రాజకీయాల్లో గెలవాలంటే ఏం చేయాలి ముందుగా గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రజల కోసం పని చేయాలి. కష్టాలు పడిన వారిని ఆదుకోవాలి. ప్రజా సేవ కోసం ఉన్నామని నిరూపించుకోవాలి. అయితే ఇదంతా ఓల్డ్ స్టైల్. ఇప్పుడు రాజకీయాల్లో గెలవాలంటే సింపుల్. సోషల్ మీడియాలో పాపులర్ అయితే చాలు. ఇది కూడా సింపులే. ఓ రెండు టీముల్ని పెట్టుకుని ఫ్యాన్ పేజీల్ని ఏర్పాటు చేసుకుని ఎలివేషన్ వీడియోల్ని షూట్ చేయించుకుని ప్రమోట్ చేసుకుంటే చాలు. రాజకీయాల్లో గుర్తింపు వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటే అంత గొప్ప లీడర్ గా భావించే పరిస్థితి వచ్చేసింది. పార్టీలలోనూ అంతే గుర్తింపు ఇస్తున్నారు. నిజంగా సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరిగితే ఆ నాయకుడికి ఫాలోయింగ్ ఉన్నట్లేనా. ప్రజల్లో పలుకుబడి ఉన్నట్లేనా.
ఓ నాయకుడి ఫేస్ బుక్ పేజీకి పాతిక వేల మంది ఫాలోయర్స్ ఉంటారు. అంటే అతను రోడ్డు మీదకు వెళ్తే లేకపోతే బహిరంగసభ పెడితే వాళ్లందరూ వస్తారని అర్థం కాదు. ఇంకా చెప్పాలంటే అసలు వారు ఓట్లు వేస్తారని కూడా ఊహించలేం. ఎందుకంటే ఆ ఫాలోవర్స్ అంతా ఒకే నియోజకవర్గానికి చెందిన వారు అయి ఉండరు. అసలు నిజమైన ఫాలోయర్సో కాదో కూడా చెప్పడం కష్టం. ఇదే సూత్రం అటు యూ ట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాలకూ వర్తిస్తుంది. కానీ విచిత్రంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకుని అదే తమ క్రేజ్ అని చెప్పుకునే నేతల సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోయింది. ఫలితంగా సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ప్రతీ నేతా ఓ సోషల్ మీడియా టీంను మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఎలివేషన్ షూటింగ్‌లు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకుంటున్నారు.
గతంలో రాజకీయ నేతలు మంచి పనులు చేసేవారు. అయితే ఆ విషయం ఆ నోటా ఈ నోటా పడి కొంత మందికి తెలిసేది. కానీ ఇప్పుడు అంతా స్క్రిప్టెడ్ సాయాలు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం హెచ్ డీ కెమెరాలు ఫుల్ ఫోకస్ వచ్చేలా సాయం చేస్తూ దాన్ని షూట్ చేసుకుని మహానుభావుడయ్యా అని వాళ్లకు వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు సోషల్ మీడియా ప్రచారాల కోసం ప్రతీ రోజూ ఓ గంట సేపు అలా నియోజకవర్గంలో తిరిగి వాళ్లనూ వీళ్లను పలకరిస్తారు. రాజకీయాలకు సంబంధం లేకపోయినా కొంత మందితో విచిత్రంా మాట్లాడించి వాటిని వైరల్ కంటెంట్ గా మార్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో యువ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. ఒక్కో యువ నేత ఈ సోషల్ మీడియా టీముల్ని మెయిన్ టెయిన్ చేయడానికి స్ట్రాటజిస్టులకు కనీసం నెలకు రూ. ఐదు లక్షలు ఖర్చు పెడతారంటే అతిశయోక్తి కాదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువగా ఇదే విధంగా క్రేజ్ తెచ్చుకుంటున్నామని అనుకుంటున్నారు. ఎక్కువ మంది యువ నేతలే ఈ సోషల్ మీడియా వైరల్ కంటెంట్ లో ఉంటున్నారు. పాత కాలం నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
రాజకీయ పార్టీలు ఇప్పటికే సోషల్ మీడియాకు పూర్తి స్థాయిలో వైరస్ ను అంటించేశాయి. ఎవరు ఏది ఎక్కువ నమ్మితే అదే నిజం అని అనుకునేలా నెటిజన్లును మార్చేసి ప్రత్యర్థి పార్టీలపై విష ప్రచారం చేస్తున్నాయి. ఇందు కోసం రాజకీయపార్టీలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయో చెప్పడం కష్టం. కొన్ని వందల మందితో సోషల్ మీడియా సైన్యాలు నడుపుతున్నారు. స్వచ్చందంగా పని చేసే వారు కొంత మంది. కానీ ఉద్యోగులుగా పని చేసేవారు ఎంతో మంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై దాడి చేసినప్పుడు ప్రధానంగా బయటపడింది ఈ సోషల్ మీడియా సైన్యాల పనే. అయితే ఇప్పుడు పార్టీల దగ్గర నుంచి మెల్లగా రాజకీయ పార్టీల నాయకులు తమ కోసం ఈ సోషల్ మీడియా సైన్యాలను నియమించుకుంటున్నారు.
ఇప్పటి వరకూ రాజకీయ పార్టీల నేతలకు వైరల్ వైరస్ ప్రాథమిక స్థాయిలోనే ఉంది. కానీ ఇది ముదిరితే రాజకీయ పార్టీలు తయారు చేసుకున్న సైన్యాల మాదిరిగా తప్పు దారి పట్టడం ఖాయం. ఇమేజ్ బిల్డింగ్ అంటే సోషల్ మీడియాలో ఎలివేషన్లు కాదు అనే సంగతిని యువ నేతలు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్ బిల్డింగ్ అనేది సోషల్ మీడియా ద్వారా రాదు. వ్యక్తిత్వం, రాజకీయాల్లో నడవడకి ద్వారానే వస్తుంది. దీన్ని అన్ని పార్టీల నేతలూ గుర్తించాల్సి ఉంది.