రాజకీయాల్లో దయాదాక్షిణ్యాలు ఉండవు. నీతి నియమాలు అసలు ఉండవు. ప్రజాస్వామ్య విలువలు ఎదుటి వారికి చెప్పడానికి మాత్రమే ఉంటాయి. ఇవి లక్షణాలు కావొచ్చు.. అవలక్షణాలు కావొచ్చు భారతీయ జనతా పార్టీ పక్కాగా పుణికి పుచ్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి ప్రారంభించిన మధ్యప్రదేశ్, కర్ణాటక మీదుగా మహారాష్ట్రకు బీజేపీ పయనించిన విధానమే దీనికి సాక్ష్యం. నెక్ట్స్ బీజేపీ టార్గెట్ ఏంటి ? రాజస్థానా ? కానే కాదు.. తెలంగాణ. దానికి సంబంధించి స్పష్టమైన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడే నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే బీజేపీ వ్యూహం. ఇందుకోసం బీజేపీ ఏం చేయబోతోంది..? ఎలాంటి వ్యూహాలు పన్నబోతోంది ? బీజేపీ ధాటికి టీఆర్ఎస్ తట్టుకుంటుందా ? అసలు బీజేపీ ఏం చేయాలనుకుంటోంది ?
ముందుగా చెప్పుకున్నట్లుగా ఓ టార్గెట్ పెట్టుకుంటే బీజేపీకి దయాదాక్షిణ్యాలు ఉండవు. అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తుంది. రాజకీయ ప్రత్యర్థి పొలిటికల్ ఫ్యూచర్‌ని ఫినిష్ చేస్తుంది. ఇందు కోసం బీజేపీ వాడే మొట్ట మొదటి ఆయుధం ఫిరాయింపులు. ఒకప్పుడు భారతీయ జనతాపార్టీ భావజాలం ఉన్నవారు మాత్రమే ఆ పార్టీలో ఉండేవారు. ఆ పార్టీ నుంచి బయటకు పోయేవారు ఉండరు. వచ్చే వారు కూడా దాదాపుగా ఉండరు. ఎందుకంటే భావజాలం లేని వారిని ఆహ్వానించాలని వారితో పార్టీని బలపర్చుకోవాలని అప్పట్లో బీజేపీ పెద్దలు కనీసం ఆలోచన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఉంది మోదీ, షాల బీజేపీ. వారి వ్యూహాలు వేరు. భావజాలం రాజకీయం బలం అని నమ్ముతారు. ఎవరు వస్తే పార్టీ బలోపేతం అవుతుందో వారిని ఆకర్షిస్తారు. ఇతర రాష్ట్రాల్లో జరిగింది అదే. త్వరలో తెలంగాణలోనూ అదే జరగబోతోందన్న చర్చ ప్రారంభమయింది.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు రాజకీయంగా పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో సందేహం లేదు. టీఆర్ఎస్లో ఆశావహులు పెరిగిపోయారు. సిట్టింగ్‌లపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. రెండు టర్మ్‌లు వారికి ఎమ్మెల్యేలుగా ప్రజలు గెలిపించారు. వారి వ్యవహారాలతో ప్రజల్లో వ్యతిరేకత సహజం. అందుకే ఈ సారి యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వడం లేదని టీఆర్ఎస్ పెద్దలు హింట్ ఇస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో గెలుస్తారు అని తెలిస్తేనే టిక్కెట్ ఇస్తారు. లేకపోతే లేదు. ఇప్పటికే చాలా మంంది ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్ ఏమిటో తేలిపోయింది. అందుకే వారు పక్క చూపులు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీకి ఇలాంటి అసంతృప్తులను పట్టుకోవడంలో సాటిలేని నైపుణ్యం ఉంది. ఆ పార్టీ ఇప్పటికే చాప కింద నీరులా వర్కవుట్ చేయకుండా ఉంటుందా..? చేసే ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. బీజేపీ వర్గాలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతూ వస్తున్నాయి. చాలా మంది అంటే ఎంత మంది అనేది వాళ్లకీ తెలియదు కానీ… ఎంత మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది.. ఎంత మంది బీజేపీ ఆకర్ష్‌కు పడిపోతారో అంత మంది అని చెప్పుకోవచ్చు. వారు కనీసం యాభై మంది ఉంటారని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేసేస్తున్నాయి.
బీజేపీ చేసేదంతా బయట పడేవరకూ ఎవరికీ తెలియదు. ఎలా ఉంటుందంటే…ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యేలు అందర్న ముంబైలోనే ప్రత్యేక విమానం ఎక్కించి గుజరాత్ తీసుకెళ్లారు. అక్కడ హోంమంత్రి కానీ.. ఇంటలిజెన్స్‌కు కానీ కనీస సమాచారం లేదు. అధికారంలో ఉన్నా కనీసం వాసన కూడా పట్టలేకపోయారు. అలాంటి రాజకీయం చేయడంలో బీజేపీ దిట్ట. తెలంగాణలోనూ అంతే బయటపడే దాకా ఎలా ప్లాన్ చేస్తున్నారో చెప్పడం కష్టం. కానీ బీజేపీ సైలెంట్‌గా ఉంటుందని అనుకోవడం మాత్రం లేదు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ సాధించేది ఏమీ లేదు. బీజేపీ ఎన్నికల టార్గెట్‌గా రాజకీయాలు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగాల్ తరహా వ్యుుహం అమలు చేయవచ్చు. అక్కడ టీఎంసీ నేతల్ని ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించి.. చివరికి టీఎంసీలో అగ్రనేతలంతా బీజేపీలోనే ఉన్నారనిపించారు. కానీ మమతా ఎదురునిలబడగలిగారు. ఎన్నికల ఏడాది మొత్తం తృణమూల్ టెన్షన్‌కు గురవుూనే ఉంది. ఇక్కడ కూడా ఎన్నికలు ఏడాది ఉంటాయనగా బీజేపీ వర్గాలు రంగంలోకి అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఆ ప్రకారం చూస్తే.. ఎన్నికల ఏడాదిలోకి వచ్చేసినట్లే. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ వ్యూహం అమలు చేస్తుందని అనుకోవచ్చు.
అయితే బీజేపీలోకి ఇతర పార్టీల నేతలు ఆషామాషీగా చేరిపోరు. సొంత పార్టీపై అసంతృప్తి ఉన్నంత మాత్రాన పోలోమని వెళ్లిపోరు. వారిలో వెళ్లకపోతే ఏదో జరుగుతుందని భయం పుట్టించాలి. అది బీజేపీ చేతిలో పని. సీబీఐని రాకుండా జనరల్ కన్సెంట్ ను రద్దు చేసినంత మాత్రాన్ ఆగిపోయే పరిస్థితి లేదు. ఈడీ ఉంది. ఐటీ ఉంది. ఈడీ నోటీసులు ఎంత అవసరం మేరకు నేతలకు వస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. అలాంటివి తెలంగాణలోనూ ఊపందుకుంటాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ను బలహీనపర్చే రాజకీయం ప్రారంభం కావొచ్చు.
మొత్తంగా బీజేపీకి తెలంగాణ విషయంలో తమదైన ట్రేడ్ మార్క్ వ్యూహం ఉంది. ఏమీ చేయకుండా ఎన్నికలకు వెళ్తారని అనకోలేం. అది మోదీ,షాల నైజం కాదు. ముందుగా చెప్పుకున్నట్లు.. దయాదాక్షిణ్యాలు.. నీతి నిజాయితీ .. ప్రజాస్వామ్య విలువలు అన్నీ బీజేపీ ఏ రాజకీయాలు చేస్తే వాటిలోనే ఉంటాయి. ఆ ప్రకారమే రాజకీయాలు చేస్తూ…అయితే ఇక్కడ వారి రాజకీయాలను టీఆర్ఎస్ పెద్దలు ఎలా ఢీ కొడతారన్నది కీలకం. మమతా బెనర్జీలా ధైర్యంగా నిలబడితే విజయమో వీర స్వర్గమో వస్తుంది..లేకపోతే మొదటికే మోసం వస్తుంది.