కేసీఆర్ సరెండర్ సిగ్నల్స్ !

By KTV Telugu On 2 February, 2023
image

తెలగాణ సీఎం కేసీఆర్ మళ్లీ సైలెంట్ అయ్యారు. కానీ ఆ సారి సైలెన్స్ గతంలోలా వయోలెంట్‌గా ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. దీనికి కారణం గవర్నర్ విషయంలో సరెండర్ కావడంతో పాటు బడ్దెట్ విషయంలో స్పందించకపోవడం మరో కారణం. బీజేపీపై యుద్ధమే అని కేసీఆర్ పరుగు ప్రారంభించారు. కానీ దాన్ని తెలంగాణ దాటనీయడం లేదు. జాతీయ పార్టీగా మార్చాం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఎవరో ఒకరు ఉండాలన్నట్లుగా వట్టి పోయిన నేతల్ని ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు పిలిపించుకుని కండువాలు కప్పుతున్నారు కానీ చేతలు రాష్ట్రం దాటడం లేదు. దీంతో కేసీఆర్ సరెండర్ అయిపోయారా అన్న అనుమానాలు అభిప్రాయాలు తెలంగాణ రాజకీయాల్లో వినిపించడం ప్రారంభించాయి.

నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవు. నిజానికి తెలంగాణ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీ దండిగా నిధులు కేటాయిస్తుందని అనుకున్నారు. విడుదల చేసినా చేయకపోయినా కేటాయింపులు అయితే ఉంటాయనుకున్నారు. కానీ అవి కూడా చేయలేదు. కానీ కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. అయితే కేసీఆర్ ఇలా ప్రతి సందర్భంలో రారు కదా అనుకోవడానికి లేదు. 2022లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ ను ఎవరూ మర్చిపోలేరు. రెండు గంటల పాటు బీజేపీని చీల్చి చెండాడారు. తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. వదిలే ప్రశ్నే లేదన్నారు. నిలదీస్తామన్నారు. ఆయన ఆవేశం దేశంలోని విపక్షాలను కూడా ఆకర్షించింది. ఈ సారి ఎన్నికలున్న కర్ణాటకకు కూడా కొన్ని ప్రత్యేక నిధులు కేటాయించారు. అయినా కేసీఆర్ మాత్రం ఆవేశ పడలేదు. ప్రెస్ మీట్ పెట్టలేదు సరి కదా ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు.

తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీని కార్నర్ చేయడానికి ఇంత కంటే మంచి సమయం రాకపోవచ్చు. తెలంగాణ కోసం ఎంతో చేస్తున్నామని లక్షల కోట్ల నిధులిస్తున్నామని బీజేపీ చెబుతోంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ద్వారా ఆ పార్టీని టార్గెట్ చేయడానికి అవసరమైన స్టఫ్ ఇచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం వాటిని అందుకుని బీజేపీని కార్నర్ చేయడానికి సిద్ధం కాలేకపోతున్నారు. ఒక్క తెలంగాణ విషయంలోనే కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతగా జాతీయంగా బడ్జెట్ పై స్పందన వ్యక్తం చేస్తే జాతీయ మీడియా కూడా ప్రాధాన్యం ఇచ్చేది. కానీ కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కేసీఆర్ బుధవారం చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. చత్తీస్ ఘడ్‌లో బీఆర్ఎస్ ఆయనతో పొత్తు పెట్టుకోవడమో లేకపోతే కలిసి పని చేయడమో చేయడానికి అమిత్ జోగి అంగీకారం తెలిపారు. ఆయన పార్టీకి అక్కడ కనీస ఓటు బ్యాంక్ కూడా లేదు. అజిత్ జోగి పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఉన్న ఇమేజ్ వల్ల కొంత ఓటు బ్యాంక్ వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత అసలు ఆ పార్టీని చత్తీస్ ఘడ్‌లో పట్టించుకుంటున్న వారు లేరు. అయినా బీఆర్ఎస్ ఉనికి చత్తీస్ ఘడ్‌లో ఉండాలంటే అలాంటినేతల అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. కేంద్రంపై పోరాటానికి ఇవన్నీ చేస్తున్నా బడ్జెట్ పై స్పందనను కేసీఆర్ ఎందుకు వ్యక్తం చేయడం లేదనేది సస్పెన్స్ గా మారింది. కేసీఆర్ కాకుండా హరీష్ రావు, కవిత లేదా కేటీఆర్ ఎవరు బడ్జెట్ ను ఖండించినా అది ప్రకటనలే కానీ రాజకీయ స్పందన కిందకురాదు. కేసీఆరే స్పందించడమే అత్యంత కీలకం.

గవర్నర్ తమిళిసై పోరాటం అంటే బీజేపీపై యుద్ధం అనుకున్నట్లుగా పోరాడిన కేసీఆర్ చివరి క్షణంలో పూర్తిగా సరెండర్ అయిపోయారు. అసెంబ్లీ సమావేశాల విషయంలో గవర్నర్ ఏం చెప్పినా సరే ప్రభుత్వం అంగీకరిస్తోంది. చివరికి ప్రభుత్వం తరపున గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించాల్సిన ప్రసంగ పాఠాన్ని కూడా గవర్నర్ మార్చమంటే మార్చేస్తాం అని మారు మాట్లాడకుండా హామీ ఇచ్చి మారుస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పెట్టకూడదని గత సమావేశాలకు పొడిగింపు అని ప్రకటించారు. తర్వాత సీన్ మారిపోవడంతో గవర్నర్ తో అదే నోటిఫికేషన్ ఇప్పించారు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగించాలి కాబట్టి ప్రసంగ పాఠాన్ని ముందుగానే అధికారులు గవర్నర్ కు పంపారు. ఈ ప్రసంగంలో గవర్నర్ పలు మార్పులు సూచించారు గవర్నర్ ప్రసంగం సహజంగా కేబినెట్ ఆమోదించినదే ఉండాలి. కానీ ఎక్కడ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారో అని టీఆర్ఎస్ సర్కార్ కంగారు పడుతోంది. అందుకే ఆమె అడిగిన మార్పులు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. అయితే గవర్నర్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బీఆర్ఎస్ చీఫ్ ఒక్క సారిగా ఇలా సరెండర్ అయినట్లుగా వ్యవహరించడం మాత్రం అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది.

సాధారణంగా కేసీఆర్ ఓటమిని అంగీకరించరు. వెనుకబడటాన్ని కూడా ఒప్పుకోరు. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం అలాగే ఉంటున్నాయి. జాతీయ పార్టీగా మారిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ పార్టీ పెట్టక ముందు ఉన్నప్పటి దూకుడు తగ్గించారు. అందుకే అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠగా మారింది.