అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రూటే వేరు. పదవిలో ఉన్నప్పుడు ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
లైంగికవేధింపుల ఆరోపణలు తింగరి మాటలు తిక్క చేష్టలతో నాలుగేళ్లు నానా హంగామా చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేయడానికి ఆయన రెడీ అయ్యారు. నేను కూడా రేసులో ఉన్నానని రెండు నెలల క్రితమే ప్రకటించారు. చెప్పినట్లుగానే అందరికంటే ముందు ప్రచారం మొదలు పెట్టారు. ముందస్తుగా ఓటింగ్ జరిగే న్యూ హాంప్ షైర్, సౌత్ కరోలినాలో ప్రచారం స్టార్ట్ చేశారు. మరోమారు అధ్యక్షుడిగా సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అక్కడి ప్రజలకు వివరించారు. గతంలో ఎప్పుడూ జరగని రీతిలో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన రాన్ డెసాంటిస్, మైక్ పెన్స్, నిక్కీ హేలీ కూడా అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు.
ప్రైమరీ ఎలక్షన్స్ లో వారందరినీ వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచేందుకు ట్రంప్ అందరికంటే ముందుగా వ్యూహాత్మకంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. అందరమూ కలిసి అమెరికాను నంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అమెరికాను గ్రేట్ గా తీర్చిదిద్దడానికి తనతో చేయి కలపాలని విజ్ఞప్తి చేశారు. జో బైడెన్ అమలు చేస్తున్న విధానాలకు పూర్తి వ్యతిరేకంగా పాలసీలను రూపొందిస్తానని మాటిచ్చారు. వలస విధానానికి సంబంధించిన ప్రణాళికలతో పాటు నేరాల నివారణకు ప్రత్యేక పాలసీను రూపొందిస్తానని వెల్లడించారు. ప్రైమరీ ఎలక్షన్స్ లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారు.