రాహుల్ గాంధీతో కమల్ రహస్య డీల్ కుదుర్చుకున్నారా?

By KTV Telugu On 2 February, 2023
image

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా మెగాస్టార్ చిరంజీవి బాటలో నడుస్తారా.. ఎన్నో అంచనాలతో రాజకీయాల్లో వచ్చిన కమల్ హాసన్ దుకాణం సద్దేస్తున్నారా. తన పార్టీని పట్టుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేస్తారా. కమల్ ఆలోచనలు ఏంటి. తమిళనాడులో ఏం జరగబోతోంది.

తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేసిన సూపర్ స్టార్ కమల్ హాసన్. ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే కమల్ హాసన్ కు తెలుగునాట కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అటువంటి కమల్ హాసన్ సినీ కెరీర్ కు సెలవిచ్చి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. జయలలిత మరణానంతరం తమిళనాటు రాజకీయ శూన్యత ఉందని భావించిన కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టడానికి అదే సరియైన సమయం అనుకున్నారు. 2018లో మక్కల్ నాది మయ్యం పేరిట పార్టీ పెట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కమల్ ఏదో అనుకుంటే క్షేత్రంలో ఇంకేదో అయ్యింది. ఆ తర్వాత కూడా కొంతకాలం కేంద్రంలోని బిజెపిపై విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటూ వచ్చారు కమల్.
చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే విక్రమ్ సినిమా లో నటించారు. అది బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా కమల్ కు కోట్లకు కోట్లు ఆర్జించి పెట్టింది.

ఆ జోష్ లో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఆ యాత్రలో పాల్గొని రాహుల్ కు సంఘీభావం వ్యక్తం చేశారు కమల్. దాంతో బిజెపి వైపు నుండి కమల్ పై కౌంటర్లు పడిపోయాయి. ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ నేతకు మద్దతు పలికారా. అంటూ కమలనాథులు విమర్శించారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో తనకి కనక చైతన్యం ఉండి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలోనే పాదయాత్ర చేసి ఉండేవాడినని కమల్ దీటుగా స్పందించారు. దీని తర్వాత ఆయన పార్టీ వెబ్ సైట్ క్లోజ్ అయిపోవడంతో కమల్ హాసన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారంటూ ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక లోపాల వల్లనే వెబ్ సైట్ తాత్కాలికంగా క్లోజ్ అయ్యిందే తప్ప తాను కాంగ్రెస్ లో విలీనం కావడం లేదని కమల్ బదులిచ్చారు.

తెలుగునాట చిరంజీవి కూడా 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు ఆ ఎన్నికల్లో చిరంజీవిక్ బ్రహ్మాండంగానే ఓట్లు వచ్చాయి. 18శాతానికి పైగా ఓట్లు రావడమే కాదు 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే ఎన్నికల తర్వాత పార్టీని నడపడం కష్టంగా మారడంతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం పిలుపునివ్వడంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
కమల్ హాసన్ కూడా రాహుల్ గాంధీతో అటువంటి డీలే కుదుర్చుకున్నారని తమిళనాట ప్రచారం జరుగుతోంది. అయితే తమ రాజకీయ ప్రత్యర్ధులే ఇటువంటి పుకార్లు లేపుతున్నారని కమల్ అంటున్నారు. అయితే నిప్పులేందే పొగ రాదు కాబట్టి తమిళనాట ఏదో జరుగుతోందన్నది నిజమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.