వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ జనసేనపై వరుస ట్వీట్లు వదులుతూ చెలరేగిపోతున్నారు. తాను పవన్‌కు వీరాభిమానిని చెప్పుకుంటూనే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదే స్థాయిలో టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న వారాహి వాహనాన్ని వరాహంతో పోల్చిన వర్మ, ఇప్పుడు వెన్నుపోటు అంశాన్ని ఎత్తుకున్నారు. పవన్ రైట్ హ్యాండ్ నాదెండ్ల మనోహర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. నాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్, ఎన్టీఆర్ ని నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్టీఆర్‌ని మళ్ళీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లే ఈ సారి పవన్ కళ్యాణ్‌ను నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. రాత్రి కలలో దేవుడు చెప్పాడంటూ వర్మ ట్వీట్ చేసారు. ప్రియమైన జనసైనికులారా దయచేసి మన లీడర్ని వెన్నుపోటు నాదెండ్ల భాస్కరర రావు కొడుకు నాదెండ్ల మనోహర్ కు దూరంగా ఉండమని చెప్పండి అంటూ మరో ట్వీట్ చేశారు. ఇంతకు ముందు పవనిజం బుక్ రాసిన రాజు రవితేజ గురించి ఇలాగె వార్నింగ్ ఇచ్చాను నా మాటే నిజమైంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆర్జీవీ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి
ఇటీవల కాలంలో వర్మ తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిశారు. వైఎస్సార్ మరణం తర్వాత నుంచి 2019లో జగన్ సీఎం కావటం వరకు జరిగిన పరిణామాలను వ్యూహం పేరుతో సినిమా తీసేందుకు ఆర్జీవీ సిద్దమయ్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని గతంలోనే వెల్లించారు. అప్పట్నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు – జనసేనాని పవన్ లక్ష్యంగా ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు పవన్ భేటీ సందర్భంగా ఓ కులాన్ని కించపరుస్తూ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. వర్మపై కాపు సామాజికవర్గం భగ్గుమంది. జనసైనికులు కూడా అంతే స్థాయిలో వర్మకు కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు కూడా ఆర్జీవీ కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపైనా స్పందించారు. హిట్లర్ ముస్సోలిని తర్వాత చంద్రబాబేనని ఆయనకు పేదవాళ్ల ప్రాణాలంటే గడ్డిపోచతో సమానమని మండిపడ్డారు.
కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన వర్మ నాస్తికుడినని చెప్పుకుంటారు. దేవుడ్ని నమ్మని రామ్ గోపాల్ వర్మకు రాత్రి కలలో దేవుడు ఎలా కనిపించాడోనంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. పేటీఎం దేవుడు చెప్పాడా అని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. ఆ దేవుడిని మా కలలోకి కూడా రమ్మని చెప్పండి సార్ అంటూ ఇంకొకరు రిక్వెస్ట్ చేశారు. చాలామంది ఎప్పటిలాగే వర్మను శాపనార్థాలు పెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద షార్ట్ ఫిల్మ్ లాంటిది తీసి ఓటీటీలో విడుదల చేశారు. వర్మను ఎన్నికల సమయంలో వైసీపీ ఓ పావుగా ఉపయోగించుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆ రెండు పార్టీలు లక్ష్యంగా వర్మ చేస్తున్న ట్వీట్లపై అటు టీడీపీ ఇటు జనసైనికులు మండిపడుతున్నారు. వర్మ జగన్ కోసం పనిచేస్తూ టీడీపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఎప్పుడూ తనవైపు అటెన్షన్ ఉండాలని చూసుకుంటాడు వర్మ. నాదెండ్ల మనోహర్‌ను నమ్మొద్దంటూ వర్మ చేసిన ట్వీట్ కలకలమే రేపుతోంది. మరి దీనిపై మనోహర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.