ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండో చార్జ్ షీట్ ను ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో 17 మందిపై అభియోగాలు మోపింది. వారిలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లు కూడా ఉన్నాయి. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్లో ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ మద్యం స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులను ఆప్ గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని ఈడీ పేర్కొంది.
అలాగే అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బినయ్ బాబులతోపాటు కావోగాలి రెస్టారెంట్, ట్రైడెంట్ లిమిటెడ్, పెరమండ్ రిసార్ట్, పాపులర్ స్పిరిట్, అవంతికా కాంట్రాక్టర్స్, కేఎస్ జయం స్పిరిట్, బడ్డీ రిటైల్స్, స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్, ఆర్మో మిక్స్ ఎకో సిస్టమ్ ల పేర్లను కూడా తమ చార్జిషీట్లో ఈడీ ప్రస్తావించింది.
ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ ను ఢిల్లీ సీబీఐ కోర్టు పరిగణం లోకి తీసుకుంది. విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తూ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ లో భాగంగా విచారించిన వారి జాబితాలో కవిత పేరును చేర్చింది ఈడీ. అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి లిస్టులోనూ ఆమె పేరును ప్రస్తావించింది. కవిత 10 ఫోన్లు మార్చినట్లు పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు చార్జ్ షీట్ లో ఈడీ ప్రస్తావించింది. అభిషేక్ నుంచి రూ.30 కోట్లు విజయ్ నాయర్ కు బదిలీ చేసినట్లు తెలిపింది.
ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ స్కామ్ కారణంగా ఢిల్లీ సర్కారుకు రూ. 2,873 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు చార్జ్‌షీట్‌లో స్పష్టంచేసింది ఈడీ. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో పాటు 14 మందిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు గుర్తుచేసింది. భారీ ఎత్తున అక్రమార్జన కోసం మద్యం పాలసీని తమకు అనుకూలంగా మల్చుకున్నారని తెలిపింది. ఈ కుట్రలో ఆప్‌కు మొత్తం రూ. 100 కోట్ల ముడుపులు అందాయని తెలిపింది. ఈ కేసులో సాక్షిగా ఇప్పటికే సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన ఇంట్లో విచారించారు. మరోసారి విచారణకు అందుబాటులో ఉండాలని అప్పుడే ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. చార్జీషీట్లో కవిత పేరు చేర్చడంపై బీఆర్ఎస్ స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి.