ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాముడెవరు, రావణాసురుడెవ్వరు

By KTV Telugu On 31 January, 2023
image

రామరాజ్యంలో రావణాసురుడన్న పదం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో సీఎం తీరును పురాణ కథల్లో విలన్ తరహాలో జనం చూస్తున్నారు. మూర్ఖంగా ప్రవర్తించిన రావణాసురుడిలా ఎవరి మాటా వినని దుర్దోధనుడిలా జగన్ మామ తయారయ్యారని పిల్లలు కూడా వాపోతున్నారు. చీపురుతో రోడ్లు ఊడ్చేసినట్లుగా జగన్ పాలనను ఊడ్చేయ్యారని జనం తీర్మానించుకున్నారు.

నిజానికి జగన్ విపక్షాలను పురాణ కథల విలన్లతో పోల్చుతారు. ప్రభుత్వ వ్యతిరేక మీడియాను తిట్టి పోస్తుంటారు. ఈనాడు రామోజీరావును ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఆయన మారీచ, సుబాహుగా చెబుతుంటారు. మారీచ, సుబాహులను రామాయణంలో రాముడు అంతమొంచిన సంగతి గుర్తుకు తెస్తూ తను ఏం చేయబోతున్నానో చెప్పకనే చెబుతారు. రెండో స్టేజీలో దుష్ట చతుష్టయం అన్న పదాన్ని వాడటం మొదలు పెట్టారు. మహా భారతంలో దుర్యోధన, దుశ్సాసన, కర్ణ, శకునిని దుష్ట చతుష్టయం అన్నట్లుగానే చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 నాయుడును ఆయన దుష్ట చతుష్టయంతో పోల్చారు. వారికి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తోడైనట్లు ఆయన చెబుతుంటారు. ఇదంతా జగన్ మాట. జనం అనుకుంటున్న మాట మాత్రం మరోటి ఉంది. అదీ జగన్ ఆలోచనా విధానానికి పూర్తిగా విరుద్ధమైన మాట.

జగన్ ది రాక్షస పాలనగా మారిందని జనంలో ఒక ప్రచారం మొదలైంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి శకుని అని పేరు ఉంది. ఇక ఆయన వెంట ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబులను కలిపి జనం దుష్ట చతుష్టయంగా భావిస్తున్నారు. జగన్ కు మహా చెడ్డ పేరు ఒకటి ఉంది. చరిత్ర అడక్కు చెప్పింది విను అన్న పాత సినిమాలో నూతన్ ప్రసాద్ డైలాగులాగ జగన్ చెప్పింది వినడం మినహా సలహాలు ఇవ్వడం జరగదు. నలభైకి పైగా సలహాదారులున్నప్పటికీ వాళ్లు ఇచ్చే సలహాలేమిటో ఎవ్వరికీ తెలియదు. దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడు అన్నట్లుగా జగన్ పాలనా తీరు ఉంటుంది.

జగన్ అధికారానికి వచ్చిన తర్వాత అ అంటే అప్పులు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రుణాలు పది లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటున్నాయి. పేద అల్పాదాయ వర్గాలు తీవ్ర ఇబ్బందుల్లో పడున్నాయి. ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానానికి చేరుకున్నప్పటికీ వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందడం లేదు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర జీఎస్టీని తగ్గించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. దానితో రవాణా ఛార్జీలు పెరుగుతూ బియ్యం, పప్పులు, చింతపండు, నూనె రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇక విద్యుత్ ఛార్జీల దగ్గర్నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల వరకు అన్నింటినీ పెంచేశారు. మరోసారి ఎప్పుడు పెంచుతారోనన్న భయం జనంలో బాగా పెరిగిపోయింది. రాష్ట్రం నేరాంధ్ర ప్రదేశ్ గా మారింది. ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తూ జేసీబీ పాలనను అమలుకు తెచ్చారు.

ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందడం లేదు. పెన్షనర్ల ఖాతాల్లో డబ్బులు పడక లబోదిబోమంటున్నారు. రోడ్లు వేయకపోవడంతో రవాణా దెబ్బతిన్నది. వర్షాకాలంలో జనం తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. తాగు నీరు, సాగు నీటి సమస్యకు పరిష్కారం వెదికే వారు కరువయ్యారు. ఏపీ జనానికి ఇసుక దొరకడం లేదు. ఏపీ ఇసుకను బయట రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. సిమెంట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దానితో నిర్మాణ వ్యయం పెరిగి సామాన్యుడి సొంతింటి కల నెరవేరడం లేదు. రాష్ట్రం పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి వస్తోంది. దానితో రావణుడి పాలనలో లంక నేలమట్టమైనట్లుగా ఏపీకి దుస్థితి ఏర్పడుతుందని జనం భయపడుతున్నారు. ఈ రావణాసురుడెక్కడి నుంచి వచ్చాడురా బాబూ అని తలపట్టుకు కూర్చుంటున్నారు. పైగా దుర్యోధనుడి పేరాశ కారణంగా కురు వంశం అంతరించిపోయినట్లుగా ఆంధ్రప్రదేశ్ అథోగతి పాలవుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సి వస్తోంది. అదే దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధంగా చెబుతున్నారు. ప్రభుత్వానికి రాక్షసత్వం అబ్బితే ప్రజలు దేవతలుగా మారి పోరు సాగిస్తున్నారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడా సామెతను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. వైసీపీది రాక్షస ప్రభుత్వమని తాము దేవతలుగా మారి జగన్ ను గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నామని టీడీపీ నేతలంటున్నారు.