వచ్చే ఎన్నికలు టీడీపీకి చావోరేవోగా మారాయి. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు సైకిల్ కాస్త గట్టిగానే తొక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో లోకేష్ తనను తాను నిరూపించుకోవడంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు యువగళం యాత్ర ఓ చక్కని ప్లాట్‌ఫామ్ అవుతుందని భావిస్తూ జనంలోకి వెళ్లారు. ఆ యాత్రను లోకేష్ ఎంతవరకు సక్సెస్ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా లోకేష్ ఇప్పటివరకు తానేంటో నిరూపించుకోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎమ్మెల్సీ అయి మంత్రిగా చేసినా ప్రజల ద్వారా ఇంతవరకు ఎన్నిక కాలేదు. పోటీ చేసిన తొలి ఎన్నికలోనే పరాజయం చవిచూశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తన కొడుకును గెలిపించుకోలేకపోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. దాంతో లోకేష్ భాషపై పట్టు సాధించేలా బాడీ లాంగ్వేజ్ మార్చుకునేలా బాబు ఫుల్ ట్రైనింగ్ ఇప్పించారు. గతంతో పోలిస్తే నారా లోకేష్ చాలా స్లిమ్ అయ్యారు. ఈ లుక్ చూసి తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు విపరీతంగా ఆనందించారు. లోకేష్ మారాడని ఇక తిరుగులేదనేంత స్థాయిలో హడావుడి చేశారు. మాటల్లో కూడా రాటుదేలాడని సంతోషించారు. కాబోయే సీఎం లోకేష్ అని తమ్ముళ్లంతా ఫిక్స్ అయిపోయారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీని పవర్లోకి తీసుకురావడంతో పాటు తాను సీఎం అయిపోవాలనే ఆశతో పాదాయత్రగా వెళ్తున్నారు లోకేష్. అయితే అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పూర్తి అవగాహనతో ఉన్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 400రోజుల పాటు 4వేల కి.మీ. నడవాలనుకుంటున్నారు లోకేష్. కానీ లోకేష్ తాను వేసే ప్రతీ అడుగులో తండ్రి చంద్రబాబు అడుగుజాడలే కనిపిస్తున్నాయట. లోకేష్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని బాబు మానిటరింగ్ చేస్తున్నారు. లోకేష్ బాట మాట అంతా చంద్రబాబు, వ్యూహకర్త రాబిన్ శర్మ డైరెక్షన్లోనే సాగుతుందని తెలుస్తోంది. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులెవరు ఇంఛార్జ్‌లుగా పనిచేస్తున్న వారు ఎవరు గ్రామస్థాయిలో టీడీపీకి ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందనే విషయంలో లోకేష్‌కు ఓ అవగాహన లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకెళ్లాలి. తాము అధికారంలోకి వస్తే ఏం చెస్తామో ప్రజలకు వివరించాలి. వారి కష్టాలను పరిష్కరించే మార్గాలను అన్వేషించాలి. ఇదంతా ఆకలింపు చేసుకుంటేనే నాయకుడవుతారు. లోకేష్ తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలంటే మున్ముందు పరిణామాలను కూడా నిశితంగా గమనించాల్సి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితులను చూస్తే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన లోకేష్‌లో అసహనం ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువగా జగన్, వైసీపీ నేతల విమర్శలకే పరిమితమవుతున్నారు. ప్రత్యర్థులనే కాదు లోకేష్ సహా టీడీపీ నేతలంతా పోలీసులను కూడా తిట్టిపోస్తూ అభాసుపాలవుతున్నారు. ఆఖరికి నియోజకవర్గాల్లో పరిస్థితి ఏవిధంగా ఉందో కార్యకర్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా వాటిని పూర్తిగా వినే పరిస్థితిలో లోకేష్ కనిపించడం లేదంటున్నారు. నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటేనే పార్టీకి ప్లస్‌గా మారుతుందని తెలుసుకోలేకపోతున్నారా. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ బల్లగుద్ది చెబుతోంది. అయితే వైసీపీ నేతలే కాదు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా దాదాపు అదే మాట చెబుతున్నారు. కుప్పంలో టీడీపీ పరిస్థితి ఏం బాలేదంటూ ఏకంగా ఓ తమ్ముడు లోకేష్ ముందే మొహమాటం లేకుండా చెప్పేశాడు. కుప్పంలో అంతా బాగుందని కొందరు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని కూడా చెప్పారు. దాంతో లోకేష్ మైక్ అందుకొని గ్రౌండ్ రిపోర్టు బాగోలేదని ఎలా చెప్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సొంత కార్యకర్తతో విసుగుతో వైసీపీ కార్పొరేషన్ చైర్మన్ వనితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వనిత ఇంతవరకు ఏమీ పీకారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను మహిళలను ఇలా అందరినీ తిట్టుకుంటూ పోతూ వారి ఆగ్రహానికి గురవడమే కాకుండా వైసీపీకి అస్త్రంగానూ మారుతున్నారు.
ప్రజల మన్ననలు పొందేందుకు ఎలా నడుచుకోవాలో చెబుతూ పాదయాత్ర తొలిరోజు సీనియర్లంతా బహిరంగ సభా వేదికపై లోకేష్‌కు సలహాలు ఇచ్చారు. అయితే ఆయన దూకుడుగా వెళ్లే క్రమంలో చేస్తున్న వ్యాఖ్యలు ప్రత్యర్థులపై విసిరే పంచులు తిరిగి టీడీపీకే తగులుతున్నాయి. పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి కొన్ని అపశృతి ఘటనలు వైసీపీకి ఆయుధంగా మారితే ఇక ఆయన ప్రసంగాల్లో తడబడుతున్న తీరును ప్రత్యర్థులు కామెడీగా తీసుకొని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. లోకేష్ యాత్రను అధికార వైసీపీ కామెడీ యాత్రగానే చూస్తోంది తప్పితే సీరియస్‌గా తీసుకోవడం లేదు. లోకేష్ యాత్ర సాగినంత కాలం ఫుల్ ఫన్ అంటూ నవ్వుకుంటున్నారు. అందుకు తగ్గట్లే పాదయాత్రలో లోకేష్ ప్రసంగాలను వింటే నాలుక మందం ఇంకా తగ్గలేదని స్పష్టం అవుతోంది. మాట తడబడుతోంది. ఎంతసేపూ రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఆ విమర్శల్లో కూడా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ పోతే లోకేష్ యథారీతిన కామెడీ అవుతారు. దాన్నుంచి బయటపడి యువగళంతో లోకేష్ తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారా. పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా లేక ప్రత్యర్థులకు ఆయుధంగా మారి అభాసుపాలవుతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.