తమిళనాడు డ్రామాను మించిపోయేలా ఉంది తెలంగాణ ఎపిసోడ్. గణతంత్ర వేడుకల తర్వాత గవర్నర్ కేసీఆర్‌ని టార్గెట్ చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో రాజ్‌భవన్‌లోనే పరేడ్‌తో రిపబ్లిక్ డే ఉత్సవాలు జరగటంతో గవర్నమెంట్‌తో గవర్నర్‌కు దూరం మరింత పెరిగింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై రాజ్యాంగ మీమాంస నడుస్తోంది. ఈ సమావేశాలకు గవర్నర్‌కు ఆహ్వానం లేదు. దీంతో తమిళిసై కూడా తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. రిపబ్లిక్ డే ఇష్యూమీద ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదుచేసిన గవర్నర్ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు.
ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించుకుంది. అనుమతి కోరుతూ జనవరి 21నే గవర్నర్‌కు లేఖ పంపింది. అయితే అసెంబ్లీలో తన ప్రసంగం లేకపోవటంతో గవర్నర్ తమిళిసై అనుమతి ఇవ్వలేదు. పోయిన ఏడాది కూడా ఇలాగే జరగటంతో ఈసారి కచ్చితంగానే వ్యవహరించాలనుకుంటున్నారు గవర్నర్. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ చేసే ప్రసంగం కాపీని పంపారా అంటూ రాజ్‌భవన్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం స్పందించలేదు.
గవర్నర్‌పై న్యాయపోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను దించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దశాబ్ధాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నా తెలంగాణలో తాజా సంక్షోభంతో చివరికి ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారనే వాదన న్యాయస్థానంలో నెగ్గితే కేసీఆర్ సర్కారుకు మరోసారి భంగపాటు తప్పదు. ఇష్టమున్నా లేకున్నా తమిళిసైని ఆహ్వానించి ఆమె ప్రసంగానికి అనుమతించాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్‌కి ఇప్పుడింకో ఆప్షన్ లేదు. తెగేదాకా లాగడమొక్కటే మిగిలింది.