రాహుల్‌గాంధీ నడక ఆగింది. భారత్ జోడో అంటూ రాహుల్‌యాత్ర పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ కన్యాకుమారిలో మొదలైన కాంగ్రెస్ యువరాజు నడక చివరికి మంచుకొండలమధ్య ముగిసింది. భారీ హిమపాతం మధ్యే కశ్మీర్‌లో భావోద్వేగ ప్రసంగంతో పాదయాత్రకు ముగింపు పలికారు రాహుల్‌గాంధీ. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ అసాధారణంగా పుంజుకుంటుందా. మళ్లీ అధికారంలోకి రాగలుగుతుందా అన్నది కానే కాదు. ఈ పాదయాత్ర రాహుల్‌గాంధీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇన్నేళ్లూ తల్లిచాటుబిడ్డగానో వారసత్వాన్నే నమ్ముకున్న నాయకుడిగానో పరిమితమైన రాహుల్‌గాంధీకి ఈ సుదీర్ఘ యాత్ర జీవితానుభవాన్ని నేర్పించింది.
పప్పు పప్పు అంటూ గాంధీల వారసుడిని ఎగతాళి చేసిన బీజేపీ ఇక ఆమాట అనకపోవచ్చేమో. ఎందుకంటే ఈ పాదయాత్రతో పట్టుదల ఉన్న నాయకుడిగా రాహుల్‌గాంధీ కొత్తరూపంలో కనిపించారు. దారిపొడవునా ప్రజలతో మమేకమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే వెంటిలేటర్ మీద ఉందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది. ఆయన యాత్రమీద బురదచల్లేందుకు జరిగిన ప్రయత్నాలను ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు. కశ్మీర్ శ్రీనగర్ లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగరేసి రాహుల్ చేసిన పాదయాత్ర ముగింపుసభ అందరికీ కనెక్ట్ అయింది. యాత్ర అనుభవాలను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు రాహుల్‌గాంధీ.
134 రోజులపాటు 3750 కిలోమీటర్ల యాత్రలో ఆయన స్కూలు పిల్లలనుంచి తలపండిన వృద్ధులదాకా కలుసుకున్నారు. సామాన్యులనుంచి సెలబ్రిటీల దాకా ఆయనతో అడుగులు కదిపారు. మేమే ప్రత్యామ్నాయం అంటూ ప్రకటనలు చేసే జాతీయనేతలెవరూ చేయని సాహసాన్ని రాహుల్‌గాంధీ చేశారు. రాహుల్ పాదయాత్ర కాంగ్రెస్‌ని అధికారంలోకి తెస్తుందనుకోవడం అత్యాశే కావచ్చు. కానీ ఇక బతకదేమో అనుకున్న కాంగ్రెస్‌లో నిస్సందేహంగా కొత్త జీవాన్ని నింపింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీకి గట్టి జవాబే ఇచ్చింది. మరి ఈ ఉత్తేజాన్నికాంగ్రెస్ ఎన్నికలదాకా కాపాడుకుంటుందా అన్నదే ప్రశ్న.