గవర్నర్‌తో పోరాటాన్ని వ్యక్తిగతంగా తీసుకున్న కేసీఆర్ అవమానకరంగా పరాజయాన్ని అంగీకరించాల్సి వచ్చింది. గవర్నర్ ఉనినికి గుర్తించకుండా పాలన చేయాలని అనుకున్నారు కానీ ఆ గవర్నర్ ను ఇబ్బంది పెట్టాలనుకోవడంతోనే కేసీఆర్ రాజకీయం తిరగబెట్టడం ప్రారంభమయింది. చివరికి ప్రభుత్వమే సవినయంగా గవర్నర్ ను అసెంబ్లీలో ప్రసంగించాలని ఆహ్వానించాల్సి వచ్చింది. ఇది ఓ రకంగా ఓటమే. కేసీఆర్ ఆలోచన మరిచి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందా. కేసీఆర్ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనంత వెనుకడుగు ఇప్పుడు ఎందుకు వేయాల్సి వచ్చింది. ప్రతీకార రాజకీయాలతో ఏం జరుగుతుందో కేసీఆర్ ఇప్పటికైనా గుర్తిస్తారా.
తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే రాజకీయ చాణక్యుడని పేరు. ఆయన రాజకీయాల్ని రాజకీయంగా చేస్తారు. ఎక్కడ ఆవేశ పడాలో ఎక్కడ సైలెంట్ గా ఉండాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెబుతూంటారు. కానీ తెలంగాణ గవర్నర్ విషయంలో ఆయన ఆవేశంతో చేసిన రాజకీయాల వల్ల ఇప్పుడు పూర్తిగా ఆయన తనదే తప్పని ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వచ్చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇదంతా గవర్నర్ బడ్జెట్ ఆమోదించడం లేదని కోర్టుకు వెళ్లాలన్న ఆలోచన వల్లే జరిగిందంటున్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చిందనేది ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకూ అంతు చిక్కని అంశం. కేసీఆర్ కు రాజ్యాంగం గురించి రాజకీయాల గురించి న్యాయవ్యవస్థ పరిమితుల గురించి స్పష్టంగా తెలుసు. కానీ ఎందుకిలా లంచ్ మోషన్ పిటిషన్ పేరుతో ఆవేశానికి గురయ్యారనేది సీనియర్ నేతలకూ అంతుబట్టని విషయం.
గవర్నర్ తెలంగాణ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్నారు. అందులో డౌట్ లేదు. కానీ పోటీగా తాను గవర్నర్ ను ఇబ్బంది పెట్టాలని సీఎం కేసీఆర్ అనుకోవడంతోనే సమస్య వచ్చినట్లుగా కనిపిస్తోంది. గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. చివరికి ఆమెను ఇబ్బంది పెట్టడానికే అన్నట్లుగా రిపబ్లిక్ డే వేడుకల్ని నిర్వహించలేదు. కానీ ఇక్కడ చూడాల్సింది గవర్నర్ తమిళిసై ను కాదు దేశాన్ని. కానీ కేసీఆర్ అలా కూడా చూడలేకపోయారు. చివరికి బడ్జెట్ ప్రసంగాన్ని కూడా లేకుండా చేశారు. గవర్నర్ పై కోపంతో ఆయన ఆయన ఇలా చేశారు. బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం అవసరం లేకపోతే కేసీఆర్ తాను అనుకున్నట్లుగా చేసేవారు. కానీ ఇంత చేస్తున్న ప్రభుత్వానికి తాను ఏం చేయగలనో నిరూపించాలని గవర్నర్ అనుకున్నారు. ఈ విషయంలో గవర్నర్ కు కూడా కొంత ప్రజల మద్దతు లభిస్తుంది. తమ చర్యల ద్వారా ప్రభుత్వ పెద్దలే అలాంటి పరిస్థితి కల్పించారు.
గవర్నర్ ను విమర్శిస్తే సీఎం సంతోషపడతారని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వారు చేసిన వ్యాఖ్యలు పరిరిస్థితిని మరింత దిగజార్చాయి. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం అత్యంత దారుణంగా ఉంది. గవర్నర్ ను ఆయన కించపరిచిన వైనంపై తక్షణం చర్యలు తీసుకుని ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. చివరికి అన్నీ కలిసి గవర్నర్ కన్నా ప్రభుత్వ వేధింపులే ఎక్కువ హైలెట్ అయ్యే పరిస్థితి వచ్చింది. చివరికి ప్రభుత్వం తప్పు చేసినట్లుగా తొలంచుకుని గవర్నర్ అధికారాల్ని అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు సగౌరవంగా వెళ్లి ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి గవర్నర్ కు ఆహ్వానం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు చేసినట్లుగా ప్రభుత్వం నిలబడింది. దీనికి కేసీఆర్ అధికారంతో వచ్చిన ఆవేశం కారణంగా తీసుకున్న నిర్ణయాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.
గవర్నర్‌పై ఆవేశంగా హైకోర్టుకెళ్లిన తెలంగాణ సర్కార్ చివరికి ఆవేశం కాదు ఆలోచన ఉండాలని తెలుసుకుది. ఇంతకాలం గవర్నర్ విషయంలో చేస్తున్నదంతా తప్పు అని ఒప్పుకోవాల్సి వచ్చినట్లయింది. ప్రభుత్వం ఒక్క సారిగా గవర్నర్ కు సరెండర్ అయినట్లుగా వ్యవహిరంచడంతో బీఆర్ఎస్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇంత దానికి హైకోర్టు దాకా ఎందుకు వెళ్లడం అని ముందే గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెబితే ఇక్కడిదాకా సమస్య వచ్చేది కాదు కదా అన్న నిట్టూర్పు వినిపిస్తోంది. కారణం ఏదైనా గవర్నర్ విషయంలో తామే తప్పు చేసినట్లుగా ప్రభుత్వం బీఆర్ఎస్ అంగీకరించినట్లయింది. ఇప్పుడు ఈ డ్యామేజ్ ను ఎలా కవర్ చేసుకుంటారో.