యువతను ఆకర్షించడమే లక్ష్యం.. విద్య, ఉద్యోగరంగాలపై స్పెషల్ ఫోకస్

By KTV Telugu On 2 February, 2023
image

కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం పరితపిస్తోన్న మోడీ సర్కార్ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చివరి బడ్జెట్‌ను రూపొందించింది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా బడ్జెట్‌లో విద్య, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈసారి విద్యార్థుల కోసం అనేక ప్రకటనలు వెలువ‌డ్డాయి. 2023 ఆర్థిక బడ్జెట్‌లో విద్యకు రూ.1,12,899 కోట్లు కేటాయించారు. ఇది 2022-23 బడ్జెట్ అంచనా కంటే రూ.8,621 కోట్లు ఎక్కువ. ఇందులో డిజిటల్ లైబ్రరీ నుంచి ల్యాబ్ మేడ్ డైమండ్‌లకు గ్రాంట్లు ఇచ్చారు. పిల్లలు మరియు కౌమారదశలో ఉన్న విద్యార్థుల‌కు జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పంచాయితీ మరియు వార్డు స్థాయిలలో భౌతిక గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం, మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు నేషనల్ డిజిటల్ లైబ్రరీకి అందుబాటులో ఉండేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి 2023-24 కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనలను విద్యా పరిశ్రమ కూడా ప్రశంసించింది.

ఇక వచ్చే మూడేళ్లలో 748 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులు మరియు సహాయక సిబ్బందిని కూడా కేంద్రం నియమించనుంది. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడంతో పాటుగా సురక్షితమైన గృహవసతి, తాగు నీరు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు కూడా లభిస్తాయి. గిరిజనులు అత్యధికంగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాలకు ఈ పథకం ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. తద్వారా ఆయా వర్గాల ప్రజలను తమ వైపు మళ్లేలా చేసుకోవచ్చన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.

మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త చెప్పారు. మెడికల్ కాలేజీలతో పాటు దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వైద్యరంగంలో కొత్త కోర్సులు తీసుకురావడంతో పాటు తాజా పరిశోధనలపై కూడా దృష్టి సారించనున్నారు. దీంతోపాటు ఉపాధ్యాయుల శిక్షణను కూడా బాగా మెరుగుపరుస్తామన్నారు. ఇది కాకుండా భారతీయ యువతను నైపుణ్యం కలిగిన వారిగా మార్చడానికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0ని ప్రారంభించనున్నారు. నైపుణ్యాలలో కోడింగ్, ఏఐ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, త్రీడీ, ప్రింటింగ్, డ్రోన్స్,లాట్‌ మరియు సాఫ్ట్ స్కిల్స్ మొద‌లైన‌వి ఉన్నాయి. అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించిన మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లను ఏర్పాటు చేస్తారు. ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో 5జీ అప్లికేషన్ల తయారీకి 100 ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తారు. స్టార్టప్ లకు ప్రోత్సాహకాలిచ్చేందుకు ‘డేటా గవర్నెన్స్‌ పాలసీ’ని తీసుకురానున్నారు.