సాధారణంగా ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప‌్రదేశ్‌లో పరిస్థితి తిరగబడినట్లు కనిపిస్తోంది. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం విస్మయం కలిగిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తరచుగా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ ఆయనను పిలిపించుకుని మాట్టాడారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోతే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని రాజకీయంగా నష్టపోతావని స్పష్టం చేశారు. అయినా కోటంరెడ్డి తన పంథా మార్చుకోలేదు. ఉన్నట్లుండి ఆయన బాంబు పేల్చారు. తన ఫోన్ ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారనే విషయం ముందే తెలుసని అందుకే 11 సిమ్‌లు వాడుతున్నానని చెప్పారు. మీ పోలీస్ బాస్‌కు చెప్పండి నా ఫోన్ ట్యాప్ చేసి ఏమీ సాధించలేరు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.
ఎప్పుడు ఏది మాట్లాడాలో ఏం చేయాలో నాకు తెలుసు అవసరమైతే నామీద నిఘాకు ఐపీఎస్ అధికారిని కూడా నియమించుకోండి అని ఇంటలిజెన్స్ అధికారులను ఉద్దేశించి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. మరో సీనియర్ నేత వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. గత ఏడాదిన్నరగా ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాప్ చేస్తోందని మండిపడ్డారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా వాట్సాప్ కాల్స్ చేయాల్సి వస్తోందని చెప్పారు. తమ పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తుంటే తాను ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ను ట్యాప్ చేయించడం వంటి పోకడలు ఎన్నడూ లేవని ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని ఆనం అన్నారు. తనకు ఇప్పటికే భద్రతను తగ్గించారని భద్రతను పూర్తిగా తొలగించాలని కోరుతున్నానని చెప్పారు. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు రోజుల తేడాతో ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది.