ఒకప్పుడు వామపక్షాలకి మంచి పట్టుకున్న ప్రాంతం. దశాబ్దాలుగా ఎర్రజెండా ఎగిరిన కేంద్రం. పరిస్థితులు మారడంతో కొత్త జెండాలు ఎగురుతున్నాయి. పార్టీ మారినా గెలుపు సాధించిన పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి విజయం సాధిస్తారా.. ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క సీటును టీఆర్ఎస్ నిలబెట్టుకునే పరిస్థితి ఉందా.. ఖమ్మంలో ఖాతా తెరవాలన్న బీజేపీ ఆశ నెరవేరుతుందా… ? కేటీవీ గ్రౌండ్ రిపోర్ట్
తెలంగాణలో టీఆర్ఎస్ కి పట్టులేని జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లానే.2018లో టీఆర్ఎస్ పోటీ చేసి స్థానాల్లో గెలిచిన స్థానం ఒక్కటంటే ఒక్కటే అది ఖమ్మం. కమ్యూనిస్ట్ కుటుంబానికి చెందిన టీఆర్ఎస్ లో చేరి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం గుమ్మంలో హాట్రిక్ విక్టరీ కోసం మళ్లీ సై అంటున్నారు. అయితే 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి నామానాగేశ్వరరావు చెమటలు పట్టించారు. ఊహించని విధంగా స్వల్ప మెజారిటీతోనే పువ్వాడ గెలిచారు. అజయ్ కుమార్కు 70,438 ఓట్లు రాగా తుమ్మల నాగేశ్వరరావుకు
64, 642 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ వ్యవహారశైలి పార్టీకి మరింత చేటు తెస్తోందన్న భావన ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ప్రతీసారి పార్టీలో విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కంటే పార్టీలో వర్గ విభేదాలు కొంపముంచడం ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి.
2014లో కాంగ్రెస్ తరపున 2018లో టీఆర్ఎస్ తరపున గెలిచిన పువ్వాడ మరోసారి ఖమ్మం స్థానం నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ నియోజకవర్గంలో తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి అయిన తర్వాత నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల మధ్యే ఉంటున్నారు. అయితే టీఆర్ఎస్ సీనియర్ నేతలు పువ్వాడను వ్యతిరేకిస్తున్నారు. ఎప్పటో నుంచో పార్టీని నమ్ముకున్న తమకే ఈసారి టిక్కెట్ తనకే ఇవ్వాలని తాతామధు ప్రయత్నిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితోను పువ్వాడకు విభేదాలున్నాయి. పార్టీ హైకమాండ్ పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. సొంత పార్టీలో వెన్నుపోట్ల వల్లే ఖమ్మంలో ఓడిపోయామని ఒక సందర్భంలో కేసీఆర్ కామెంట్ చేశారు. టీఆర్ఎస్ టికెట్ దొరకని పక్షంలో ఆశావహులు ప్రత్యర్ధి పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధి కచ్చితంగా టీఆర్ఎస్ రెబల్ అవుతారనడంలో సందేహం లేదు. ఇక జిల్లాలో బీజేపీకి ఏమాత్రం పట్టులేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద నేతలు లేరు.
విలక్షణతకు.. వైవిధ్యానికి పెట్టింది పేరయిన ఖమ్మం కమ్యూనిస్టుల ముద్రను చెరిపేసుకుంది. ప్రజల ఆలోచనలో కూడా మార్పు కనిపిస్తోంది. ఉద్యమ పార్టీకి ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు ఏనాడు రాలేదు. అటు టీఆర్ఎస్ తో తలపడేందుకు కాంగ్రెస్ సై అంటోంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ పూర్తిగా బలహీనంగా మారడంతో ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుందో చెప్పలేం. పువ్వాడ తీరుపై మాత్రం ప్రజల్లో ఏమంత సానుకూలత లేదని ప్రత్యర్ధి వర్గాలే చెబుతున్నాయి. ఇచ్చినహామీలు నెరవేర్చలేదన్న అసంతృప్తి ఉంది. మంత్రి పేరుతో అనుచరగణం చేస్తున్న దందాలు వ్యతిరేకతను పెంచుతున్నాయి.
ఖమ్మం రాజకీయ సమీకరణాలను అంచనా వేయడం అసాధ్యం. తెలంగాణ వ్యాప్తంగా ఓ లెక్కుంటే అక్కడ మరో లెక్క ఉంటుంది. ఏ పార్టీ అభ్యర్ధి గెలిచినా మెజార్టీ మాత్రం చాలా స్వల్పంగా ఉంటోంది. గత ఎన్నిల ఫలితాలు ఇదే చెబుతున్నాయి. కమ్యూనిస్టులు అంతా చెల్లాచెధురు కావడంతో..ఆ భావజాలం ఉన్న వారు ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికే పరిమితం అవుతున్నారు. ఇప్పటివరకు 4సార్లు సీపీఎం, 4 సార్లు సీపీఐ 3సార్లు కాంగ్రెస్ , రెండుసార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ గెలిచాయి.
రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన వడ్డిరాజు రవిచంద్ర ఖమ్మం స్థానాన్నిఆశించారు.కాని అధిష్టానం పెద్దలసభకి పంపించింది. రెండేళ్ల పదవి కాలం ముగిసిన తర్వాత మళ్లీ ఆయన ఎన్నికల బరిలోకి దిగుతానంటే మాత్రం పువ్వాడకు పోటీ తప్పదు. ఖమ్మంలో మహిళా ఓటర్లు సంఖ్య ఎక్కువ. అభ్యర్ధుల గెలుపోటముల్లో కీలకంగా ఉన్నారు. పోటీ కచ్చితంగా రెండు పార్టీల మధ్యే ఉండటం ఖాయం. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉంటే మాత్రం ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు ఉన్న ఒక్క స్థానం కూడా చేజారిపోతుంది.