోంది.
2019 ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు నాయకుడు అసహనంతో జగన్ మోహన్ రెడ్డిపై విద్వేషపు వ్యాఖ్యలు అసంబద్ధ ఆరోపణలు చేసిన ప్రతీ సారి కొడాలి నాని వాటికి కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. అది కూడా చాలా గట్టిగానే ఎన్ కౌంటర్ చేస్తున్నారు. అది చంద్రబాబు కు నచ్చడం లేదు. అందుకే కొడాలిని బూతుల మంత్రి అంటూ బురద జల్లిన చంద్రబాబు గుడివాడలో క్యాసినోలు జరిగిపోతున్నాయని వాటికి కొడాలి నానే కారకులని ప్రచారం చేశారు. అందులో నిజాలులేవని ఆ తర్వాత తేలిపోయింది. ఇపుడు చంద్రబాబు టార్గెట్ మళ్లీ అదే. 2024 ఎన్నికల్లో కొడాలి నాని గెలవడానికి వీల్లేదు.
అందుకోసం ఇప్పటినుంచే గుడివాడపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు చంద్రబాబు. రాజకీయంగా చంద్రబాబు ఎవరిమీద అయినా కక్షగడితే వారిని ఓడించి తీరేవారు. గతంలో రాజకీయ కురువృద్ధుడు ఎన్జీ రంగాను ఓడించిన చంద్రబాబు కాంగ్రెస్ హయాంలో అసెంబ్లీలో తనను ఇబ్బంది పెట్టిన కొణిజేటి రోశయ్యను కూడా ఓడించారు. అయితే కొడాలి నానిని మాత్రం ఎంత ప్రయత్నించినా ఓడించలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బాగా డబ్బున్న ఓ ఎన్నారైను రంగంలోకి దింపాలని బాబు డిసైడ్ అయ్యారు. ఆ ఎన్నారై లోకేష్ కు బాగా సన్నిహితుడని పేరు. లోకేష్ కోటాలోనే గుడివాడలో ఎంట్రీ ఇవ్వబోతోన్న ఆ నాయకుడైనా కొడాలికి చెక్ చెబుతారా. ఏమో కాలమే సమాధానం చెప్పాలి.