మొఘల్‌ గార్డెన్ తరువాతా మొఘలాయి పరాఠా ?

By KTV Telugu On 30 January, 2023
image

రాజులు, చక్రవర్తుల పేర్లతో ఉన్న కట్టడాలు, ఉద్యానవనాల పేర్లు ఒక్కొక్కటిగా మారిపోతున్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని ఉన్న మొఘల్‌ గార్డెన్‌‌ పేరు కూడా మారిపోయింది. ఇక నుంచి దీనిని అమృత ఉద్యాన్‌గా పిలుస్తారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల నేపథ్యంలో మొఘల్‌ గార్డెన్‌ పేరు మారుస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ అధికారులు వెల్లడించారు. అమృత ఉద్యాన్‌ను జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు. మొఘల్ గార్డెన్ పేరుతో ఉన్న బోర్డులను బుల్డోజర్లతో తొలగించి వాటి స్థానంలో అమృత ఉద్యాన్‌ బోర్డులను ఉంచారు. ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉన్న పేర్లు ఈ మధ్య మారిపోయాయి. కొన్ని రోజుల క్రితం దౌలతాబాద్‌ ఫోర్ట్‌ పేరును దేవ్‌గిరి ఫోర్ట్‌, రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్, ఔరంగ్‌జేబ్‌ రోడ్‌ పేరును అబ్దుల్‌ కలామ్‌ రోడ్‌ అని మార్చేశారు. ఇదేక్రమంలో ముంబైలోని మ‌ల‌ద్ ప్రాంతంలో గార్డెన్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొల‌గించాల‌ని మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నిర్ణ‌యించారు. మ‌ల‌ద్‌లోని టిప్పు సుల్తాన్ గార్డెన్‌కు ఆ పేరు తొల‌గించాల‌ని ముంబై స‌బ‌ర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను సంబంధిత మంత్రి మంగ‌ళ్ ప్ర‌భాత్ లోధా ఆదేశించారు.

కర్ణాటక లో కూడా ఇదే తంతు. బెంగళూరు నుండి మైసూరుకు నడిచే టిప్పు ఎక్స్‌ప్రెస్‌ను వాడియా ఎక్స్‌ప్రెస్‌గా మార్చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ చర్యను మాజీ సీఎంలు సిద్ధరామయ్య, కుమారస్వామి తప్పు పట్టారు. అందరికీ సుపరిచితమైన టిప్పు ఎక్స్‌ప్రెస్‌కు పెట్టిన కొత్త పేరును ఎవరూ గుర్తించరని అన్నారు. అదేవిధంగా కొల్లూరులోని మూకాంబికా ఆలయంలో సలామ్‌ ఆరతిని కూడా నిలుపుచేయాలని బిజెపి భావిస్తోంది. ఇకపోతే పశ్చిమ బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే మొఘల్, బ్రిటిషర్ల పేర్లపై ఉన్న ప్రాంతాల పేర్లను మారుస్తామని బీజేపీ నేత సువేందు అధికారి ప్రకటించారు. మొఘల్స్ చక్రవర్తుల పేర్లతో ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి పేర్లు మారుస్తాం. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే బ్రిటిష్, మొఘల్ పేర్లను తొలగిస్తాం అని చెప్పారు. బీజేపీ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది అపరిపక్వ చర్య అని కాంగ్రెస్‌ వ్యాఖ్యానిస్తే పేర్లు మార్చడం వల్ల సమస్యలు పరిష్కారం కావని అన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. మరోవైపు టీఎంసీ కూడా బీజేపీపై వ్యంగాస్త్రాలు సంధించింది. మొఘల్‌ గార్డెన్ పేరు మార్చినట్లే మొఘలాయి పరాఠా పేరును మార్చి స్వర్గలోక్ పరాఠా లేకపోతే ఇంద్రలోక్ పరాఠా అని పెడతారేమో వెచి చేస్తున్నాం అని ట్వీట్‌ చేసింది. ఈ పేర్ల మార్పిడిపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి.