నాదెండ్ల మనోహర్ చంద్రబాబు గూఢచారా?

By KTV Telugu On 30 January, 2023
image

నాదెండ్ల మనోహన్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చిట్ట చివరి స్పీకర్. రాజకీయ పరిణతి కూడా ఉంది అని అందరూ అనుకునేలా వ్యవహరించిన వారు నాదెండ్ల. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి జనం సమాధి కట్టేశాక చాలా మంది కాంగ్రెస్ నేతల బాటలోనే నాదెండ్ల మనోహర్ కూడా సైలెంట్ అయిపోవలసి వచ్చింది.
అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో తేలారు. నిజానికి చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతల బాటలో ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరతారని అనుకున్నారు. లేదా టిడిపిలో చేరే అవకాశాలు కూడా ఉండేవి. కానీ చిత్రంగా రెండు ప్రధాన పార్టీలను కాదని నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారు. అదేదో కాలక్షేపం కోసం అని కూడా చాలా మంది అనుకున్నారు కానీ. ఆయన ఏళ్ల తరబడి అందులో సెటిల్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉంటారు కాబట్టి పార్టీలో నంబర్ టూ అయినా హోల్ అండ్ సోల్ అయినా నాదెండ్ల మనోహరే.

పార్టీలోకి ఎవరన్నా చేరడానికి వచ్చినా జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఎవరైనా భేటీ కావాలన్నా కూడా ముందుగా నాదెండ్ల మనోహర్ అనుమతి ఉండాల్సిందే. వారు పవన్ ను కలవడానికి అర్హులా కారా అన్నది మనోహరే నిర్ధారించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈక్రమంలోనే ఆయనపై ఓ విమర్శ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ను ఎవ్వరూ కలవకుండా నాదెండ్లే అడ్డుపడుతున్నారని ఆయనపై చాలా మందికి కోపాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినా రాష్ట్రంలో ఎక్కడైనా సభ పెట్టినా పవన్ తో పాటు పక్కనే నాదెండ్ల ఉండి తీరాల్సిందే. అంతగా అనుబంధాన్ని పెంచుకున్నారు నాదెండ్ల-పవన్ ఇద్దరూ కూడా. అయితే నాదెండ్ల వ్యవహారాలను నిశితంగా గమనించే వారు మాత్రం ఆయన చంద్రబాబు నాయుడి తరపునే జనసేనలోకి వచ్చి చేరారని అంటారు. జనసేనాని ఆలోచనలను నిర్ణయాలను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరవేయడమే నాదెండ్ల మనోహర్ పని అని అంటారు.

ఒక వేళ పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుందామని అనుకున్నా ఏ రాజకీయ పార్టీ నేతలతోనైనా భేటీ అవ్వాలని అనుకున్నా చాలా ముందుగానే చంద్రబాబుకు ఆ విషయం చేరిపోతుందంటారు. అంతెందుకు బిజెపి పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజెపి అగ్రనేతలను కలిసినపుడు ఆయనతో పాటే మనోహర్ ఉండేవారు. అక్కడ పవన్ తో బిజెపి నేతలు ఏం మాట్లాడారో కూడా నాదెండ్ల ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సమాచారం అందిస్తూ ఉంటారని అంటారు.2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు అనుకుంటూ ఉంటే బిజెపి మాత్రం చంద్రబాబుతో పొత్తు వద్దే వద్దు అంటోంది. అటు పవన్ కళ్యాణ్ కూడా టిడిపిని కలుపుకుపోదామని బిజెపి నేతలకు చెబుతూనే వస్తున్నారు. అయితే కమలనాథులు మాత్రం లోపల ఏముందో కానీ ప్రస్తుతానికి చంద్రబాబుకి దూరంగానే ఉండాలని అనుకుంటున్నారు. అదే విషయాన్ని పవన్ కూ చెప్పారు.

అయితే బిజెపి నిర్ణయం పవన్ కు చేదు కషాయంలా అనిపించి ఉండచ్చు. ఎందుకంటే ఆయన టిడిపితోనే కలిసి పోవాలనుకుంటున్నారు. అందులో నాదెండ్ల ప్రమేయం కూడా ఉందంటారు. టిడిపితో కలిసి వెళ్తేనే జనసేనకు నాలుగు సీట్లు దక్కుతాయని నాదెండ్ల పదే పదే పవన్ కు నూరిపోస్తున్నారట. ఒక వేళ బిజెపి ఒప్పుకోకపోయినా బిజెపిని దూరం పెట్టి అయినా సరే టిడిపితోనే పోదాం అని పవన్ ను ఇంచుమించు ఒప్పించారట మనోహర్. పవన్ కళ్యాణ్ పక్క చూపులు చూడకుండా జాగ్రత్త పడ్డం. పక్కచూపులు చూస్తోన్నా ఎవరైనా పవన్ వైపు చూస్తోన్నా చంద్రబాబుకు చెప్పడమే మనోహర్ పని. ఆ బాధ్యతను మనోహర్ అత్యంత సమర్ధవంతంగా తెలివిగా చక్కబెడుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే నాదెండ్ల మనోహర్ అనే నేత చంద్రబాబు కోవర్టుగానే జనసేనలో ఉన్నారన్న విషయం పవన్ కళ్యాణ్ కు తెలిసి ఉండకపోవచ్చునంటున్నారు. వేరే వాళ్లు పవన్ ను అలెర్ట్ చేయకుండా ఉండేందుకే నాదెండ్ల ఎవరినీ పవన్ ను కలవకుండా అడ్డుపడుతూ ఉంటారని అంటున్నారు.

నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు టిడిపి ఆవిర్భావ సమయంలో ఓ వెలుగు వెలిగారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ కు కుడిభుజంలా వ్యవహరించడమే కాదు ఎన్టీయార్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఉంటూ నెంబర్ టూ గా మెరిశారు. ఆ క్రమంలోనే భాస్కరరావును ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు ట్రాప్ చేసి ఎన్టీయార్ కు మొదటి వెన్నుపోటుకు ముహూర్తం పెట్టారు. అలా ఎన్టీయార్ ను గద్దె దింపడంలో కీలక పాత్రపోషించిన నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. నెల రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు. ప్రజాఉద్యమ సెగతో తిరగి ఎన్టీయార్ ముఖ్యమంత్రి కావడంతో నాదెండ్ల భాస్కరరావు రాజకీయ కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన తనయుడైన నాదెండ్ల మనోహర్ ఆ తర్వాత కాంగ్రెస్ లో సత్తా చాటి స్పీకర్ స్థాయికి ఎదిగారు. రాష్ట్ర విభజన లేకుండా ఉంటే ఆయన కాంగ్రెస్ లో ఇంకెన్ని పదవులు అనుభవించేవారో తెలీదు కానీ విభజనతో జాతకం తల్లకిందులైపోయింది. 2014 నుండి ఇప్పటి వరకు ఆయన ఏ చట్టసభలోనూ సభ్యుడు కాలేకపోయారు. 2024లో అయినా ఆ లోటు తీర్చుకుంటారో లేదో చూడాలి మరి.