వైసీపీ కంచుకోటలో ముసలం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన నెల్లూరు ఎమ్మెల్యేలు

By KTV Telugu On 1 February, 2023
image

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఆంధ్ర ప్రదేశ్ లో పాలక పక్షానికే చెందిన ఇద్దరు నేతలు  ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. వారి ఫోన్లు నిజంగానే ట్యాప్ అయ్యాయా లేక అధిష్ఠానంపై అలిగి అటువంటి ఆరోపణలు చేస్తున్నారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎవరి ఫోన్లూ ట్యాప్ చేయలేదనే అంటోంది.

ఆంధ్ర ప్రదేశ్ లో పాలక  వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇద్దరూ కూడా  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కావడం మరో విశేషం. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి  ఆ పార్టీకి కంచుకోటగా ఉంది నెల్లూరు జిల్లా. 2019 ఎన్నికల్లో అయితే జిల్లా అంతా  వైసీపీనే క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి జిల్లాలో తనకు తిరుగు లేదని  నిరూపించుకుంది.
మొదట్నుంచీ వై.ఎస్.ఆర్. కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వస్తోన్న కోటంరెడ్డి శ్రీధరరెడ్డి  2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందడంతో  కేబినెట్ లో చోటు దక్కలేదు.

మంత్రి పదవి వస్తే బాగుండునని కోటం రెడ్డి చాలా కాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి కేబినెట్ లోనూ  రెండేళ్ల తర్వాత చేసిన విస్తరణలోనూ కూడా కోటం రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు.  ఆ విషయంలో ఆయన కాస్త అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. అయితే దాన్ని ఎప్పుడూ బాహాటంగా వ్యక్తం చేయలేదు. తాజాగా  ఒక్కసారిగా కోటం రెడ్డి పార్టీ నాయకత్వంపై అసమ్మతి వెలిబుచ్చారు. తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని కోటం రెడ్డి ప్రకటించారు. తన అనుచరులతో భేటీ అయ్యి భవిష్యత్ పైనా సమాలోచనలు చేశారు. అవమానించిన చోట ఉండడం కష్టమన్న వ్యాఖ్యా చేశారు. చివరకు వచ్చే ఎన్నికల్లో  తాను టిడిపి నుండి పోటీ చేస్తానని కోటం రెడ్డి అన్న ఆడియో క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అంత వరకు కోటంరెడ్డి అసంతృప్తిపై జిల్లాకే చెందిన మరో నేత కాకాణి మాట్లాడుతూ కోటంరెడ్డి మాకు చాలా కీలక నాయకుడు. ఆయన ఫోను ట్యాప్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయన అసంతృప్తి ఎపిసోడ్ అంతా కూడా టీ కప్పులో తుపానే అని అన్నారు. అయితే ఆ తర్వాత కూడా కోటంరెడ్డి దిగిరాకపోవడంతో కోటంరెడ్డి  పార్టీ వీడేందుకే సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. దీనిపై పార్టీ సీనియర్ నేత బాలినేని మాట్లాడుతూ కోటం రెడ్డి ఫోను ట్యాప్ అవుతోందన్నది అబద్ధమన్నారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయడం లేదని స్పష్టం చేశారు. బహుశా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ ప్రతిష్ఠను కోటంరెడ్డి దెబ్బతీస్తున్నట్లు ఉందని ఆయన ఆరోపించారు. నిజా నిజాలు తెలుసుకోకుండా కోటంరెడ్డి పార్టీ వీడేందుకే సిద్ధపడితే ఆగిపొమ్మని తాము బతిమాలే ప్రసక్తి లేదని బాలినేని అన్నారు. టిడిపిలో చేరిపోవాలని డిసైడ్ అయ్యిన తర్వాతనే కోటంరెడ్డి  ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేశారని బాలినేని అంటున్నారు.

కోటం రెడ్డి వ్యాఖ్యలపై  చర్చ జరుగుతుండగానే జిల్లాకు చెందిన మరో సీనియర్ రాజకీయ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా తన ఫోను ట్యాపింగ్ కు గురవుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో  రెండు ప్రాంతీయ పార్టీలే ఉన్నాయన్న రామనారాయణ రెడ్డి మూడో ప్రత్యామ్నాయం ఉంటే వచ్చే ఎన్నికల్లో సమీకరణలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం వెనుక వ్యక్తిగత రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు జిల్లా వైసీపీ నేతలు. ఆనం రామనారాయణ రెడ్డి చాలా కాలంగా ప్రభుత్వంపై బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. స్వపక్షంలో విపక్ష నేతగా వ్యవహరిస్తూ పాలక పక్షానికి కంట్లో నలుసులా తయారయ్యారు. నిజానికి 2019లో ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని జిల్లా నేతలు అడ్డుపడ్డా జగన్ మోహన్ రెడ్డి సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కలేదు.

ఎన్టీయార్ కేబినెట్ లోనే మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డికి ఆ విషయంలో బాగా అసంతృప్తి ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చివరి కేబినెట్ లోనూ ఆనం మంత్రిగా వ్యవహరించారు. అటువంటిది తనను పక్కన పెట్టి తనకన్నా జూనియర్లకు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని ఆనం లోలోనే కుత కుత లాడుతూనే ఉన్నారు. ఇటీవల ఆయన ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో ఆయన నియోజకవర్గానికి  మాజీ ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్దన రెడ్డి తనయుని ఇన్ ఛార్జ్ గా నియమించింది పార్టీ నాయకత్వం. దాంతో ఇక తనను పూర్తిగా పక్కన పెట్టేస్తారన్న భావనతో ఉన్న ఆనం వచ్చే ఎన్నికల లోపే పార్టీ మారితే బెటరని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పాలక పక్షంపైనా ప్రభుత్వంపైనా విమర్శలు చేశారని భావిస్తున్నారు.

గతంలో టిడిపిలో ఉన్న ఆనం త్వరలో చంద్రబాబు నాయుడి సమక్షంలో టిడిపిలో చేరే అవకాశాలు ఉన్ననాయంటున్నారు. పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్ధం అవుతూ ఉండడం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వానికి కలవరం పెట్టే అంశమే. అయితే ఒకళ్లిద్దరు నేతలు పార్టీ మారినా నాలుగేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదని పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కీలక నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయించిందని అప్పట్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆరోపించింది. దానిపై దర్యాప్తుకు డిమాండ్ చేసింది కూడా. ఇపుడు అదే పార్టీ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే అటువంటి ఆరోపణ చేయడం విశేషం.