వార్తల్లో నకిలీ వార్తలు వేరయా

By KTV Telugu On 31 January, 2023
image

అన్ని రంగాల్లోనూ నకిలీల బెడద పెరిగిపోతోంది. నిత్యం మనం కొనే ప్రతీ సరుకులోనూ నకిలీలు వచ్చేశాయి. ఏది నిజమో ఏది నకిలీయో చెప్పడం కూడా కష్టమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇపుడు సోషల్ మీడియా పుణ్యమా అని వార్తల్లోనూ నకిలీలు వచ్చి అశాంతి రాజేస్తున్నాయి. కొందరికి వరంగా కొందరికి శాపంగా పరిణమిస్తున్నాయి.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకోవడంలో అగ్రగామి అయిపోయింది బిజెపి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే రాజకీయంగానూ వెనకబడిపోతామని నేతలు కూడా కంగారు పడే స్థాయి వచ్చేసింది. తమ ప్రత్యర్ధి పార్టీల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా ఫేక్ రిపోర్ట్స్ ఫేక్ స్టోరీలు ప్రచారంలో పెట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇదే జరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సరిగ్గా నారాలోకేష్ యువగళం యాత్ర ప్రారంభమైన రోజునే ఇది వైరల్ అయ్యింది. ఆవెంటనే టిడిపి అనుకూల మీడియాలో దీనిపై రచ్చ రచ్చ జరిగింది. కొంచెం ఆలస్యంగా మేలుకున్న ఏపీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఇది ఫేక్ జీవో అని తేల్చి చెప్పింది. ఫేక్ జీవోను క్రియేట్ చేసి వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీనిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా.
నిజానికి అటువంటి జీవో ఏదీ జారీ కానే లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. యువతలో గందరగోళం సృష్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ జీవోను సృష్టించారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే అది ఎవరి పనో తేల్చాల్సింది ఇక ప్రభుత్వమే.

జీవోనే కాదు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు నిర్వహించుకునే వ్యక్తిగత సర్వేలనూ ఫేక్ గాళ్లు వైరల్ చేసేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించిన ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ తాజాగా ఏపీలో ఓ సర్వే చేసిందని దాని నివేదిక గుట్టుగా లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేశారు. ఆ సర్వేలో పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలినట్లు పేర్కొన్నారు. 25 మంది మంత్రుల్లో ముగ్గురు తప్ప అందరూ ఓడిపోతారని కూడా ఆసర్వేలో తేలినట్లు చెప్పుకుపోయారు. ఏతా వాతా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమని ప్రచారం చేస్తున్నారు.
టిడిపి -జనసేనలు పొత్తు పెట్టుకుంటే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని సర్వే తేల్చినట్లు చెబుతున్నారు.
అయితే ఇది వైరల్ అయిన వెను వెంటనే ఐ ప్యాక్ టీమ్ ట్విట్టర్ లో స్పందించింది. తాము ఏపీలో ఎలాంటి సర్వేలూ నిర్వహించనే లేదని తాము చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలు ఫేక్ కథనాలే అని వివరణ ఇచ్చింది.

అయితే అప్పటికే ఐ ప్యాక్ సర్వే రాష్ట్రమంతా ఓ చుట్టు చుట్టేసింది. అందులో వాస్తవం ఎంత అన్నది చదివే వారు చూసే పరిస్థితి ఉండదు. 2019 ఎన్నికల సమయంలోనూ టిడిపి అనుకూల మీడియాలు తాము నిర్వహించిన సర్వేలంటూ కొన్ని ఫలితాలను పోలింగ్ కు ముందు విడుదల చేశాయి. అందులో అన్ని సర్వేలు కూడా ఏపీలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్పాయి. 115కి పైగా సీట్లు టిడిపికి వస్తాయని అంచనా వేశాయి. మాజీ ఎంపీ ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సైతం ఏపీలో మెజారిటీ ప్రజలు చంద్రబాబు నాయుణ్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని టిడిపియే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తమ సర్వే సారాన్ని వైరల్ చేశారు.
ఆ సర్వేలు చెప్పింది విని ఓటర్లు కొంతమైరకైనా ప్రభావితం అవుతారన్నది వారి ఆలోచన. అయితే ప్రజలు ఒక సారి డిసైడ్ అయితే ఎవరు చెప్పినా వినరని ఏపీ ఓటర్లు తేల్చేశారు. 2019 ఎన్నికల్లో టిడిపికి కేవలం 23 స్థానాలు మాత్రమే కట్టెబట్టిన ప్రజలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు ఇచ్చారు.

అయితే ఎన్నికలకు ముందు ఇటువంటి ఫేక్ సర్వేలు హల్ చల్ చేయడం మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఉందంటున్నారు నిపుణులు. ఇదే లగడపాటి రాజగోపాల్ 2018లో తెలంగాణా ఎన్నికల సమయంలోనూ టిడిపి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తీరా ఫలితాలు చూస్తే టి.ఆర్.ఎస్. బంపర్ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. కేసీయార్ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని సర్వే సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలకు కావల్సినట్లుగా సర్వే ఫలితాలను వండి ప్రచారంలో పెడుతూ ఉంటాయి. వాటి వల్ల లాభం ఏంటి అంటే జనం ప్రభావితం కాకపోయినా తమ పార్టీ క్యాడర్ లో నైరాశ్యం ఉండకుండా జాగ్రత్తలు పడేందుకే అనుకూలంగా సర్వేలు చేయించుకుంటారని అంటున్నారు.