జగన్‌కు మరో ఎమ్మెల్యే ఝలక్

By KTV Telugu On 31 January, 2023
image

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ను కంగారు పెడుతున్నారు. ఇప్పటికే పార్టీపై ధిక్కారస్వరంతో ఆనంను సైడ్‌ చేసి వెంకటగిరిలో రాంకుమార్‌రెడ్డికి జగన్ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అదే దారిలో ఇప్పుడు మరో ఎమ్మెల్యేపై వేటుకు వేస్తారనే టాక్ నడుస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొంతకాలంపై పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించి మందలించినా కోటంరెడ్డి తగ్గడం లేదు. అధిష్టానంపై తన వాయిస్ మరింత రెయిజ్ చేస్తున్నారు. తాను వారసత్వంగా రాలేదని కష్టపడి పైకి వచ్చానంటోన్న కోటంరెడ్డి ఎవరి ముందు తలవంచనంటున్నారు. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని కూడా కోటంరెడ్డి చెబుతున్నారు. దాంతో ఆయన టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై కోటంరెడ్డి గుర్రుగా ఉన్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బోరున ఏడ్చారు కూడా. పలు సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలు గుప్పించడం స్ధానికంగా తానే స్వయంగా రంగంలోకి దిగి పనులు చేస్తూ కనిపించడంతో తాజాగా ఆయన అసంతృప్తిని గమనించిన జగన్ పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఆయన సంతృప్తి చెందలేదు. మంత్రి పదవి రాకపోగా నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ తన మాట చెల్లుబాటు కావడం లేదని కోటంరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికీ రీజనల్ ఇన్ ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్న ఆవేదనతో రగిలిపోతున్నారు. దీంతో పార్టీలో ఉంటూ అవమానాలు ఎదుర్కోవడం కంటే రాజీనామా చేస్తేనే బెటర్ అన్న అంచనాకు కోటంరెడ్డి వచ్చేసినట్లు తెలుస్తోంది. అనుచరులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం స్థానాలు గెలుచుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు వరుస షాక్‌లిస్తుండడం హైకమాండ్‌కు తలనొప్పిగా మారుతోంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఒకే జిల్లా నుంచి రెండో ఎమ్మెల్యే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే రాజీనామా వరకూ వెళితే కచ్చితంగా పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే కోటంరెడ్డిని సముదాయించేందుకు పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్న కోటంరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.