మార్చి నాటికి విశాఖ నుంచే పరిపాలన. ఢిల్లీలో స్పస్టం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

By KTV Telugu On 31 January, 2023
image

ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో విశాఖ ఏపీ రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. అమరావతి రైతుల పేరుతో రెండు దఫాలుగా పాదయాత్రలు చేసింది. న్యాయస్థానాల్లో పలు కేసులు దాఖలయ్యాయి. ప్రస్తుతం రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉంది. ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతిగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

త్వరలో విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని వైసీపీ ముఖ్య నాయకులు కొంత కాలంగా ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే అమరావతి నుంచి రాజధానిని ఇంచు కూడా కదిలించలేరని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సమావేశంలో జగన్‌ పాల్గొన్నారు. వివిధ దేశాల దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రాముఖ్యతలను వివరించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ అని, రాష్ట్ర జీఎస్డీపీ 11.43 శాతం అని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా తమదే అగ్రస్థానం అని సీఎం వివరించారు. ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి 21 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో వస్తున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 కారిడార్లు ఏపీలోనే నిర్మాణం అవుతున్నాయని…రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయని, మరో 4 పోర్టుల్ని కూడా నిర్మిస్తామని

సీఎం జగన్ వెల్లడించారు. ఇదే సందర్భంలో విశాఖ గురించి ఆయన కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ కు విశాఖ రాజధాని అవుతోందని, తాను కూడా మరి కొన్ని నెలల్లో విశాఖ షిఫ్ట్ అవుతున్నానని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో పెట్టుబడిదారుల సదస్సు జరగబోతోందని, మీ అందరినీ విశాఖలో కలవాలని కోరుకుంటున్నాను అన్నారు సీఎం. జగన్‌ చేసిన ప్రకటనతో అతి త్వరలో ప్రభుత్వ వ్యవహారాలు విశాఖ నుంచి ప్రారంభం కాబోతున్నయనే విషయంపై స్పష్టత వచ్చేసింది. మరో రెండు నెలల్లో అంటే రాజధాని విశాఖకు ఫిష్టవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల, ఇతర అవరాల కోసం అవసరమైన భవనాలు, స్థలాలకు ఇబ్బంది లేదని వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇప్పటికే భీమిలి రోడ్డులో ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు, ఉడా భవనాలను అధికారలు పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ ఒకటి కంటే ముందుగానే విశాఖ కు షిఫ్టయిపోయవాలనే పట్టుదలతో ఉంది జగన్‌ సర్కార్‌. దీన్ని అడ్డుకోడానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయో చూడాలి.