స్వపక్షంలో విపక్ష నేత. సొంత శిబిరంలో శత్రుదేశపు ఏజంట్. నిత్య అసమ్మతి వాది.సొంత పార్టీ అధినేతకు కంట్లో నలుసు చెవిలో జోరీగ చెప్పులో రాయి. ఇవన్నీ కూడా ఒకే ఒక్క నేత గురించిన లక్షణాలు. ఏపీలో పాలక పక్షానికి మూడేళ్లుగా పెద్ద తలనొప్పి తెస్తోన్న ఒకే ఒక్క నేత రఘురామ కృష్ణం రాజు. వచ్చే ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు ఎటు చూస్తారన్నది ఇపుడు ఆయన వర్గంలో ఆసక్తిగా మారింది.
ఆంధ్రా యూనివర్శిటీ లో ఎం ఫార్మసీ చదివిన పశ్చిమగోదావరి జిల్లా రాజు రఘురామ కృష్ణంరాజు పేరుకు నరసాపురం ఎంపీయే కానీ ఆయన ఉండేది మాత్రం ఢిల్లీలో. ఓటేసి గెలిపించిన నియోజక వర్గ ప్రజలకు ఏ నాడూ అందుబాటులో ఉండని రఘురామ కృష్ణం రాజు ఢిల్లీ నుండే కొన్ని టీవీ ఛానెళ్లతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉంటారు. 2014 ఎన్నికలకు ముందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి లభిస్తోన్న ఆదరణ చూసి ఆ పార్టీలో చేరారు రఘురామ కృష్ణంరాజు.
అయితే ఎన్నికల్లో ఆయనకు ఎక్కడి నుండీ కూడా టికెట్ దక్కకపోవడంతో పార్టీ నాయకత్వాన్ని తిట్టిపోసి బిజెపిలో చేరిపోయారు. నాలుగేళ్ల తర్వాత 2018లో రఘురామ కృష్ణం రాజు బిజెపికి గుడ్ బై చెప్పి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏడాది పాటు అక్కడ కాలక్షేపం చేశాక 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని చూసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి వెంకట శివరామరాజుపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనే జనసేన తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యాక రఘురామ కృష్ణంరాజు తన వ్యాపారాలను మరింతగా విస్తరించాలనుకున్నారు. తనకు ఉన్న పవర్ ప్రాజెక్టుల నుండి విద్యుత్ కొనుగోలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరినట్లు సమాచారం. అయితే రఘురామ ఆఫర్ చేసే యూనిట్ రేటు చాలా ఎక్కువగా ఉండడంతో అది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమని భావించిన జగన్ మోహన్ రెడ్డి ఆ డిమాండ్ కు నో చెప్పారట. అది సహజంగానే రఘురామ ఈగోని దెబ్బతీసింది. వ్యాపారాల కోసం ఇష్టారాజ్యంగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రఘురామ కృష్ణంరాజు చాలా బకాయిలను ఎగ్గొట్టారని ఫిర్యాదులు అందాయి. వాటిపై దర్యాప్తులూ జరుగుతున్నాయి. తనను ఆర్ధిక సంక్షోభం నుండి బయట పడేయాల్సిందిగా ఆయన జగన్ మోహన్ రెడ్డిని కోరినా ఆయన వ్యక్తిగతంగా సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో రఘురామ కక్షగట్టేశారని అంటారు. అప్పట్నుంచే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా ప్రభుత్వ విధానాలపైనా విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఘోరంగా ఓటమి చెందిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి కూడా రఘురామ నచ్చారు. రఘురామను అడ్డుపెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే పని పెట్టుకోవచ్చునని చంద్రబాబు భావించారు.
అప్పటినుండీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే టీవీ ఛానెళ్లలో రఘురామ కృష్ణం రాజు తరచుగా డిబేట్స్ లో పాల్గొంటున్నారు. ఆ డిబేట్స్ లో చంద్రబాబు నాయుడు ఎలాగైతే ప్రభుత్వంపై బురద జల్లుతారో అదే భాషలో అదే కోణంలో రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వంపై విమర్శలుచేస్తూ వచ్చారు. విమర్శలే చేస్తే ఫరవాలేదు. కానీ రఘురామ కృష్ణం రాజు ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం అసభ్యపదజాలంతో తిట్టిపోయడం రొటీన్ అయిపోయాయి. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా కుల మతాల మధ్య చిచ్చు రేపేలా రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతున్నారన్న అభియోగంపై ఆయనపై కేసు కూడా పెట్టారు. ఈ కేసు దర్యాప్తు లోనే రఘురామ కృష్ణం రాజు తనను పోలీసులు కొట్టేశారంటూ యాగీ చేశారు. ఇప్పటికీ రఘురామకృష్ణం రాజు ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్నీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు కొమ్ముకాసేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తనకు కావల్సిన పనులు చేయలేదన్న అక్కసుతోనే రఘురామ కృష్ణం రాజు మూడున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రిపైనా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే జరుగుతోందని ఏపీ పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. టిడిపి అనుకూల మీడియా ప్రతినిథులతో రఘురామ, నారా లోకేష్ లు వాట్పాప్ లో చేసిన చాటింగ్స్ వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ సందర్భంలోనే రఘురామ ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. అయితే కొంత కాలం తర్వాత మళ్లీ యథాతథంగా రఘురామ ద్వేష భాషతో కంటిన్యూ అయిపోతున్నారు. ఇక ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు ఏ పార్టీ తరపున బరిలో దిగుతారోనని ప్రశ్నలు వినపడుతున్నాయి.
టిడిపి, జనసేన పార్టీల్లో ఏదో ఒక దాని తరపున రఘురామ కృష్ణం రాజు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టిడిపి-జనసేనల మధ్య పొత్తు ఖాయమని ఆ రెండు పార్టీలూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నరసాపురం నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయిస్తారా లేక టిడిపియే అట్టేపెట్టుకుంటుందా అన్నది చూడాలి. ఒక వేళ టిడిపి ఉంచుకుంటే టిడిపి అభ్యర్ధిగా రఘురామకు చంద్రబాబు టికెట్ ఇస్తారా అంటే చెప్పలేం అంటున్నారు బాబు గురించి బాగా తెలిసిన వాళ్లు. ఆ ఎన్నికల్లో రఘురామ తనంతట తాను గెలవగలిగే సీన్ ఏమైనా ఉంటేనే చంద్రబాబు టికెట్ ఇస్తారు తప్ప ఓడిపోయే పరిస్థితి ఉందని తన సర్వేలో తేలితే మాత్రం బాబుక మొహమాటాలేవీ ఉండవు. నో టికెట్ అంటారు. సో రఘురామ కృష్ణం రాజు భవిష్యత్ ఏంటనేది అప్పుడే తేలుతుందంటున్నారు రాజకీయ పండితులు.