బాధ్యతగల పౌరులుగా పన్నులు కట్టాల్సిందే. అయితే దేశంలో ఎంత ఆదాయానికి పన్ను కట్టాలన్నదానిపై ఎప్పుడూ కేంద్రం దోబూచులాడుతూనే ఉంది. క్రమం తప్పకుండా ఇన్‌కంటాక్స్ కట్టే వేతనజీవికి ఎప్పటికప్పుడు అసంతృప్తే మిగులుతోంది. ఈ బడ్జెట్‌లో కూడా ఆదాయపుపన్ను మినహాయింపులపై అంతా ఎన్నో ఆశలు పెట్టుకుంటే అందులోనూ కేంద్రం డబల్‌గేమ్ ఆడింది. పాత కొత్త పన్ను విధానాల మధ్య విభజనరేఖ గీసింది. ఇప్పటిదాకా పాత పన్ను విధానంలో 2020లో ప్రకటించిన కొత్త టాక్స్ పాలసీలో రూ.5లక్షల ఆదాయం దాకా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇప్పుడు మాత్రం కొత్త పన్ను విధానంలోనే కొంత రాయితీ ఇస్తూ పాత విధానాన్ని యథాతథంగా ఉంచేశారు.
ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటోంది కేంద్రం. అంటే అనివార్యంగా అందరినీ కొత్త పన్ను విధానానికి మళ్లాలని చెబుతున్నట్లే. కొత్త పన్ను విధానంలో ఆదాయ పరిమితిని రూ,7లక్షలకు పెంచారు. పాత పన్ను విధానమే మంచిదనుకునేవారు ఇదివరకున్న 5లక్షల ఆదాయ పరిమితితోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీంతో కొందరికే ప్రయోజనమని అంతా పెదవి విరుస్తున్నారు. కొత్త విధానం రూ.15లక్షలకు పైగా ఆదాయం ఉండి ఎలాంటి సేవింగ్స్ లేనివారికే ప్రయోజనకరం కావటంతో అతి కొద్దిమందికే దీనివల్ల లాభం జరుగుతుంది. ఓ పక్క ఆర్థికమాంద్యం ముంచుకొస్తోందన్న భయాలున్నాయి. ఇలాంటి సమయంలో సేవింగ్స్‌ని ప్రోత్సహించాల్సింది పోయి స్పెండింగ్ ఎకానమీకి మద్దతిచ్చేలా ఆదాయపుపన్ను నిర్ణయం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.
2020లో ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇన్‌కంట్యాక్స్ విధానానికి పెద్ద ఆదరణ లభించలేదు. మెజారిటీ టాక్స్ పేయర్స్ పాత విధానంలోనే కొనసాగుతున్నారు. కేవలం కొత్త పన్నువిధానానికి అందరినీ మళ్లించడమే కేంద్రప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకే ఆదాయపన్ను పరిమితిని పెంచుతూనే కేవలం కొత్త పన్ను విధానానికే దాన్ని పరిమితం చేసింది. కొత్త పన్ను విధానంలో శ్లాబులను ఐదుకు కుదించారు. ఈ కొత్త శ్లాబుల ప్రకారం పన్నుభారం తగ్గుతుందంటున్నా అదంత ఆకర్షణీయంగా ఏమీ లేదు. అత్యధిక ఆదాయం ఉన్నవారిపై గరిష్ఠ సర్‌చార్జి రేటును 37 నుంచి 25 శాతానికి తగ్గిస్తున్నట్టు గొప్పగా ప్రకటించారు. ఎన్ని పిల్లిమొగ్గలేసినా నెలకో యాభైవేలో అరవైవేలో సంపాదించేవారికి మాత్రం ఆదాయపన్ను విషయంలో ఎలాంటి భరోసా దొరకలేదు.
గుడ్డిలో మెల్లలా ఊరటనిచ్చే అంశం రిటైర్డ్ ఉద్యోగులకు రాయితీనే. ప్రైవేటు ఉద్యోగుల రిటైర్మెంట్ సమయంలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పరిమితిని మాత్రం రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. 20 ఏళ్లక్రితం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఇప్పుడు సవరించింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు కొత్త పన్ను విధానాన్నే డీఫాల్ట్ ఆప్షన్‌గా పెట్టబోతున్నారు. పన్ను పరిమితి పెంచటంతో పాతపన్ను విధానం నుంచి అంతా కొత్త విధానంవైపు మొగ్గుతారనుకుంటే పొరపాటేనంటున్నారు ఆర్థిక నిపుణులు. ఎందుకంటే పాత పన్ను విధానంలో మినహాయింపులన్నీ వాడుకుంటే రూ.9 లక్షల దాకా ఎలాంటి పన్నూ పడదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరి ఎలాంటి బరువు బాధ్యతలూ లేనివారికి సేవింగ్స్ జోలికి వెళ్లనివారికే కొత్త విధానంతో లాభమంటున్నారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకారం 0-3 లక్షల ఆదాయం దాకా ఎలాంటి పన్నూ ఉండదు. రూ. 3-6 లక్షలదాకా 5% పన్ను, రూ.6-9 లక్షల ఆదాయందాకా 10శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.9-12 లక్షల ఆదాయానికి 15% పన్ను, రూ.12 నుంచి 15 లక్షల ఆదాయానికి 20% పన్ను విధిస్తారు. ఇక ఆదాయం రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30శాతం పన్ను చెల్లించాల్సిందే. దీని ప్రకారం రూ. 7లక్షలు ఆదాయం దాటినప్రతీవారూ3 లక్షల ఆదాయంనుంచి పన్ను చెల్లించాలి. రూ.9 లక్షల ఆదాయం ఉంటే రూ.45వేలు, రూ.15లక్షల ఆదాయానికి లక్షా 5వేల పన్ను చెల్లించాల్సి వస్తుంది.
కేంద్రప్రభుత్వ ఉద్దేశం తెలిసిపోతూనే ఉంది. రానున్న రోజుల్లో ఆదాయపన్ను విషయంలో ఇప్పటిదాకా ఉన్న రాయితీలు కొనసాగుతాయన్న నమ్మకంలేదు. ఎక్కువమందిని పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉంది కేంద్రం. పన్నుభారాన్ని తగ్గించుకునేందుకు పాత విధానంలో ఉన్న రాయితీలను నిరుత్సాహపరిచేందుకే కొత్త విధానంలో పరిమితిని పెంచారని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ విభాగం కింద బీమా, యూలిప్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడులతో లక్షన్నరదాకా పన్ను మినహాయింపు ఉంది. ఈపీఎఫ్, హౌసింగ్ లోన్‌పై అసలు, వడ్డీ, మెడికల్ బిల్లులతో కూడా పన్ను రాయితీలు పొందుతున్నారు. కొత్త విధానంలో వీటన్నిటికీ తిలోదకాలు ఇవ్వాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకే పాతా కొత్త అంటూ పన్ను చెల్లింపుదారులను గందరగోళంలో పడేస్తోంది.