పక్కా వ్యూహంతో పవన్ కళ్యాణ్ అడుగులు

By KTV Telugu On 1 February, 2023
image

 

ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఒంటరిగానే బరిలో దిగుతామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు స్పష్టం చేసేసింది. తమకి ఎవరితోనూ పొత్తులు ఉండవని తమ పొత్తు ప్రజలతోనే అని జగన్ మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఓటమి ఖాయమని గత మహానాడులో వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో టిడిపికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు.
టిడిపి ఒంటరిగా పోటీచేసిన విజయం మనదే అని చంద్రబాబు పార్టీలోని సన్నిహితులతోనూ అన్నారని సమాచారం.
అయితే 2019 ఎన్నికల్లో తప్పిస్తే తెలుగుదేశం పార్టీ దాని చరిత్రలోనే ఎన్నడూ ఒంటరిగా పోటీ చేయలేదు. ఎన్టీయార్ టిడిపిని స్థాపించిన మొదటి ఎన్నికల్లోనూ సంజయ్ విచార్ మంచ్ తో సీట్లు పంచుకున్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో 1999, 2004, 2009 ఎన్నికలు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ రెండు సార్లు బిజెపితో పొత్తు పెట్టుకోగా 2009లో టి.ఆర్.ఎస్, కమ్యూనిస్టులతో జట్టు కట్టింది. 2014లో విభజిత ఏపీలో బిజెపి జనసేనలతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు 2019లో ఒంటరిగా పోటీచేసి 23 స్థానాలకు పరిమితం అయ్యారు.
2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని పంతంగా ఉన్న చంద్రబాబు నాయుడు పాలక పక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందుకే బిజెపి-జనసేనలతో కలిసి వెళ్లాలనుకుంటున్నారు. అయితే టిడిపితో పొత్తుకు బిజెపి విముఖత వ్యక్తం చేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీలో టిడిపితోనే పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. అవసరమైతే బిజెపితో తెగతెంపులు చేసుకోడానికి ఊడా ఆయన వెనుకాడరని అంటున్నారు. ఒక విధంగా పవన్ వ్యూహం సరియైనదే.

ఏపీలో ఏ మాత్రం ఓట్లు లేని బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు ఒరిగేదేమీ ఉండదు. అదే టిడిపితో పొత్తు పెట్టుకుంటే కొన్ని నియోజక వర్గాల్లో పాగా వేయచ్చునన్నది పవన్ వ్యూహంగా చెబుతున్నారు. పాతికేళ్ల పాటు రాజకీయాల్లో ఉండడానికే వచ్చానని చెబుతోన్న పవన్ 2024 ఎన్నికలకే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. అవసరమైతే 2029 ఎన్నికల్లోనూ బలమైన రాజకీయ శక్తిగా ఎన్నికల బరిలో నిలబడి ప్రధాన రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించాలన్నది పనవ్ రాజకీయ ఎత్తుగడగా చెప్పచ్చు. ఇది కచ్చితంగా జనసేన కు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే వ్యూహమే అంటున్నారు రాజకీయ పండితులు. అయితే టిడిపితో కలవడం వల్ల జనసేనకు నష్టం చేకూరే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానాన్ని నిశితంగా గమనించిన వారు చంద్రబాబు తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలతో నమ్మకంగా ఎన్నడూ వ్యవహరించలేదని వారు గుర్తు చేస్తున్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీల అభ్యర్ధులు బరిలో ఉన్న స్థానాల్లోనూ టిడిపి రెబల్స్ ను బరిలో దింపి వారికి బీఫారాలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదని వారు గుర్తు చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇటువంటి వైఖరి వల్లనే కమ్యూనిస్టు పార్టీలతో పాటు టి.ఆర్.ఎస్. కూడ దెబ్బతిందని వారు వివరిస్తున్నారు. టిడిపి జనసేన పొత్తు పెట్టుకుంటే వారితో కమ్యూనిస్టు పార్టీలు కూడా చేరచ్చు. కానీ చివరి నిముషంలో టిడిపితో పొత్తుకు బిజెపి ఓకే అంటే మాత్రం బిజెపి-టిడిపి-జనసేనలు పొత్తు పెట్టుకునే అవకాశాలుంటాయి. బిజెపి ఉన్న కూటమిలో కామ్రేడ్లు ఉండలేరు కాబట్టి వారు దూరంగా ఉండాల్సి వస్తుంది. బహుశా అపుడు కామ్రేడ్లు, కాంగ్రెస్ తో కలుస్తారా అన్నది చూడాలి. ఏపీలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయిన నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తుకు కమ్యూనిస్టులు కూడా సిద్ధం కాకపోవచ్చు.

ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న మీమాంస ఈ పార్టీల నాయకత్వాలకే ఉంది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎలాంటి చికాకులూ లేవు. ఎందుకంటే అసలు పొత్తులే వద్దని అనుకుంటున్నారు కాబట్టి మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధులను ఎంపిక చేసుకోవడంపైనే వైసీపీ నాయకత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగితే దాన్ని ఎలా అధిగమించాలన్న అంశంపై ఆలోచనలు చేయాలే తప్ప ఏ పార్టీతో కలవాలి వారికి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న సమస్యలు ఉండవు. ఒక వేళ జనసేన టిడిపితో పోతే అపుడు బిజెపి పరిస్థితి ఏంటి. బిజెపి కూడా ఒంటరిగానే పోటీ చేయాల్సి వస్తుంది. ఏపీలో పొత్తులతో వెళ్తేనే బిజెపికి రెండు శాతం ఓట్లు రావు. ఇక ఒంటరిగా పోటీ చేస్తే నోటా కూడా బిజెపి కన్నా బలంగానే ఉంటుందని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తున్నారు.
కామ్రేడ్లు కాదంటే కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో అభ్యర్ధులను నిలబెడుతుందన్నది ఆసక్తికరమే. ఎందుకంటే అసలు కాంగ్రెస్ కు అభ్యర్ధులు దొరకడం కూడా కష్టమే అంటున్నారు రాజకీయ పండితులు. మొత్తం మీద 2024 ఎన్నికలు ఏపీలో రాజకీయ పార్టీలకు చాలా రకాల ఆప్షన్లను ఇస్తుందని చెప్పక తప్పదు.